కీర్తనలు 147

147
కీర్తన 147
1యెహోవాను స్తుతించండి,#147:1 హెబ్రీలో హల్లెలూయా; 20 వచనంలో కూడ చూడండి
మన దేవుని స్తుతించడం ఎంత మంచిది,
ఆయనను స్తుతించడం ఎంత మనోహరమైనది, తగినది!
2యెహోవా యెరూషలేమును కట్టిస్తారు;
ఇశ్రాయేలు వారిలో నుండి చెరగొనిపోబడిన వారిని ఆయన సమకూరుస్తారు.
3విరిగిన హృదయం గలవారిని బాగుచేస్తారు.
వారి గాయాలను నయం చేస్తారు.
4ఆయన నక్షత్రాలను లెక్కిస్తారు,
సమస్తాన్ని పేరు పెట్టి పిలుస్తారు.
5మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి కలవాడు;
ఆయన గ్రహింపుకు పరిమితి లేదు.
6యెహోవా దీనులను ఆదరిస్తారు
కాని దుష్టులను నేలమట్టం చేస్తారు.
7యెహోవాకు కృతజ్ఞత స్తుతులు పాడండి;
సితారా మీటి దేవునికి స్తుతులు పాడండి.
8ఆయన ఆకాశాన్ని మేఘాలతో కప్పుతారు;
భూమికి వర్షమిచ్చి
కొండలపై గడ్డి మొలిపిస్తారు.
9ఆయన పశువులకు కూసే కాకులకు
ఆహారం సమకూరుస్తారు.
10గుర్రం బలాన్నిబట్టి ఆయన సంతోషించరు.
యోధుల కాల్బలంలో ఆనందించరు.
11ఆయనకు భయపడు వారిని బట్టి, ఆయన మారని ప్రేమ యందు నిరీక్షణ గలవారిని బట్టి
యెహోవా ఆనందిస్తారు.
12యెరూషలేమా, యెహోవాను ఘనపరచు;
సీయోనూ, నీ దేవుని స్తుతించు.
13ఆయన మీ గుమ్మాల గడియలు బలపరుస్తారు
మీలో మీ ప్రజలను దీవిస్తారు.
14ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు
మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.
15ఆయన భూమిని ఆజ్ఞాపిస్తారు;
ఆయన శాసనం వేగంగా పరుగెత్తుకొని పోతుంది.
16ఆయన మంచును తెల్లని ఉన్నిలా పంపిస్తారు
మంచు కణాలను బూడిదలా చెదరగొడతారు.
17ఆయన వడగండ్లను గులకరాళ్లలా విసిరివేస్తాడు.
ఆయన పుట్టించే తీవ్రమైన చలికి ఎవరు తట్టుకోగలరు?
18ఆయన తన మాటను పంపుతారు, అవన్నీ కరిగిపోతాయి;
గాలి వీచేటట్టు చేస్తారు, నీళ్లు పారతాయి.
19ఆయన యాకోబుకు తన వాక్కును,
ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.
20ఏ ఇతర జాతికి కూడా ఆయన ఈ విధంగా జరిగించలేదు;
ఆయన న్యాయవిధులు వారికి తెలియవు.#147:20 కొ.ప్రా.ప్ర.లలో ఆయన తన న్యాయవిధులు వారికి తెలియపరచలేదు
యెహోవాను స్తుతించండి.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

కీర్తనలు 147: OTSA

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి