లూకా సువార్త 12:42-48

లూకా సువార్త 12:42-48 OTSA

అందుకు ప్రభువు, “యజమాని తన ఇంటి సేవకులకు సమయానికి వారి భోజన వేతనం ఇచ్చే బాధ్యతను అప్పగించడానికి, నమ్మకమైన, జ్ఞానం కలిగిన నిర్వాహకుడు ఎవడు? యజమాని తిరిగి వచ్చినప్పుడు అలా చేస్తూ కనిపించడం ఆ సేవకునికి మేలు. ఆ యజమాని తన యావదాస్తి మీద అతన్ని అధికారిగా ఉంచుతాడని నేను మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాని ఒకవేళ ఆ సేవకుడు, ‘నా యజమాని తిరిగి రావడం ఆలస్యం చేస్తున్నాడని’ తన మనస్సులో అనుకుని, తన తోటి సేవకులను, పురుషులు స్త్రీలను కూడా కొట్టడం మొదలుపెట్టి, తింటూ త్రాగుతూ మత్తులో ఉండి! అతడు ఊహించని రోజున ఊహించని సమయంలో యజమాని వస్తాడు, అతడు వాన్ని ముక్కలుగా నరికి అవిశ్వాసులతో అతనికి చోటు ఇస్తాడు. “ఏ సేవకుడైతే తన యజమానుని చిత్తాన్ని ఎరిగి కూడా దాని ప్రకారం సిద్ధపడి తన యజమాని కోరుకున్నట్లుగా చేయడో వాడు అనేక దెబ్బలు తింటాడు. అయితే తెలియక శిక్షకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే పడతాయి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడిందో వాని నుండి ఎక్కువ తీసుకుంటారు; ఎవనికి ఎక్కువ అప్పగించబడిందో, వాని నుండి ఎక్కువ అడుగుతారు.”