2 సమూయేలు 18:9-10
2 సమూయేలు 18:9-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అబ్షాలోము కంచరగాడిదమీద ఎక్కి పోవుచు దావీదు సేవకులకు ఎదురాయెను; ఆ కంచరగాడిద యొక గొప్పమస్తకి వృక్షముయొక్క చిక్కుకొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికినిమధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయెను. ఒకడు దానిని చూచి వచ్చి–అబ్షాలోము మస్తకివృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచితినని యోవాబుతో చెప్పినప్పుడు
2 సమూయేలు 18:9-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వెళ్తూ దావీదు సైన్యానికి ఎదురయ్యాడు. ఆ కంచరగాడిద గుబురైన కొమ్మలు ఉన్న ఒక సింధూర వృక్షం క్రింది నుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము జుట్టు చెట్టు కొమ్మల్లో చిక్కుకుంది. అయితే ఆ కంచరగాడిద అలాగే ముందుకు వెళ్లిపోవడంతో అతడు గాలిలో వ్రేలాడుతూ ఉండిపోయాడు. అది చూసిన ఒకడు యోవాబు దగ్గరకు వెళ్లి, “అబ్షాలోము సింధూర వృక్షానికి వ్రేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
2 సమూయేలు 18:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అబ్షాలోము కంచరగాడిద ఎక్కి వస్తూ దావీదు సేవకులకు ఎదురు పడ్డాడు. ఆ కంచరగాడిద ఒక బాగా గుబురుగా ఉన్న పెద్ద సింధూర వృక్షం కొమ్మల కిందనుండి వెళ్తున్నప్పుడు అబ్షాలోము తల చెట్టుకు తగులుకుంది. అతడు పైకి ఎత్తబడి ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. అతని కింద ఉన్న కంచర గాడిద ముందుకు వెళ్ళిపోయింది. ఒక సైనికుడు అది చూసి, యోవాబు దగ్గర కు వచ్చి “అబ్షాలోము సింధూర వృక్షానికి చిక్కుకుని వేలాడుతూ ఉండడం నేను చూశాను” అని చెప్పాడు.
2 సమూయేలు 18:9-10 పవిత్ర బైబిల్ (TERV)
అబ్షాలోము దావీదు సేవకులను కలవటం జరిగింది. అబ్షాలోము తప్పించుకు పోవటానికి ఒక కంచరగాడిదను ఎక్కాడు. ఆ కంచర గాడిద పెద్ద సింధూర వృక్షం కొమ్మల క్రిందుగా వెళ్లింది. కొమ్మలు చిక్కగా అల్లుకొని ఉన్నాయి. అబ్షాలోము తల ఆ కొమ్మల్లో చిక్కుకు పోయింది. తన కంచర గాడిద తన క్రిందనుంచి పారిపోయింది. ఆ విధంగా అబ్షాలోము భూమికి పైగా వేలాడుచున్నాడు. ఇది జరగటం ఒక వ్యక్తి చూశాడు. అతడు పోయి యోవాబుతో, “అబ్షాలోము సింధూర వృక్షం కొమ్మల్లో చిక్కుకొని వేలాడటం నేను చూశాను!” అని చెప్పాడు.