మార్కు సువార్త 15

15
పిలాతు ముందు యేసు
1తెల్లవారుజామున ముఖ్య యాజకులు, నాయకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు న్యాయసభ సభ్యులు అందరు కలిసి ఆలోచన చేశారు. కాబట్టి వారు యేసును బంధించి, తీసుకెళ్లి అధిపతియైన పిలాతు చేతికి అప్పగించారు.
2పిలాతు యేసును, “నీవు యూదుల రాజువా?” అని అడిగాడు.
అందుకు యేసు, “అని నీవే అన్నావు” అని జవాబిచ్చారు.
3ముఖ్య యాజకులు యేసు మీద అనేక నేరాలు మోపారు. 4అందుకు పిలాతు మళ్ళీ యేసుతో, “నీవు వారికి జవాబు చెప్పవా? వారు నీకు వ్యతిరేకంగా ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు!” అన్నాడు.
5కాని యేసు జవాబివ్వలేదు, కాబట్టి పిలాతు ఆశ్చర్యపోయాడు.
6పండుగ రోజు ప్రజల కోరిక మేరకు ఒక నేరస్థుని విడుదల చేయడం ఆనవాయితి. 7తిరుగుబాటు చేసి, మనుష్యులను చంపినందుకు బంధింపబడిన వారిలో బరబ్బా అనేవాడు ఉన్నాడు. 8ప్రజలు గుంపుగా వచ్చి, అతడు ఎప్పుడూ చేసినట్లే చేయమని పిలాతును కోరారు.
9-10ముఖ్య యాజకులు కేవలం అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు, కాబట్టి, “యూదుల రాజును విడుదల చేయమంటారా?” అని అడిగాడు. 11కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బాను విడుదల చేసేలా పిలాతును కోరమని గుంపును రెచ్చగొట్టారు.
12అందుకు పిలాతు, “మరి, మీరు యూదుల రాజు అని పిలిచే ఇతన్ని ఏమి చేయమంటారు?” అని వారిని అడిగాడు.
13అందుకు వారు, “సిలువ వేయండి!” అని అరిచారు.
14“ఎందుకు? ఇతడు చేసిన నేరమేంటి?” అని పిలాతు అడిగాడు.
అయితే వారు ఇంకా గట్టిగా, “అతన్ని సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
15పిలాతు ఆ ప్రజలను సంతోషపెట్టడానికి, బరబ్బను వారికి విడుదల చేశాడు. యేసును కొరడాలతో కొట్టించి, సిలువ వేయడానికి అప్పగించాడు.
యేసును హేళన చేసిన సైనికులు
16సైనికులు యేసును ప్రేతోర్యము అని పిలువబడే అధిపతి భవనం లోనికి తీసుకెళ్లి అక్కడ మిగిలిన సైనికులందరిని సమకూర్చారు. 17వారు ఆయనకు ఊదా రంగు అంగీని వేసి, ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. 18ఆ తర్వాత, “జయం, యూదుల రాజా!” అని ఆయనను పిలవడం మొదలుపెట్టారు. 19ఆయన తలపై కొమ్మతో పదే పదే కొడుతూ, ఆయన మీద ఉమ్మి వేశారు. వారు ఆయన ముందు మోకరించి, ఆయనను అవమానిస్తూ నమస్కరించారు. 20ఈ విధంగా ఆయనను ఎగతాళి చేసిన తర్వాత, ఆయన మీదనున్న ఊదా రంగు వస్త్రాన్ని తీసివేసి, ఆయన వస్త్రాలను ఆయనకే తొడిగించారు. తర్వాత ఆయనను సిలువ వేయడానికి తీసుకెళ్లారు.
సిలువవేయబడిన యేసు
21కురేనీ ప్రాంతానికి చెందిన, అలెగ్జాండరు రూఫసు అనేవారి తండ్రియైన సీమోను ఆ మార్గాన వెళ్తున్నాడు. సైనికులు అతన్ని పట్టుకుని సిలువ మోయమని బలవంతం చేశారు. 22వారు యేసును గొల్గొతా అనే స్థలానికి తీసుకుని వచ్చారు. గొల్గొతా అంటే “కపాల స్థలం” అని అర్థము. 23అప్పుడు వారు బోళం కలిపిన ద్రాక్షరసాన్ని ఆయనకు ఇచ్చారు, కాని ఆయన దానిని తీసుకోలేదు. 24ఆ తర్వాత వారు ఆయనను సిలువ వేశారు. ఆయన వస్త్రాలను పంచుకోడానికి, వారు చీట్లు వేసి ఎవరికి వచ్చింది వారు తీసుకున్నారు.
25ఆయనను సిలువ వేసినప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటలు అయ్యింది. 26ఆయనపై ఉన్న నేరం యొక్క వ్రాతపూర్వక ఉత్తర్వు ఇలా ఉంది:
యూదుల రాజు.
27తిరుగుబాటు చేసిన ఇద్దరు బందిపోటు దొంగలను, ఆయనకు కుడి వైపున ఒకడిని, ఎడమవైపున మరొకడిని సిలువ వేశారు. 28ఆయన అపరాధులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని వ్రాయబడినది.#15:28 కొన్ని ప్రతులలో ఈ వచనాలు ఇక్కడ చేర్చబడలేదు 29ఆ దారిలో వెళ్తున్నవారు తలలు ఊపుతూ, “దేవాలయాన్ని పడగొట్టి మూడు దినాల్లో తిరిగి కడతానన్నావు నీవే కదా! 30సిలువ మీద నుండి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో!” అని అంటూ దూషించారు. 31అలాగే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయనను ఎగతాళి చేశారు, “వీడు ఇతరులను రక్షించాడు, కాని తనను తాను రక్షించుకోలేడు. 32ఈ క్రీస్తు, ఇశ్రాయేలీయుల రాజు, మేము చూసి నమ్మేలా ఇప్పుడు సిలువ నుండి దిగిరా” అని ఆయనను హేళన చేశారు. ఆయనతో కూడా సిలువవేయబడిన వారు కూడా ఆయనపై అవమానాలు గుప్పించారు.
యేసు మరణము
33మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఆ దేశమంతా చీకటి కమ్మింది. 34మూడు గంటలకు యేసు, “ఎలోయి, ఎలోయి, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటలకు, “నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావు?”#15:34 కీర్తన 22:1 అని అర్థము.
35దగ్గర నిలబడిన వారిలో కొందరు ఆ మాటలను విని, “వినండి, ఇతడు ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.
36ఒకడు పరుగెత్తుకొని వెళ్లి, ఒక స్పంజీని పుల్లని ద్రాక్షరసంలో ముంచి ఒక కర్రకు తగిలించి, యేసుకు త్రాగడానికి అందించాడు. “ఇప్పుడు వీన్ని ఒంటరిగా వదిలి వేద్దాము. ఏలీయా వచ్చి వీన్ని క్రిందికి దించుతాడేమో చూద్దాం” అన్నాడు.
37గొప్ప కేక వేసి, యేసు ప్రాణం విడిచారు.
38అప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగిపోయింది. 39యేసుకు ఎదురుగా నిలబడి ఉన్న శతాధిపతి, ఆయన ప్రాణం విడవడం చూసి, “నిజంగా ఈయన దేవుని కుమారుడే!” అన్నాడు.
40కొందరు స్త్రీలు దూరం నుండి చూస్తున్నారు. వారిలో మగ్దలేనే మరియ, చిన్నవాడైన యాకోబు యోసేపుల తల్లియైన మరియ ఇంకా సలోమి ఉన్నారు. 41ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరు ఆయనను వెంబడించి, ఆయనకు సేవ చేశారు, వీరే కాక ఆయన వెంట యెరూషలేముకు వచ్చిన అనేకమంది స్త్రీలు కూడ అక్కడ ఉన్నారు.
యేసు సమాధి
42అది సిద్ధపాటు రోజు అనగా సబ్బాతు దినానికి ముందు రోజు. కాబట్టి సాయంకాలమైనప్పుడు, 43అరిమతయికు చెందిన యోసేపు న్యాయసభలో ప్రాముఖ్యమైన సభ్యుడు, దేవుని రాజ్యం కోసం ఎదురు చూస్తున్నవాడు, అతడు ధైర్యంగా పిలాతు దగ్గరకు వెళ్లి యేసు దేహాన్ని తనకు ఇమ్మని అడిగాడు. 44ఆయన అప్పటికే చనిపోయాడని విన్న పిలాతు ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతిని తన దగ్గరకు పిలిచి, యేసు అప్పుడే చనిపోయాడా అని అడిగాడు. 45శతాధిపతి నుండి ఆ సంగతిని తెలుసుకున్నాక, యోసేపుకు యేసు శరీరాన్ని అప్పగించాడు. 46కాబట్టి యోసేపు సన్నని నారబట్ట కొని తెచ్చి, యేసు దేహాన్ని క్రిందికి దింపి, నారబట్టతో చుట్టి, రాతితో చెక్కబడిన సమాధిలో పెట్టాడు. తర్వాత ఆ సమాధి ద్వారం ముందు ఒక పెద్ద రాయి దొర్లించి దానిని మూసి వేశాడు. 47మగ్దలేనే మరియ, యోసేపు తల్లియైన మరియ ఆయనను పెట్టిన చోటును చూశారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

మార్కు సువార్త 15: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి