5
మొదటి శిష్యులను పిలుచుకొన్న యేసు
1ఒక రోజు యేసు గెన్నేసరెతు#5:1 గెన్నేసరెతు అంటే గలిలయ సముద్రం సరస్సు తీరాన నిలబడి ఉన్నారు, ప్రజలు ఆయన చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని వింటున్నారు. 2సరస్సు తీరాన ఆయన రెండు పడవలను చూశారు, జాలరులు వాటిని అక్కడ విడిచిపెట్టి, తమ వలలను కడుక్కుంటున్నారు. 3ఆయన ఆ పడవలలో ఒక దానిలోకి ఎక్కారు, ఆ పడవ సీమోనుది, కాబట్టి ఆయన తీరం నుండి కొంచెం దూరం తోయమని అతన్ని అడిగారు. ఆయన పడవలో కూర్చుని, అక్కడినుండి ప్రజలకు బోధించారు.
4ఆయన మాట్లాడడం ముగించాక, ఆయన సీమోనుతో, “పడవను నీటి లోతుకు నడిపించి, చేపలు పట్టడానికి వలలు వేయి” అన్నారు.
5అందుకు సీమోను, “బోధకుడా, రాత్రంతా కష్టపడినా మేము ఏమి దొరకలేదు. అయినా నీవు చెప్పావు కాబట్టి నేను వలలను వేస్తాను” అని ఆయనతో అన్నాడు.
6వారు అలా చేసినప్పుడు, విస్తారమైన చేపలు వలల్లో పడి ఆ వలలు పిగిలిపోసాగాయి. 7అందుకు వారు వేరే పడవల్లోని తమ జతపనివారిని పిలిచి వచ్చి సహాయం చేయమని సైగలు చేశారు, కాబట్టి వారు వచ్చి ఆ రెండు పడవలను నింపగా ఆ బరువుకు ఆ పడవలు మునిగిపోసాగాయి.
8సీమోను పేతురు జరిగింది చూసి, యేసు మోకాళ్లమీద పడి, “ప్రభువా, నా దగ్గర నుండి వెళ్లిపో; నేను పాపిష్ఠి వాడను!” అన్నాడు. 9అతడు అతనితో ఉన్నవారందరు విస్తారంగా పట్టిన చేపలను చూసి ఆశ్చర్యపడ్డారు. 10సీమోను జతపనివారైన జెబెదయి కుమారులైన, యాకోబు యోహానులు కూడా ఆశ్చర్యపడ్డారు.
అప్పుడు యేసు సీమోనుతో, “భయపడకు; ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టే జాలరివి” అన్నారు. 11వారు తమ పడవలను ఒడ్డుకు చేర్చి, అన్నిటిని విడిచి ఆయనను వెంబడించారు.
కుష్ఠురోగిని బాగుచేసిన యేసు
12యేసు ఒక పట్టణంలో ఉన్నప్పుడు, కుష్ఠురోగంతో ఉన్న ఒకడు ఆయన దగ్గరకు వచ్చాడు. వాడు యేసును చూసి, నేల మీద సాగిలపడి, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను బాగు చేయి” అని ఆయనను బ్రతిమాలాడు.
13యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, బాగవు” అన్నారు. వెంటనే కుష్ఠురోగం వాన్ని విడిచి వెళ్లింది.
14అప్పుడు యేసు, “నీవు ఎవరికి చెప్పకు, కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని వారికి సాక్ష్యంగా ఉండేలా, నీ శుద్ధీకరణ కోసం మోషే నియమించిన అర్పణలను అర్పించు” అని వానిని ఆదేశించారు.
15అయినాసరే ఆయనను గురించిన వార్త మరి ఎక్కువగా వ్యాపించి, ఆయన చెప్పే మాటలను వినడానికి వారి వ్యాధుల నుండి స్వస్థపడడానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. 16అయితే యేసు తరచుగా ఏకాంత ప్రాంతాలకు వెళ్లి ప్రార్థించారు.
పక్షవాతంగల వానిని క్షమించి బాగుచేసిన యేసు
17ఒక రోజు యేసు బోధిస్తూ ఉండగా, పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చుని ఉన్నారు. వారు గలిలయ, యూదయ, యెరూషలేము ప్రాంతాలలోని ప్రతి గ్రామం నుండి వచ్చారు. ఆ సమయంలో రోగులను బాగుచేసే ప్రభువు శక్తి యేసులో ఉంది. 18కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని చాపమీద మోసుకొని తెచ్చి, యేసు ముందు ఉంచాలని ఇంట్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. 19కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వానిని లోపలికి తేవడానికి వీలుకాలేదు, కాబట్టి వారు ఆ ఇంటి కప్పుమీదికి ఎక్కి పెంకులు తీసి ప్రజలమధ్య, ఆ చాపతోనే వానిని యేసు ముందు దింపారు.
20యేసు వారి విశ్వాసం చూసి, అతనితో, “స్నేహితుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
21పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, తమలో తాము, “దైవదూషణ చేస్తున్న వీడు ఎవడు? దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచించడం మొదలుపెట్టారు.
22యేసు వారి ఆలోచనలను గ్రహించి, “మీ హృదయాల్లో మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 23వీటిలో ఏది చెప్పడం సులభం: ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని చెప్పడమా లేదా ‘లేచి నడువు’ అని చెప్పడమా?” 24అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని, “నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, “నేను చెప్తున్న, నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. 25వెంటనే వాడు వారి ముందే లేచి, తాను పడుకుని ఉన్న పరుపెత్తుకొని దేవుని స్తుతిస్తూ తన ఇంటికి వెళ్లాడు. 26అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో దేవుని స్తుతించారు. వారు భయంతో నిండుకొని, “ఈ రోజు మేము అద్భుతాలను చూశాం” అని చెప్పుకొన్నారు.
లేవీని పిలిచి పాపులతో తిన్న యేసు
27దీని తర్వాత, యేసు బయటకు వెళ్తూ లేవీ అనే పేరుగల పన్ను వసూలు చేసేవాడు పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉండడం చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు. 28వెంటనే లేవీ లేచి, అన్నిటిని వదిలి ఆయనను వెంబడించాడు.
29తర్వాత, లేవీ యేసు కోసం తన ఇంట్లో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు, పెద్ద సంఖ్యలో పన్ను వసూలు చేసేవారు ఇతరులు వారితో పాటు తింటున్నారు. 30అయితే వారి తెగకు చెందిన పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు, “ఎందుకు మీరు పన్నులు వసూలు చేసేవారితో పాపులతో కలిసి తిని త్రాగుతారు?” అని ఆయన శిష్యులతో అన్నారు.
31అందుకు యేసు వారితో, “రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యులు అవసరం లేదు. 32నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, పాపులు పశ్చాత్తాపపడాలని వారిని పిలువడానికి వచ్చాను” అన్నారు.
ఉపవాసం గురించి ప్రశ్నించిన యేసు
33వారు ఆయనతో, “యోహాను శిష్యులు తరచుగా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తారు, అలాగే పరిసయ్యుల శిష్యులు కూడా చేస్తారు, కాని నీ శిష్యులు తింటూ త్రాగుతూ ఉంటారు” అన్నారు.
34అందుకు యేసు, “పెండ్లికుమారుడు తన స్నేహితులతో ఉన్నప్పుడు వారిని ఉపవాసం ఉండేలా మీరు చేయగలరా? 35పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది; ఆ రోజుల్లో వారు ఉపవాసం ఉంటారు” అని జవాబిచ్చారు.
36ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: “ఎవ్వరూ క్రొత్త బట్ట నుండి ముక్క చింపి పాత దానికి అతుకువేయరు. అలా చేస్తే, వారికి చినిగిపోయిన క్రొత్త బట్ట మిగులుతుంది, క్రొత్త బట్ట అతుకు పాత దానితో కలవదు. 37ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, క్రొత్త ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి; ద్రాక్షరసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి. 38అలా వద్దు, క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోయబడాలి. 39పాత ద్రాక్షరసం త్రాగినవారు ఎవ్వరూ క్రొత్త దానిని కోరరు, ‘పాతదే బాగుంది’ అని అంటారు” అని అన్నారు.