7
యేసు పర్ణశాలల పండుగకు వెళ్లుట
1ఆ తర్వాత, యేసు గలిలయల ప్రాంతంలోనే తిరుగుతున్నారు. యూదా నాయకులు ఆయనను చంపాలని ఎదురు చూస్తున్నారని యేసు యూదయ ప్రాంతాలకు వెళ్లకూడదనుకున్నారు. 2కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు, 3యేసుని సహోదరులు ఆయనతో, “గలిలయల వదిలి యూదయకు వెళ్లు. అప్పుడు అక్కడ ఉన్న నీ శిష్యులు నీవు చేసిన కార్యాలు చూస్తారు. 4అందరిలో ప్రసిద్ధి పొందాలని కోరుకునే వారెవరు రహస్యంగా కార్యాలను చేయరు. నీవు ఈ కార్యాలను చేస్తున్నావు, లోకానికి నీ గురించి తెలిసేలా చేయి” అన్నారు. 5ఎందుకంటే ఆయన సహోదరులు కూడా ఆయనను నమ్మలేదు.
6అందుకు యేసు వారితో, “నా సమయం ఇంకా రాలేదు; కానీ మీ సమయం ఎప్పుడైనా ఉంటుంది. 7ఈ లోకం మిమ్మల్ని ద్వేషించదు, కానీ నేను దాని పనులు చెడ్డవని సాక్ష్యమిస్తున్నాను కాబట్టి అది నన్ను ద్వేషిస్తుంది. 8మీరు పండుగకు వెళ్లండి. నా సమయం ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి నేను ఈ పండుగకు ఇప్పుడే రాను” అని చెప్పారు. 9ఇది చెప్పిన తర్వాత ఆయన గలిలయలో ఉన్నారు.
10అయితే తన సహోదరులు పండుగకు వెళ్లిన తర్వాత, బహిరంగంగా కాకుండా రహస్యంగా ఆయన కూడా వెళ్లారు. 11పండుగలో యూదా నాయకులు యేసుని వెదకుతూ, “ఆయన ఎక్కడ?” అని అడుగుతున్నారు.
12ఆ జనసమూహంలో ఆయన గురించి గుసగుసలు మొదలయ్యాయి. వారిలో కొందరు, “అతడు మంచివాడు” అన్నారు.
మరికొందరు, “కాదు, అతడు ప్రజలను మోసం చేస్తున్నాడు” అన్నారు. 13అయితే యూదా నాయకులకు భయపడి ఎవరు ఆయన గురించి బహిరంగంగా ఏమి మాట్లాడలేదు.
పండుగ సమయంలో యేసు బోధించుట
14పండుగ ఉత్సవాలు సగం రోజులు పూర్తియైన తర్వాత యేసు దేవాలయ ఆవరణంలోనికి వెళ్లి బోధించడం మొదలుపెట్టారు. 15అక్కడ ఉన్న యూదులు ఆశ్చర్యపడి, “చదువుకోని వానికి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది?” అని అడిగారు.
16అందుకు యేసు, “నా బోధ నా సొంతం కాదు. నన్ను పంపినవాని నుండి అది వచ్చింది. 17దేవుని చిత్తాన్ని చేయాలని నిశ్చయించుకున్నవారు నా బోధలు దేవుని నుండి వచ్చాయా లేదా నా సొంతంగా మాట్లాడుతున్నానా అనేది గ్రహిస్తారు. 18సొంతగా మాట్లాడేవారు తన ఘనత కొరకే అలా చేస్తారు, కాని తనను పంపినవాని ఘనత కోసం చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి ఆయనలో చోటు ఉండదు. 19మోషే మీకు ధర్మశాస్త్రం ఇవ్వలేదా? అయితే మీలో ఎవ్వరూ ధర్మశాస్త్రాన్ని పాటించడంలేదు. మీరు ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
20అందుకు జనసమూహం, “నీకు దయ్యం పట్టింది, నిన్ను ఎవరు చంపాలని ప్రయత్నిస్తున్నారు?” అన్నారు.
21యేసు వారితో, “నేను ఒక అద్భుతాన్ని చేశాను. అందుకు మీరు ఆశ్చర్యపోయారు. 22అయితే మోషే మీకు సున్నతి ఆచారాన్ని ఇచ్చాడు. వాస్తవానికి అది మోషే నుండి రాలేదు, కాని మీ పితరుల నుండి వచ్చింది. అయినా సబ్బాతు దినాన మీరు ఒక మగ శిశువుకు సున్నతి చేస్తున్నారు. 23మోషే ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మీరు సబ్బాతు దినాన ఒక మగ శిశువుకు సున్నతి చేస్తే, నేను సబ్బాతు దినాన ఒక వ్యక్తి దేహాన్నంతటిని బాగుచేసినందుకు నాపై ఎందుకు కోప్పడుతున్నారు? 24కేవలం పైరూపాన్ని చూసి విమర్శించడం మాని న్యాయంగా తీర్పు తీర్చండి” అని అన్నారు.
యేసు ఎవరనే దానిపై విభేదం
25ఆ సమయంలో యెరూషలేము ప్రజల్లో కొందరు, “యూదులు చంపాలని చూస్తుంది ఇతన్ని కాదా? 26ఇక్కడ ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు, అయినా ఆయనను ఎవరు ఏమి అనరు. ఈయన నిజంగా క్రీస్తు అని అధికారులు తెలుసుకున్నారా? 27అయితే ఈయన ఎక్కడివాడో మనకు తెలుసు; కానీ క్రీస్తు#7:27 క్రీస్తు అంటే మెస్సీయా వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వస్తాడో ఎవరికీ తెలియదు” అని అనుకున్నారు.
28అప్పుడు యేసు ఇంకా దేవాలయ ఆవరణంలో బోధిస్తూ గొంతెత్తి ఇలా చెప్పారు, “అవును, నేను మీకు తెలుసు. నేను ఎక్కడివాడనో తెలుసు. అయినా నా అంతట నేను నా సొంత అధికారంతో ఇక్కడకు రాలేదు. అయితే నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఆయన మీకు తెలియదు. 29నాకు ఆయన తెలుసు; ఎందుకంటే నేను ఆయన దగ్గరి నుండి వచ్చాను ఆయనే నన్ను పంపారు.”
30ఈ మాటలకు వారు ఆయనను పట్టుకోవడానికి ప్రయత్నించారు కానీ, ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు. 31అయినా, సమూహంలోని అనేకమంది ఆయనను నమ్మారు. వారు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా ఎక్కువ అద్భుతాలను చేస్తాడా?” అని అడిగారు.
32ఆయన గురించి ఈ విషయాలను ఆ జనసమూహంలో గుసగుసలాడడం పరిసయ్యులు విన్నారు. అప్పుడు ముఖ్య యాజకులు పరిసయ్యులు ఆయనను బంధించడానికి దేవాలయ సంరక్షకులను పంపించారు.
33యేసు, “నేను మీతో కేవలం కొంతకాలమే ఉంటాను. తర్వాత నన్ను పంపినవాని దగ్గరకు నేను వెళ్తాను. 34మీరు నా కోసం వెదకుతారు కాని, కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు” అని చెప్పారు.
35అప్పుడు యూదుల నాయకులు ఒకరితో ఒకరు, “మనం కనుగొనలేని ఏ స్థలానికి ఇతడు వెళ్లబోతున్నాడు? గ్రీసు దేశస్థుల మధ్య చెదరిపోయి జీవిస్తున్న మన ప్రజల దగ్గరకు ఆయన వెళ్లి, గ్రీసు దేశస్థులకు బోధిస్తాడా? 36‘మీరు నన్ను వెదకుతారు కాని కనుగొనలేరు; నేను ఉన్న చోటికి మీరు రాలేరు’ అని ఈయన చెప్పిన దానికి అర్థం ఏమిటి?” అని చెప్పుకున్నారు.
37పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి. 38లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు. 39ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.
40ఆయన మాటలను విన్న తర్వాత ప్రజల్లో కొందరు, “ఈయన నిజంగానే ప్రవక్త” అని చెప్పుకున్నారు.
41మరికొందరు, “ఈయనే క్రీస్తు” అన్నారు.
అయినప్పటికీ ఇంకా కొందరు, “క్రీస్తు గలిలయ నుండి ఎలా వస్తాడు? 42క్రీస్తు దావీదు కుటుంబంలో నుండి దావీదు నివసించిన బేత్లెహేమనే ఊరి నుండి వస్తాడని లేఖనాల్లో వ్రాయబడలేదా?” అని చెప్పుకుంటున్నారు. 43ఈ విధంగా క్రీస్తును గురించి ప్రజల్లో విభేదాలు ఏర్పడ్డాయి. 44కొందరు ఆయనను పట్టుకోవాలని అనుకున్నారు, కాని ఎవ్వరూ ఆయన మీద చేయి వేయలేకపోయారు.
యూదా నాయకుల్లో అవిశ్వాసం
45చివరికి దేవాలయ సంరక్షకులు తిరిగి ముఖ్య యాజకులు పరిసయ్యుల దగ్గరకు వెళ్లినప్పుడు వారు, “అతన్ని మీరెందుకు తీసుకురాలేదు?” అని వారిని అడిగారు.
46ఆ సంరక్షకులు, “ఆయన మాట్లాడే విధంగా ఇంతకుముందు ఎవ్వరూ మాట్లాడలేదు” అని చెప్పారు.
47పరిసయ్యులు, “అంటే మిమ్మల్ని కూడా అతడు మోసగించాడా? అని అన్నారు. 48అధికారులలో లేదా పరిసయ్యులలో ఎవరైనా ఆయనను నమ్మారా? 49లేదు! ధర్మశాస్త్రం గురించి ఏమి తెలియని ఈ గుంపు నమ్ముతున్నారు, వారి మీద శాపం ఉంది” అన్నారు.
50అంతకుముందు యేసు దగ్గరకు వెళ్లిన వాడును స్వయంగా వారిలో ఒక సభ్యుడునైన నీకొదేము, 51“ఒకరు చెప్పేది వినకుండా, వారు ఏమి చేస్తూ ఉన్నాడో కనుక్కోకుండా మన ధర్మశాస్త్రం తీర్పు తీర్చుతుందా?” అని అడిగాడు.
52అందుకు వారు, “నీవు కూడ గలిలయకు చెందినవాడివా? ఇదిగో, గలిలయ నుండి ఏ ప్రవక్త రాడు కదా!” అన్నారు.
53తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.