యెషయా 56

56
ఇతరులకు రక్షణ
1యెహోవా చెప్పే మాట ఇదే:
“నా రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది,
నా నీతి త్వరలో వెల్లడవుతుంది,
కాబట్టి న్యాయంగా ఉండండి
సరియైనది చేయండి.
2ఎవరైతే సబ్బాతును అపవిత్రం చేయకుండ
దానిని పట్టుదలతో ఆచరించేవారు,
ఏ కీడు చేయకుండ,
తమ చేతిని బిగబట్టుకునేవారు ధన్యులు.”
3యెహోవాను వెంబడించే ఏ విదేశీయుడైనా,
“యెహోవా తన ప్రజల్లో నుండి నన్ను వెలివేస్తారు” అని అనకూడదు.
ఏ నపుంసకుడైనా,
“నేను కేవలం ఎండిన చెట్టును” అని అనకూడదు.
4ఎందుకంటే యెహోవా చెప్పే మాట ఇదే:
“నేను నియమించిన సబ్బాతును పాటిస్తూ
నాకిష్టమైన వాటిని కోరుకుంటూ
నా నిబంధనకు నమ్మకంగా ఉండే నపుంసకులకు,
5నా మందిరంలో, నా గోడలలో,
కుమారులు, కుమార్తెలు కలిగి ఉన్న దానికన్న
శ్రేష్ఠమైన జ్ఞాపకార్థాన్ని, పేరును ఇస్తాను.
ఎప్పటికీ నిలిచివుండే
నిత్యమైన పేరు వారికి నేను ఇస్తాను.
6యెహోవాకు కట్టుబడి ఉంటూ
ఆయనకు సేవ చేస్తూ,
యెహోవా నామాన్ని ప్రేమిస్తూ,
ఆయన సేవకులుగా ఉంటూ
సబ్బాతును అపవిత్రపరచకుండా పాటిస్తూ,
నా నిబంధన నమ్మకంగా పాటిస్తున్న విదేశీయులందరిని
7నా పరిశుద్ధ పర్వతం దగ్గరకు తీసుకువస్తాను,
నా ప్రార్థన మందిరంలో వారికి ఆనందాన్ని ఇస్తాను.
నా బలిపీఠం మీద వారు అర్పించే
దహనబలులు అర్పణలు అంగీకరించబడతాయి;
నా మందిరం అన్ని దేశాలకు
ప్రార్థన మందిరం అని పిలువబడుతుంది.”
8ఇశ్రాయేలీయులలో బందీగా కొనిపోబడినవారిని సమకూర్చే
ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నారు:
“నేను సమకూర్చిన వారే కాకుండా
వారితో పాటు ఇతరులను సమకూర్చుతాను.”
దుష్టులపై దేవుని ఆరోపణ
9పొలం లోని సమస్త జంతువులారా, రండి,
అడవిలోని సమస్త మృగాల్లారా, వచ్చి తినండి!
10ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు.
వారందరికి తెలివిలేదు;
వారందరు మూగ కుక్కలు,
వారు మొరగలేరు;
వారు పడుకుని కలలు కంటారు,
నిద్రంటే వారికి ఇష్టము.
11వారు తిండి కోసం ఆరాటపడే కుక్కల వంటి వారు.
ఎంత తిన్నా వారికి తృప్తి ఉండదు.
వారు వివేచనలేని కాపరులుగా ఉన్నారు;
వారందరు తమకిష్టమైన దారుల్లో పోతారు,
తమ సొంత ప్రయోజనం చూసుకుంటారు.
12వారు, “రండి, నేను ద్రాక్షరసం తెప్పిస్తాను
మనం తృప్తిగా మద్యం త్రాగుదాం!
ఈ రోజులానే రేపు ఉంటుంది,
ఇంకా మంచిగా ఉంటుంది” అంటారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

యెషయా 56: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి