లేవీయ 7

7
అపరాధ బలి
1“ ‘అతిపరిశుద్ధమైన, అపరాధపరిహారబలికి సంబంధించిన నియమాలు ఇవి: 2దహనబలి వధించబడిన స్థలంలోనే అపరాధపరిహారబలిని వధించాలి, దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి. 3దాని కొవ్వంతా అనగా క్రొవ్విన తోక, లోపలి అవయవాలపై ఉన్న క్రొవ్వు, 4రెండు మూత్రపిండాలు, నడుము దగ్గర వాటి మీద ఉన్న క్రొవ్వు, మూత్రపిండాలతో పాటు తొలగించే కాలేయం మీది క్రొవ్వు అర్పించాలి. 5యెహోవాకు అర్పించిన హోమబలిగా యాజకుడు వాటిని బలిపీఠం మీద కాల్చివేయాలి. ఇది అపరాధపరిహారబలి. 6యాజకుల కుటుంబాలలో ప్రతి పురుషుడు దాన్ని పరిశుద్ధాలయ ప్రాంగణంలో తినవచ్చు; అది అతిపరిశుద్ధము.
7“ ‘అదే నియమం పాపపరిహారబలి, అపరాధపరిహారబలి, రెండింటికీ వర్తిస్తుంది: వాటితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అవి చెందుతాయి. 8దహనబలి తెచ్చినప్పుడు దాన్ని అర్పించే యాజకునికి ఆ బలి పశువు చర్మం చెందుతుంది. 9ప్రతి భోజనార్పణ, పొయ్యిమీద వండిందైనా కుండలో లేదా పెనం మీద చేయబడినదైనా గాని, అర్పించే యాజకునికి చెందుతుంది. 10ప్రతి భోజనార్పణ, ఒలీవనూనెతో కలిపినదైనా లేదా పొడిగా ఉన్నదైనా, అహరోను కుమారులందరికి సమానంగా చెందుతుంది.
సమాధానబలి
11“ ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలి సమర్పించాలంటే నియమాలు ఇవి:
12“ ‘ఒకవేళ వారు దానిని కృతజ్ఞత అర్పణగా అర్పిస్తే, కృతజ్ఞతార్పణతో పాటు వారు ఒలీవనూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు, నూనె రాసి తయారుచేసిన పులియని సన్నని రొట్టెలు, నూనె కలిపి మెత్తగా పిసికిన నాణ్యమైన పిండితో తయారుచేసిన మందమైన రొట్టెలు అర్పించాలి. 13కృతజ్ఞతతో కూడిన సమాధానబలితో పాటు వారు పులిసిన మందమైన రొట్టెలను సమర్పించాలి. 14వారు ప్రతి దానిలో నుండి ఒకదాన్ని అర్పణగా, యెహోవాకు ప్రత్యేక నైవేద్యంగా తీసుకురావాలి; అది బలిపీఠం వైపు సమాధానబలి రక్తాన్ని ప్రోక్షించిన యాజకునికి చెందుతుంది. 15కృతజ్ఞతతో అర్పించిన సమాధానబలి మాంసం అది అర్పించిన రోజే వారు తినాలి; ఉదయం వరకు అందులో దేన్ని మిగిలించకూడదు.
16“ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు. 17మూడవ రోజు ఆ బలి మాంసంలో ఏమైనా మిగిలితే దానిని కాల్చివేయాలి. 18సమాధానబలి మాంసం మూడవ రోజు కాబట్టి తింటే దానిని అర్పించిన వారు అంగీకరించబడరు. తెచ్చిన వానికి గుర్తింపు ఉండదు, ఎందుకంటే అది అపవిత్రమైంది; కాబట్టి దానిలో ఏదైన తింటే వారు దోషశిక్షను భరిస్తారు.
19“ ‘మాంసానికి ఏదైనా ఆచారరీత్య అపవిత్ర పదార్థం తగిలితే అది తినకూడదు. అది కాల్చివేయాలి. ఇతర మాంసం అయితే ఆచార ప్రకారం శుభ్రంగా ఉన్నవారు తినవచ్చు. 20కాని అపవిత్రంగా ఉన్న ఎవరైనా యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి. 21ఎవరైనా అపవిత్రమైన దాన్ని అది మానవ అపవిత్రత గాని అపవిత్రమైన జంతువునే గాని నేలపై ప్రాకే జీవులనే గాని తాకి, యెహోవాకు చెందిన సమాధానబలి మాంసం తింటే, వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
క్రొవ్వు రక్తం తినడం నిషేధం
22యెహోవా మోషేతో ఇలా అన్నారు, 23“నీవు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పు: ‘పశువులదే గాని గొర్రెలదే గాని లేదా మేకలదే గాని క్రొవ్వును మీరు తినకూడదు. 24చచ్చిన జంతువు క్రొవ్వును లేదా అడవి మృగాలు చీల్చిన జంతువు క్రొవ్వును దేనికైనా ఉపయోగించవచ్చు కాని దానిని తినకూడదు. 25ఎవరైనా యెహోవాకు హోమబలిగా అర్పించే జంతువు యొక్క క్రొవ్వును తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి. 26మీరు నివసించే చోట పక్షి రక్తం గాని, జంతు రక్తం గాని తినకూడదు. 27ఎవరైనా రక్తాన్ని తింటే వారు తమ ప్రజల్లో నుండి తొలగించబడాలి.’ ”
యాజకుల వాటా
28యెహోవా మోషేతో ఇలా అన్నారు, 29“నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఎవరైనా యెహోవాకు సమాధానబలిని తెస్తే, దానిలో ఒక భాగాన్ని ప్రత్యేకంగా యెహోవాకు అర్పించాలి. 30వారు తమ స్వహస్తాలతో హోమబలిని యెహోవాకు అర్పించాలి; వారు రొమ్ము భాగాన్ని దాని మీద ఉన్న క్రొవ్వుతో పాటు తెచ్చి, ఆ రొమ్ము భాగాన్ని యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. 31యాజకుడు ఆ క్రొవ్వును బలిపీఠం మీద దహించాలి, కాని రొమ్ము భాగం అహరోను, అతని కుమారులకు చెందుతుంది. 32సమాధానబలులలో నుండి తీసిన కుడి తొడను యాజకునికి కానుకగా ఇవ్వాలి. 33అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు. 34ఇశ్రాయేలీయుల సమాధానబలులలో నుండి నేను పైకెత్తిన రొమ్ము భాగాన్ని, అర్పించిన తొడను తీసుకుని యాజకుడైన అహరోనుకు అతని కుమారులకు ఇశ్రాయేలీయుల నుండి శాశ్వత వాటాగా ఇచ్చాను.’ ”
35ఇది యెహోవాకు అర్పించిన హోమబలులలో అహరోను, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా సేవ చేయడానికి సమర్పించబడిన రోజున వారికి కేటాయించబడిన వాటా. 36వారు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు రాబోయే తరాలకు తమ శాశ్వత వాటాగా ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించారు.
37దహనబలికి, భోజనార్పణకు, పాపపరిహారబలికి, అపరాధపరిహారబలికి, ప్రతిష్ఠార్పణకు, సమాధానబలికి ఇవి నియమాలు, 38వీటిని ఇశ్రాయేలీయులు తమ అర్పణలను యెహోవా దగ్గరకు తీసుకురావాలని ఆజ్ఞాపించిన రోజున యెహోవా సీనాయి అరణ్యంలోని సీనాయి పర్వతం దగ్గర మోషేకు ఇచ్చారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

లేవీయ 7: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి