లూకా సువార్త 17:1-10

లూకా సువార్త 17:1-10 OTSA

యేసు తన శిష్యులతో, “ప్రజలను ఆటంకపరిచే శోధనలు తప్పకుండా వస్తాయి, కాని అవి ఎవరి వలన వస్తాయో, వానికి శ్రమ. ఎవడైనా ఈ చిన్నపిల్లల్లో ఒకరికి ఆటంకంగా ఉండడం కన్నా, వాని మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయబడితే వానికి మేలు. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. “ఒకవేళ నీ సహోదరుడు గాని సహోదరి గాని నీ ఎడల పాపం చేస్తే, వారిని గద్దించండి; వారు పశ్చాత్తాపపడితే, వారిని క్షమించండి. వారు ఒకే రోజు నీకు వ్యతిరేకంగా ఏడుసార్లు తప్పు చేసి తాము చేసిన తప్పును బట్టి ‘నేను పశ్చాత్తాపపడుతున్నాను’ అంటూ నీ దగ్గరకు వస్తే, నీవు వారిని తప్పక క్షమించాలి.” అప్పుడు అపొస్తలులు, “ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి!” అని అడిగారు. అందుకు ఆయన, “మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఈ మారేడు చెట్టును చూసి, ‘నీవు వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో నాటబడు’ అని చెప్తే అది మీకు లోబడుతుంది. “మీలో ఎవనికైనా దున్నడానికి లేదా మేపడానికి సేవకుడు ఉన్నాడనుకోండి. వాడు పొలంలో పని చేసి ఇంటికి రాగానే, అతని యజమాని, ఆ సేవకునితో, ‘భోజనం చేద్దాం రా అని వానిని పిలుస్తాడా?’ దాని బదులు, ‘ముందుగా నాకు భోజనం సిద్ధం చేసి, నీవు సిద్ధపడి నేను తిని త్రాగే వరకు నా సేవ చేయి, ఆ తర్వాత నీవు తిని త్రాగవచ్చు’ అని చెప్పుతాడు కదా! తాను చెప్పినట్లే సేవకుడు చేశాడని యజమాని వానికి వందనాలు చెప్తాడా? అలాగే మీరు కూడా, మీకు అప్పగించబడిన పనులన్నీ చేసిన తర్వాత, ‘మేము యోగ్యత లేని సేవకులం; మా పని మాత్రమే మేము చేశాం’ అని చెప్పాలి” అని అన్నారు.