లేవీయ 20

20
పాపానికి శిక్షలు
1యెహోవా మోషేతో ఇలా అన్నారు, 2“ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలులో స్వదేశీయులు గాని విదేశీయులు గాని తమ పిల్లలను మోలెకు దేవతకు అర్పిస్తే అలాంటి వారికి మరణశిక్ష విధించాలి. సమాజం వారిని రాళ్లతో కొట్టి చంపాలి. 3వారు తమ పిల్లలను మోలెకుకు బలి ఇచ్చి నా పరిశుద్ధాలయాన్ని అపవిత్రం చేశారు, నా పవిత్ర నామాన్ని అపవిత్రం చేశారు కాబట్టి నేను వారికి విరోధిగా మారి ప్రజల్లో నుండి వారిని తొలగిస్తాను. 4ఎవరైన తమ పిల్లలను మోలెకుకు అర్పించినప్పుడు మీ దేశ ప్రజలు చూసి చూడనట్లు తమ కళ్లు మూసుకుని వారిని చంపకుండా వదిలేస్తే, 5స్వయంగా నేనే వారికి వారి కుటుంబానికి వ్యతిరేకంగా మారి వారిని వారితో పాటు కలిసి మోలెకుతో వ్యభిచరించే వారినందరిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.
6“ ‘మృతుల ఆత్మలతో మాట్లాడేవారితో సోదె చెప్పేవారితో వ్యభిచారం చేయడానికి వారిని అనుసరించేవారికి నేను విరోధిగా మారి వారిని ప్రజల్లో నుండి తొలగిస్తాను.
7“ ‘నేనే మీ దేవుడైన యెహోవాను కాబట్టి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని పవిత్రంగా ఉండాలి. 8నా శాసనాలను పాటించి వాటి ప్రకారం నడుచుకోండి. మిమ్మల్ని పరిశుద్ధపరచే యెహోవాను నేనే.
9“ ‘తన తండ్రిని గాని తల్లిని గాని దూషించే వారికి మరణశిక్ష విధించాలి. వారు తన తండ్రిని తల్లిని శపించారు కాబట్టి వారి మరణానికి వారే బాధ్యులు.
10“ ‘మరొకని భార్యతో అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి ఇద్దరికి మరణశిక్ష విధించాలి.
11“ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
12“ ‘ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం కలిగియుంటే, వారిద్దరినీ చంపేయాలి; వారు వక్రబుద్ధికి పాల్పడ్డారు; వారి మరణానికి వారే బాధ్యులు.
13“ ‘ఒకడు స్త్రీతో ఉన్నట్టు మరో పురుషునితో లైంగిక సంబంధం కలిగివుంటే వారిద్దరు హేయమైనది చేశారు కాబట్టి వారికి మరణశిక్ష విధించాలి. వారి మరణానికి వారే బాధ్యులు.
14“ ‘ఒకడు స్త్రీని, ఆమె తల్లిని కూడా పెళ్ళి చేసుకోవడం దుర్మార్గము. అతడిని వారిద్దరు అగ్నిలో కాల్చివేయాలి. అప్పుడు మీ మధ్యలో దుర్మార్గం ఉండదు.
15“ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న వానికి మరణశిక్ష విధించాలి, ఆ జంతువును చంపాలి.
16“ ‘ఒక స్త్రీ లైంగిక సంబంధం కోసం జంతువు దగ్గరకు వెళ్లితే, ఆ స్త్రీని ఆ జంతువు చంపాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
17“ ‘ఒకడు తన సోదరిని అనగా తన తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని పెళ్ళి చేసుకుని వారికి లైంగిక సంబంధం ఉంటే, అది అపకీర్తి. వారిని బహిరంగంగా వారి ప్రజల ఎదుట శిక్షించాలి. అతడు తన సోదరిని అగౌరపరిచాడు కాబట్టి అతడే బాధ్యత వహించాలి.
18“ ‘ఒకడు నెలసరిలో ఉన్న స్త్రీతో లైంగిక సంబంధం పెట్టుకుంటే అతడు ఆమె రక్తస్రావాన్ని బహిర్గతం చేశాడు, ఆమె కూడ దానిని బయటపెట్టింది. కాబట్టి వారిద్దరిని ప్రజల్లో నుండి తొలగించాలి.
19“ ‘మీ తల్లి సోదరితో గాని మీ తండ్రి సోదరితో గాని లైంగిక సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే అది రక్తసంబంధాన్ని అగౌరపరచడమే; వారి శిక్షకు వారే బాధ్యులు.
20“ ‘ఒకడు తన అత్తతో లైంగిక సంబంధం పెట్టుకుంటే, అతడు మామను అగౌరపరచినట్టు. వారి పాపశిక్షకు వారే బాధ్యులు; వారు సంతానం లేకుండా చస్తారు.
21“ ‘ఒకడు తన సోదరుని భార్యను పెళ్ళి చేసుకోవడం అపవిత్రమైన పని; అతడు తన సోదరున్ని అగౌరపరచినట్టే వారికి సంతానం కలుగదు.
22“ ‘నా శాసనాలను చట్టాలన్నిటిని పాటించండి, వాటిని అనుసరించండి, తద్వారా మీరు నివసించడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశం మిమ్మల్ని వెళ్లగ్రక్కదు. 23నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టబోయే జనాల ఆచారాల ప్రకారం మీరు జీవించకూడదు. వారు అలాంటివి చేశారు కాబట్టి నేను వారిని అసహ్యించుకున్నాను. 24కానీ నేను మీతో, “మీరు వారి భూమిని స్వాధీనం చేసుకుంటారు; పాలు తేనెలు ప్రవహించే భూమిని నేను మీకు వారసత్వంగా ఇస్తాను” అని చెప్పాను. దేశాల్లో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
25“ ‘అందువల్ల మీరు పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు, పవిత్రమైన పక్షులకు అపవిత్రమైన పక్షులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అపవిత్రమైనవని మీకు వేరుచేసి చెప్పిన ఏ జంతువు వలన గాని పక్షి వలన గాని నేల మీద ప్రాకే దేనివలన గాని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 26మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, జనాల్లో నుండి నేను మిమ్మల్ని నా సొంతవారిగా ప్రత్యేకించుకున్నాను.
27“ ‘మీ మధ్య స్త్రీలలో గాని పురుషులలో గాని మృతుల ఆత్మలతో మాట్లాడేవారు లేదా సోదె చెప్పేవారు వారికి మరణశిక్ష విధించాలి. వారిని రాళ్ళతో కొట్టాలి; వారి మరణానికి వారే బాధ్యులు.’ ”

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయ 20: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి