కీర్తనలు 119

119
కీర్తన 119#119 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.
א ఆలెఫ్
1నిందారహిత మార్గాలను అనుసరిస్తూ,
యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు.
2ఆయన శాసనాలను పాటిస్తూ
తమ హృదయమంతటితో ఆయనను వెదకేవారు ధన్యులు,
3వారు అన్యాయం చేయక
ఆయన మార్గాలను అనుసరిస్తారు.
4అత్యంత జాగ్రత్తగా పాటించాలని
మీరు వారికి శాసనాలిచ్చారు.
5మీ శాసనాలను అనుసరించుటలో
నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది!
6అప్పుడు మీ ఆజ్ఞలను లక్ష్యపెట్టినప్పుడు
నేను అవమానపాలు కాను.
7నేను మీ నీతి న్యాయవిధులను తెలుసుకున్న కొలది
యథార్థ హృదయంతో నేను మిమ్మల్ని స్తుతిస్తాను.
8నేను మీ శాసనాలకు లోబడతాను.
దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి.
ב బేత్
9యువత పవిత్ర మార్గంలో ఎలా ఉండగలరు?
మీ వాక్యాన్ని అనుసరించి జీవించడం వల్లనే.
10నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను;
మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.
11నేను మీకు విరోధంగా పాపం చేయకూడదని
మీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నాను.
12యెహోవా, మీకు స్తుతి కలుగును గాక;
మీ శాసనాలను నాకు బోధించండి.
13మీ నోట నుండి వచ్చే న్యాయవిధులన్నిటిని
నా పెదవులతో వివరిస్తాను.
14ఒకడు గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి సంతోషించునట్లు
నేను మీ శాసనాలను పాటించడంలో సంతోషిస్తాను.
15మీ శాసనాలను నేను ధ్యానిస్తాను
మీ మార్గాలను పరిగణిస్తాను.
16మీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తాను;
నేను మీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయను.
ג గీమెల్
17నేను బ్రతికి ఉండి మీ వాక్యానికి లోబడేలా,
మీ సేవకునిపట్ల దయగా ఉండండి.
18మీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యకరమైన వాటిని
నేను చూడగలిగేలా నా కళ్లు తెరవండి.
19ఈ లోకంలో నేను అపరిచితున్ని;
మీ ఆజ్ఞలను నా నుండి దాచిపెట్టకండి.
20అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం
తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది.
21శపించబడినవారైన అహంకారులను మీరు గద్దిస్తారు,
వారు మీ ఆజ్ఞల నుండి తొలగిపోయినవారు.
22నేను మీ శాసనాలను పాటిస్తున్నాను,
వారి అపహాస్యాన్ని ధిక్కారాన్ని నా నుండి తొలగించండి.
23పాలకులు కలిసి కూర్చుని నన్ను అపవాదు చేసినప్పటికీ,
మీ సేవకుడు మీ శాసనాలను ధ్యానిస్తాడు.
24మీ శాసనాలే నాకు ఆనందం;
అవి నాకు ఆలోచన చెప్తాయి.
ד దాలెత్
25నేను నేల మీద పడిపోయాను;
మీ మాట ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
26నా జీవిత పరిస్థితులను మీకు వివరించాను, మీరు నాకు జవాబిచ్చారు;
మీ శాసనాలు నాకు బోధించండి.
27నేను మీ కట్టడల అర్థాన్ని గ్రహించేలా చేయండి,
తద్వారా మీ అద్భుత కార్యాలను నేను ధ్యానిస్తాను.
28దుఃఖం చేత నా ప్రాణం క్రుంగిపోతుంది;
మీ వాక్యం ద్వారా నన్ను బలపరచండి.
29మోసపూరిత మార్గాల నుండి నన్ను తప్పించండి;
నా మీద దయచూపి మీ ధర్మశాస్త్రం నాకు బోధించండి.
30నేను నమ్మకత్వం అనే మార్గం ఎంచుకున్నాను;
మీ న్యాయవిధులపై నా హృదయాన్ని నిలుపుకున్నాను.
31యెహోవా, మీ శాసనాలను గట్టిగా పట్టుకుని ఉంటాను;
నాకు అవమానం కలగనివ్వకండి.
32మీ ఆజ్ఞల మార్గాన నేను పరుగెడతాను,
ఎందుకంటే మీరు నా గ్రహింపును విశాలపరిచారు.
ה హే
33యెహోవా, మీ శాసనాల విధానాన్ని నాకు బోధించండి,
అంతం వరకు నేను వాటిని అనుసరిస్తాను.#119:33 లేదా బహుమానం కోసం
34మీ ధర్మశాస్త్రం నేను అనుసరించేలా
హృదయపూర్వకంగా వాటికి విధేయత చూపేలా,
నాకు గ్రహింపు దయచేయండి.
35మీ ఆజ్ఞల మార్గాన నన్ను నడిపించండి,
అక్కడే నాకు ఆనందము.
36నా హృదయాన్ని అన్యాయపు లాభం వైపు కాక
మీ శాసనాల వైపుకు త్రిప్పండి.
37పనికిరాని వాటినుండి నా కళ్లను త్రిప్పండి;
మీ మార్గాల#119:37 కొ. ప్రా.ప్ర. లలో మీ వాక్కు ద్వార నా జీవితాన్ని కాపాడండి.
38మీ సేవకునిపట్ల మీ మాటను నెరవేర్చండి,
తద్వారా ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
39నాకు భయం కలిగిస్తున్న అవమానాన్ని తొలగించండి,
ఎందుకంటే మీ న్యాయవిధులు మేలైనవి.
40మీ కట్టడల కోసం నేను ఎంతగా తహతహ లాడుతున్నాను!
మీ నీతిలో నా జీవితాన్ని కాపాడండి.
ו వావ్
41యెహోవా, మీ మారని ప్రేమ,
మీ వాగ్దాన ప్రకారం, మీ రక్షణ నాకు వచ్చును గాక.
42అప్పుడు నన్ను నిందించే వారెవరికైనా నేను సమాధానం చెప్పగలను,
ఎందుకంటే మీ మాట మీద నాకు నమ్మకము.
43మీ సత్య వాక్యాన్ని ఎప్పుడూ నా నోటి నుండి తీసివేయకండి,
ఎందుకంటే నేను మీ న్యాయవిధులలో నా నిరీక్షణ ఉంచాను.
44నేను ఎల్లప్పుడు అంటే నిరంతరం,
మీ ధర్మశాస్త్రానికి లోబడతాను.
45నేను మీ కట్టడలను వెదికాను,
కాబట్టి స్వేచ్ఛలో నడుచుకుంటాను.
46రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను
నేను సిగ్గుపడను,
47నేను మీ ఆజ్ఞలలో ఆనందిస్తాను
ఎందుకంటే అవంటే నాకు ప్రేమ.
48నేను ప్రేమించే మీ ఆజ్ఞల వైపు నా చేతులెత్తుతాను,
తద్వారా నేను మీ శాసనాలను ధ్యానిస్తాను.
ז జాయిన్
49మీ సేవకునికి మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకోండి,
ఎందుకంటే మీరు నాకు నిరీక్షణ కలిగించారు.
50నా శ్రమలో నా ఆదరణ ఇదే:
మీ వాగ్దానం నన్ను బ్రతికిస్తుంది.
51అహంకారులు కనికరం లేకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు,
కాని నేను మీ ధర్మశాస్త్రం నుండి తిరిగిపోను.
52యెహోవా, మీ అనాది న్యాయవిధులు నాకు జ్ఞాపకం ఉన్నాయి,
వాటిలో నాకెంతో ఆదరణ.
53మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టిన దుష్టులను బట్టి,
నాకు చాలా కోపం వస్తుంది.
54నేను ఎక్కడ బస చేసినా
మీ శాసనాలే నా పాటల సారాంశము.
55యెహోవా, నేను నీ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి
రాత్రివేళ మీ పేరును జ్ఞాపకం చేసుకుంటున్నాను.
56నేను మీ కట్టడలకు విధేయత చూపుతాను
ఇది నాకు అభ్యాసంగా ఉన్నది.
ח హేత్
57యెహోవా, మీరే నా వాటా;
మీ మాటలకు లోబడతానని నేను మాటిచ్చాను.
58నేను నా హృదయపూర్వకంగా మీ దయ కోసం వెదికాను;
మీ వాగ్దానం మేరకు నా మీద దయచూపండి.
59నేను నా మార్గాలను గమనించి
నా అడుగులను మీ శాసనాల వైపుకు త్రిప్పుకున్నాను.
60మీ ఆజ్ఞలను అనుసరించడానికి
నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను.
61దుష్టులు నన్ను త్రాళ్లతో ఉచ్చులా బిగించినా,
నేను మీ ధర్మశాస్త్రం మరచిపోను.
62మీ నీతిగల న్యాయవిధులను బట్టి
మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి నేను మధ్యరాత్రి లేస్తున్నాను.
63మీకు భయపడేవారందరికి,
మీ కట్టడలను అనుసరించే వారందరికి నేను స్నేహితుడను.
64యెహోవా, ఈ లోకమంతా మీ మారని ప్రేమ చేత నిండి ఉంది;
మీ శాసనాలు నాకు బోధించండి.
ט టేత్
65యెహోవా, మీ మాట ప్రకారం
మీ సేవకునికి మేలు చేయండి.
66నేను మీ ఆజ్ఞలను నమ్ముకున్నాను,
నాకు సరియైన వివేచనను గ్రహింపును బోధించండి.
67నాకు బాధ కలుగకముందు నేను త్రోవ తప్పి తిరిగాను,
కాని ఇప్పుడు నేను మీ వాక్కుకు లోబడుతున్నాను.
68మీరు మంచివారు, మీరు మంచి చేస్తారు;
మీ శాసనాలు నాకు బోధించండి.
69అహంకారులు నన్ను అబద్ధాలతో అరిచినప్పటికీ,
నేను హృదయపూర్వకంగా మీ కట్టడలను అనుసరిస్తాను.
70వారి హృదయాలు క్రొవ్వులా మందగించాయి,
కాని నేను మీ ధర్మశాస్త్రంలోనే ఆనందిస్తాను.
71నాకు బాధ కలగడం మేలైంది
తద్వారా నేను మీ శాసనాలు నేర్చుకోగలను.
72వేలాది వెండి బంగారు నాణేలకంటే
మీ నోట నుండి వచ్చిన ధర్మశాస్త్రం నాకు అమూల్యమైనది.
י యోద్
73మీ హస్తములు నన్ను నిర్మించి నన్ను రూపించాయి;
మీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు గ్రహింపును ఇవ్వండి.
74మీకు భయపడేవారు నన్ను చూసినప్పుడు సంతోషించుదురు గాక,
ఎందుకంటే నేను మీ మాటలో నా నిరీక్షణ ఉంచాను.
75యెహోవా, మీ న్యాయవిధులు నీతిగలవని నాకు తెలుసు,
నమ్మకత్వంలో మీరు నన్ను బాధించారని నాకు తెలుసు.
76మీ సేవకునికి మీరు ఇచ్చిన వాగ్దాన ప్రకారం,
మీ మారని ప్రేమ నాకు ఆదరణ కలిగిస్తుంది.
77నేను బ్రతికేలా మీ కనికరం నా దగ్గరకు రానివ్వండి,
మీ ధర్మశాస్త్రంలోనే నాకు ఆనందము.
78కారణం లేకుండా నాకు అన్యాయం చేసినందుకు అహంకారులు అవమానపరచబడుదురు గాక;
కాని నేను మీ కట్టడలను ధ్యానిస్తాను.
79మీకు భయపడేవారు,
మీ శాసనాలు గ్రహించేవారు నా వైపు తిరుగుదురు గాక.
80నేను అవమానానికి గురి కాకుండ,
మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను.
כ కఫ్
81మీరు కలిగించే రక్షణ కోసం ఎదురుచూస్తూ నా ప్రాణం సొమ్మసిల్లి పోతుంది;
కాని నేను మీ మాట మీద నిరీక్షణ కలిగి ఉన్నాను.
82మీ వాగ్దానం కోసం ఎదురుచూస్తూ నా కళ్లు క్షీణిస్తున్నాయి;
“మీరు నన్ను ఎప్పుడు ఆదరిస్తారు?” అని నేను అంటాను.
83నేను పొగలో ఆరిన ద్రాక్ష తిత్తిలా ఉన్నా,
నేను మీ శాసనాలను మరువను.
84మీ సేవకుడు ఎన్నాళ్ళు బ్రతుకుతాడు?
నన్ను హింసించేవారిని మీరు ఎప్పుడు శిక్షిస్తారు?
85అహంకారులు మీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా,
నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
86మీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి;
నేను నిష్కారణంగా హింసింపబడుచున్నాను, నాకు సహాయం చేయండి.
87వారు దాదాపు నన్ను ఈ భూమి మీద లేకుండ చేసేసారు,
అయితే నేను మీ కట్టడలను విడిచిపెట్టలేదు.
88మీ మారని ప్రేమతో నా జీవితాన్ని కాపాడండి,
తద్వార మీ నోటి శాసనాలను నేను పాటిస్తాను.
ל లామెద్
89యెహోవా! మీ వాక్కు శాశ్వతం;
అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
90మీ నమ్మకత్వం తరతరాలకు నిలుస్తుంది.
మీరు భూమిని స్థాపించారు, అది సుస్థిరంగా ఉంటుంది.
91మీ న్యాయవిధులు ఈ రోజు వరకు కొనసాగుతాయి,
ఎందుకంటే అన్ని మీకు సేవ చేస్తాయి.
92ఒకవేళ మీ ధర్మశాస్త్రం నా ఆనందమై ఉండకపోతే,
నేను బాధలో నశించి పోయి ఉండేవాన్ని.
93నేను మీ కట్టడలు ఎన్నడు మరువను,
ఎందుకంటే వాటి ద్వార మీరు నా జీవితాన్ని కాపాడారు.
94నేను మీ వాడను, నన్ను రక్షించండి;
నేను మీ కట్టడలను వెదికాను.
95దుష్టులు నన్ను చంపాలని కాచుకుని ఉన్నారు,
కాని నేనైతే మీ శాసనాలను గురించి ఆలోచిస్తాను.
96సంపూర్ణతకు కూడా ఉంది పరిమితి!
కానీ, మీ ధర్మశాస్త్రోపదేశం అపరిమితము.
מ మేమ్
97ఓ, మీ ధర్మశాస్త్రం అంటే నాకెంత ఇష్టమో!
నేను రోజంతా దానిని ధ్యానిస్తాను.
98మీ ఆజ్ఞలు ఎల్లప్పుడు నాతో ఉండి
నా శత్రువుల కన్నా నన్ను జ్ఞానిగా చేస్తాయి.
99నేను మీ శాసనాలను ధ్యానిస్తాను కాబట్టి
నా ఉపదేశకులందరి కంటే నేను ఎక్కువ పరిజ్ఞానం కలిగి ఉన్నాను.
100నేను మీ కట్టడలను ఆచరిస్తాను కాబట్టి
వృద్ధులకు మించిన గ్రహింపు నేను కలిగి ఉన్నాను.
101మీ వాక్యం చెప్పినట్లే చేద్దామని
చెడు మార్గాల నుండి నా పాదాలు తొలగించుకున్నాను.
102నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు,
ఎందుకంటే మీరే నాకు బోధించారు.
103మీ వాక్కులు నా నోటికి ఎంతో మధురం,
అవి తేనెకంటె తియ్యనివి!
104మీ కట్టడల వల్ల నేను గ్రహింపు పొందాను;
కాబట్టి తప్పుడు త్రోవలంటే నాకు అసహ్యము.
נ నూన్
105మీ వాక్కు నా పాదాలకు దీపం,
నా త్రోవకు వెలుగు.
106నేను మీ నీతిగల న్యాయవిధులను పాటిస్తానని
ప్రమాణం చేసి ధృవీకరించాను.
107యెహోవా, నేను చాలా బాధపడ్డాను;
మీ వాక్కు ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
108యెహోవా, నా నోటి యొక్క ఇష్టపూర్వకమైన స్తుతిని స్వీకరించండి,
మీ న్యాయవిధులు నాకు బోధించండి.
109నేను నిరంతరం నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకున్నప్పటికీ,
నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవను.
110దుష్టులు నన్ను చిక్కించుకోవాలని ఉరులు ఒడ్డారు,
అయినా నేను మాత్రం మీ కట్టడల నుండి తొలగిపోలేదు.
111మీ శాసనాలు నాకు శాశ్వత వారసత్వం;
అవి నా హృదయానికి ఆనందం.
112అంతం వరకు మీ శాసనాలను పాటించాలని
నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను.
ס సామెక్
113ద్విమనస్కులంటే నాకు అసహ్యం,
కాని మీ ధర్మశాస్త్రం నాకు ఇష్టం.
114మీరు నా ఆశ్రయం నా డాలు;
నేను మీ మాటలో నిరీక్షణ ఉంచాను.
115నేను నా దేవుని ఆజ్ఞలను పాటించేలా,
కీడుచేసేవారలారా, నాకు దూరంగా ఉండండి!
116మీ వాగ్దానం ప్రకారం నన్నాదుకోండి, నేను బ్రతుకుతాను;
నా నిరీక్షణను బద్దలు కానివ్వకండి.
117నన్ను ఎత్తిపట్టుకోండి, నేను విడిపించబడతాను;
మీ శాసనాలను నేను ఎల్లప్పుడు గౌరవిస్తాను.
118మీ శాసనాల నుండి తప్పుకున్న వారిని మీరు తిరస్కరిస్తారు,
వారి భ్రమలు ఏమీ కాకుండా పోతాయి.
119భూమి మీద ఉన్న దుష్టులందరిని మీరు లోహపు మడ్డిలా విస్మరిస్తారు;
కాబట్టి నేను మీ శాసనాలను ప్రేమిస్తాను.
120మీ భయానికి నా శరీరం వణకుతుంది;
మీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను.
ע అయిన్
121నేను నీతియుక్తమైనది న్యాయమైనది చేశాను;
నన్ను బాధించేవారికి నన్ను వదిలేయకండి.
122మీ సేవకుడి శ్రేయస్సుకు హామీ ఇవ్వండి;
అహంకారులు నన్ను అణచివేయనివ్వకండి.
123మీ నీతియుక్తమైన వాగ్దానం కోసం,
మీ రక్షణ కోసం ఎదురుచూస్తూ, నా కళ్లు క్షీణిస్తున్నాయి.
124మీ మారని ప్రేమకు తగినట్టుగా మీ సేవకునితో వ్యవహరించండి
అలాగే మీ శాసనాలు నాకు బోధించండి.
125నేను మీ సేవకుడను; మీ శాసనాలు నేను గ్రహించేలా
నాకు వివేచన ఇవ్వండి.
126మీ ధర్మశాస్త్రం ఉల్లంఘించబడుతుంది;
యెహోవా, మీరు చర్య తీసుకోవలసిన సమయం ఇదే.
127ఎందుకంటే నేను మీ ఆజ్ఞలను
బంగారం కంటే, మేలిమి బంగారం కంటే ఎక్కువ ప్రేమిస్తాను,
128నేను మీ కట్టడలన్నిటిని యథార్థమైనవిగా పరిగణిస్తాను,
ప్రతి తప్పుడు మార్గం నాకసహ్యము.
פపే
129మీ శాసనాలు అద్భుతం;
కాబట్టి నేను వాటికి లోబడతాను.
130మీ వాక్కులు వెల్లడి అవడంతోనే వెలుగు ప్రకాశిస్తుంది.
అది సామాన్యులకు గ్రహింపునిస్తుంది.
131మీ ఆజ్ఞల కోసం ఆరాటపడుతూ,
నేను నా నోరు తెరిచి రొప్పుతున్నాను.
132మీ పేరును ఇష్టపడేవారికి మీరు ఎప్పుడూ చేసినట్టు,
నా వైపు తిరిగి నాపై దయచూపండి.
133మీ వాక్కు ప్రకారం నా అడుగుజాడలను నిర్దేశించండి;
ఏ దుష్టత్వం నన్ను ఏలకుండును గాక.
134నేను మీ కట్టడలకు లోబడేలా,
మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి.
135మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి
మీ శాసనాలను నాకు బోధించండి.
136ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి,
నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది.
צ సాదె
137యెహోవా, మీరు నీతిమంతులు,
మీ న్యాయవిధులు యథార్థమైనవి.
138మీరు విధించిన శాసనాలు నీతియుక్తమైనవి;
అవి పూర్తిగా నమ్మదగినవి.
139నా శత్రువులు మీ మాటలను విస్మరిస్తారు కాబట్టి,
నా ఆసక్తి నన్ను తినేస్తుంది.
140మీ వాగ్దానాలు పూర్తిగా పరీక్షించబడ్డాయి,
మీ సేవకుడు వాటిని ప్రేమిస్తాడు.
141నేను అల్పుడనైనా, తృణీకరించబడినా,
నేను మీ కట్టడలు మరచిపోను.
142మీ నీతి శాశ్వతమైనది
మీ ధర్మశాస్త్రం సత్యమైనది.
143ఇబ్బంది, బాధ నా మీదికి వచ్చాయి,
కాని మీ ఆజ్ఞలు నాకు ఆనందాన్ని ఇస్తాయి.
144మీ శాసనాలు ఎల్లప్పుడు నీతియుక్తమైనవి;
నేను బ్రతికేలా నాకు గ్రహింపు ఇవ్వండి.
ק ఖాఫ్
145యెహోవా, నా హృదయమంతటితో నేను మొరపెడుతున్నాను; నాకు జవాబివ్వండి,
నేను మీ శాసనాలకు లోబడతాను.
146నేను మీకు మొరపెడతాను; నన్ను రక్షించండి
నేను మీ శాసనాలను పాటిస్తాను.
147నేను తెల్లవారక ముందే లేచి సహాయం కోసం మొరపెడతాను;
నేను మీ వాక్కులలో నిరీక్షణ ఉంచాను.
148మీ వాగ్దానాలను నేను ధ్యానించేలా,
రాత్రి జాములంతా నా కళ్లు తెరిచి ఉంటాయి.
149మీ మారని ప్రేమను బట్టి నా స్వరాన్ని వినండి;
యెహోవా, మీ న్యాయవిధుల ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
150దుష్ట పథకాలను రూపొందించే వారు దగ్గరలో ఉన్నారు,
కాని వారు మీ ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్నారు.
151అయినాసరే యెహోవా, మీరు నా దగ్గరే ఉన్నారు,
మీ ఆజ్ఞలన్నీ నిజం.
152మీ శాసనాలు నిత్యం నిలిచి ఉండేలా మీరు స్థాపించారని,
చాలా కాలం క్రితం నేను తెలుసుకున్నాను.
ר రేష్
153నా శ్రమను చూసి నన్ను విడిపించండి,
ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు.
154నా కారణాన్ని సమర్థించి నన్ను విమోచించండి;
మీ వాగ్దాన ప్రకారం నా జీవితాన్ని కాపాడండి.
155రక్షణ దుష్టులకు దూరం,
ఎందుకంటే వారు మీ శాసనాలు వెదకరు.
156యెహోవా, మీ కనికరం గొప్పది;
మీ న్యాయవిధులను బట్టి నా జీవితాన్ని కాపాడండి.
157నన్ను హింసించే శత్రువులు చాలామంది,
అయినా నేను మీ శాసనాల నుండి తప్పుకోలేదు.
158నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను,
ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు.
159నేను మీ కట్టడలు ఎంతగా ప్రేమిస్తున్నానో చూడండి;
యెహోవా, మీ మారని ప్రేమ చేత, నా జీవితాన్ని కాపాడండి.
160మీ వాక్కులన్నీ నిజం;
మీ నీతియుక్తమైన న్యాయవిధులు నిత్యం నిలుస్తాయి.
ש సిన్ లేక షీన్
161కారణం లేకుండ అధికారులు నన్ను హింసిస్తున్నారు,
అయినా నా హృదయం మీ వాక్కుకు వణికిపోతుంది.
162ఒకడు దోపుడుసొమ్మును చూసి సంతోషించినట్లు
నేను మీ వాగ్దానాన్ని బట్టి సంతోషిస్తాను.
163అబద్ధం అంటే నాకు అసహ్యం ద్వేషం
కాని మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
164రోజుకు ఏడుసార్లు మిమ్మల్ని స్తుతిస్తాను
ఎందుకంటే మీ న్యాయవిధులు నీతియుక్తమైనవి.
165మీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు గొప్ప సమాధానం కలిగి ఉంటారు,
ఏదీ వారిని తొట్రిల్లేలా చేయలేదు.
166యెహోవా! మీ రక్షణ కోసం నేను ఎదురుచూస్తాను,
నేను మీ ఆజ్ఞలను అనుసరిస్తాను.
167నేను మీ శాసనాలను పాటిస్తాను,
ఎందుకంటే నేను వాటిని ఎంతగానో ప్రేమిస్తాను.
168నేను మీ కట్టడలకు మీ శాసనాలకు లోబడతాను,
ఎందుకంటే నా మార్గాలన్నీ మీకు తెలుసు.
ת తౌ
169యెహోవా, నా మొర మీ సన్నిధికి చేరును గాక;
మీ మాట ప్రకారం నాకు గ్రహింపును దయచేయండి.
170నా విన్నపం మీ సన్నిధికి చేరును గాక;
మీ వాగ్దానం ప్రకారం నన్ను విడిపించండి.
171నా పెదవులు స్తుతితో పొంగిపారును గాక,
ఎందుకంటే మీరు మీ శాసనాలను నాకు బోధిస్తారు.
172నా నాలుక మీ మాటను పాడును గాక,
ఎందుకంటే మీ ఆజ్ఞలన్నియు నీతియుక్తమైనవి.
173మీ చేయి నాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండును గాక,
ఎందుకంటే నేను మీ కట్టడలను ఎంచుకున్నాను.
174యెహోవా, నేను మీ రక్షణ కోసం ఆశతో ఎదురు చూస్తున్నాను,
మీ ధర్మశాస్త్రం నాకెంతో ఆనందాన్నిస్తుంది.
175నేను మిమ్మల్ని స్తుతించేలా నన్ను బ్రతకనివ్వండి,
మీ న్యాయవిధులు నన్ను సంరక్షిస్తాయి.
176నేను తప్పిపోయిన గొర్రెలా తిరుగుతున్నాను.
మీ సేవకుడిని వెదకండి,
నేను మీ ఆజ్ఞలను మరవలేదు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 119: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి