అపొస్తలుల కార్యములు 12:1-17
అపొస్తలుల కార్యములు 12:1-17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆ దినాల్లో రాజైన హేరోదు సంఘానికి చెందిన కొందరిని హింసించాలని ఉద్దేశించి వారిని బంధించాడు. అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు. ఈ విషయాన్ని యూదులు అంగీకరించడం చూసిన హేరోదు పేతురును కూడా బంధించాడు. అది పులియని రొట్టెల పండుగ సమయంలో జరిగింది. హేరోదు పేతురును పట్టుకుని చెరసాలలో వేయించి, నలుగురేసి సైనికులుండే నాలుగు సైనిక దళాలను అతనికి కాపలాగా నియమించాడు. పస్కా పండుగ తర్వాత ప్రజల ముందు అతన్ని విచారణకు తీసుకురావాలని హేరోదు భావించాడు. కాబట్టి పేతురును చెరసాలలో పెట్టారు. కానీ సంఘం అతని కోసం దేవునికి ఎంతో ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు. హేరోదు అతన్ని విచారణకు తీసుకురావడానికి ముందు రాత్రి, పేతురు రెండు గొలుసులతో బంధించబడి, ఇద్దరు సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అలాగే కావలివారు చెరసాల తలుపు ముందు కాపలా కాస్తున్నారు. అప్పుడు, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు, కాబట్టి ఆ గదిలో వెలుగు ప్రకాశించింది. అప్పుడా దూత పేతురు ప్రక్కన తట్టి, “త్వరగా లే” అని చెప్పాడు. అప్పుడు పేతురు చేతులకున్న ఆ గొలుసులు తెగిపడ్డాయి. అప్పుడు ఆ దూత అతనితో, “నీ బట్టలు చెప్పులు వేసుకో” అని చెప్పాడు. పేతురు అలాగే చేశాడు. దూత అతనితో, “నీ చుట్టూ వస్త్రాన్ని చుట్టుకొని నన్ను వెంబడించు” అని చెప్పాడు. పేతురు ఆ దూతను వెంబడిస్తూ చెరసాల బయటకు వచ్చాడు, దూత చేసేదంతా నిజంగా జరుగుతుంది అన్న ఆలోచనే అతనికి లేదు; తాను ఒక దర్శనం చూస్తున్నానని భావించాడు. వారు మొదటి, రెండవ కావలివారిని దాటి పట్టణంలోనికి దారితీసే ఇనుప ద్వారం దగ్గరకు వచ్చారు. ఆ ద్వారం దానంతట అదే తెరచుకుంది, కాబట్టి వారు దానిగుండా వెళ్లారు. వారు ఒక వీధిని దాటిన తర్వాత, అకస్మాత్తుగా ఆ దూత అతన్ని విడిచిపోయాడు. అప్పుడు పేతురు జరిగిందంతా నిజం అని తెలుసుకొని, “ప్రభువు తన దూతను పంపించి హేరోదు చేతి నుండి యూదులు తనకు చేయాలనుకున్నవేవి జరుగకుండా తప్పించాడని, ఏ సందేహం లేకుండా ఇప్పుడు నాకు తెలిసిందని” తనలో తాను అనుకున్నాడు. దీనిని గ్రహించిన తర్వాత, అతడు మార్కు అనబడే యోహాను తల్లియైన మరియ ఇంటికి వెళ్లాడు, అక్కడ చాలామంది విశ్వాసులు చేరి ప్రార్థన చేస్తున్నారు. పేతురు బయటి గుమ్మం దగ్గర నిలబడి తలుపు తట్టాడు, అప్పుడు రోదె అనే పేరుగల ఒక సేవకురాలు తలుపు తీయడానికి వచ్చింది. ఆమె పేతురు స్వరాన్ని గుర్తుపట్టి, అత్యంత సంతోషంతో తలుపు తీయకుండానే వెనుకకు పరుగెత్తుకొని వెళ్లి, “పేతురు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు!” అని కేక వేసి చెప్పింది. వారు ఆమెతో, “నీకు పిచ్చి పట్టింది” అన్నారు. ఆమె అది నిజమని పట్టుబడుతూవుంటే వారు, “అది అతని దూతయై ఉండవచ్చు” అన్నారు. కానీ పేతురు తలుపు తట్టుతూనే ఉన్నాడు, వారు తలుపు తీసినప్పుడు అక్కడ పేతురును చూసి ఆశ్చర్యపడ్డారు. పేతురు, నెమ్మదిగా ఉండండని చేతితో సైగ చేసి ప్రభువు అతన్ని చెరసాలలో నుండి ఎలా బయటకు తీసుకుని వచ్చాడో వారికి వివరించాడు. “యాకోబుకు, ఇతర సహోదరి సహోదరులందరికి కూడా ఈ సంగతిని తెలియజేయండి” అని చెప్పి, అక్కడినుండి మరొక చోటికి వెళ్లాడు.
అపొస్తలుల కార్యములు 12:1-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు. యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు. ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు. అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు. పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు. హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు. ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి. దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు. అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు. మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు. పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు. దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు. అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది. ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది. అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు. పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు. అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
అపొస్తలుల కార్యములు 12:1-17 పవిత్ర బైబిల్ (TERV)
ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు. అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు. ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది. అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం. పేతురును అంతవరకు కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందినవాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు. హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు ఊడిపోయాయి. ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంట రా!” అని ఆ దూత అన్నాడు. పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు. వాళ్ళు మొదటి కాపలావాణ్ణి, రెండవ కాపలావాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు. అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధంనుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదులనుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు. జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు. పేతురు తలుపు తట్టాడు. “రొదే” అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది. వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు. పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారంనుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబుకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.
అపొస్తలుల కార్యములు 12:1-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు . సంఘపువారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలిసికొని పేతురును కూడ పట్టుకొనెను. ఆ దినములు పులియనిరొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి, పస్కా పండు గైన పిమ్మట ప్రజలయొద్దకు అతని తేవలెనని ఉద్దేశించి, అతనికి కావలియుండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచ బడెను, సంఘమయితే అతనికొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థనచేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసికొని రావలెననియుండగా, ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి యిద్దరు సైనికులమధ్య నిద్రించు చుండెను; మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతనిదగ్గర నిలిచెను; అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి–త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్లు అతనిచేతులనుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో–నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడాలాగు చేసిన తరువాత దూత –నీ వస్త్రము పైన వేసికొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్లి, దూతవలన జరిగినది నిజముగా జరిగెనని గ్రహింపక, తనకు దర్శనము కలిగెనని తలంచెను. మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవినియొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరచుకొనెను. వారు బయలుదేరి యొక వీధి దాటినవెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురుకు తెలివివచ్చి–ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలోనుండియు, యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటినుండియు నన్ను తప్పించియున్నాడని యిప్పుడు నాకు నిజముగా తెలియునని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరుగల యోహాను తల్లియైన మరియ యింటికి వచ్చెను; అక్కడ అనేకులుకూడి ప్రార్థనచేయుచుండిరి. అతడు తలవాకిటి తలుపుతట్టుచుండగా, రొదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపెట్టి, సంతోషముచేత తలుపుతీయక లోపలికి పరుగెత్తి కొనిపోయి–పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. అందుకు వారు–నీవు పిచ్చిదానవనిరి; అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు–అతని దూత అనిరి. పేతురు ఇంకనుతట్టుచున్నందునవారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. అతడు–ఊరకుండుడని వారికి చేసైగచేసి, ప్రభువు తన్ను చెరసాలలోనుండి యేలాగు తీసికొనివచ్చెనో వారికి వివరించి – యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొకచోటికి వెళ్లెను.