అపొస్తలుల కార్యములు 27:21-44
అపొస్తలుల కార్యములు 27:21-44 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది. నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి, ‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కనుక సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి.” అని చెప్పాడు. పధ్నాలుగోవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్ధరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కొరకు ప్రార్థించాము. ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోనికి దింపారు. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని తాళ్ళను కోసివేసారు. తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పధ్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకొని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకొని కొంత ఆహారం తిన్నారు. ఓడలో మేమంతా కలిసి రెండువందల డెబ్బై ఆరు మందిమి ఉన్నాం. వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేసారు. పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. త్రాళ్ళను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్ళను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదలలేకపోయింది. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది. ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోనికి దూకి ఒడ్డుకు చేరుకోవాలని, మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.
అపొస్తలుల కార్యములు 27:21-44 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు చాలాకాలం పస్తులు ఉండగా పౌలు వారి మధ్య నిలబడి, “అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకుండానే ఉండవలసింది. అప్పుడీ హానీ, నష్టమూ కలగకపోయేది. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. ఓడకి మాత్రమే నష్టం కలుగుతుందిగానీ, మీలో ఎవరి ప్రాణానికీ హాని కలగదు. నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి, ‘పౌలూ, భయపడకు. నీవు సీజరు ముందు నిలబడాల్సి ఉంది. ఇదిగో, నీతో కూడ ఓడలో ప్రయాణిస్తున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగుతుందని నేను దేవుని నమ్ముతున్నాను. అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ద్వీపానికి తగులుకోవాలి” అని చెప్పాడు. పద్నాలుగవ రాత్రి మేము అద్రియ సముద్రంలో ఇటు అటు కొట్టుకు పోతుండగా అర్థరాత్రి వేళ ఓడ నావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతున్నదని ఊహించి ఇనుప గుండు కట్టిన తాడు వేసి చూసి సుమారు 120 అడుగుల లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్ళిన తరువాత, మళ్ళీ గుండు వేసి చూసి 90 అడుగుల లోతని తెలుసుకున్నారు. అప్పుడు రాతి దిబ్బలకు కొట్టుకుంటామేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచుకుని ఉన్నారు. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని ఆలోచించి, లంగరులు వేయబోతున్నట్లుగా నటించి సముద్రంలో పడవ దింపివేశారు. అందుకు పౌలు “వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకోలేరు” అని శతాధిపతితో, సైనికులతో చెప్పాడు. వెంటనే సైనికులు పడవ తాళ్ళు కోసి దాని కొట్టుకు పోనిచ్చారు. తెల్లవారుతుండగా పౌలు, “పద్నాలుగు రోజుల నుండి మీరేమీ ఆహారం తీసుకోక పస్తులున్నారు. కాబట్టి ఆహారం పుచ్చుకోమని మిమ్మల్ని బతిమాలుతున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయంగా ఉంటుంది. మీలో ఎవరి తలనుండీ ఒక్క వెంట్రుక కూడా నశించదు” అని చెప్పి ఆహారం తీసుకోమని అందరినీ బతిమాలాడు. ఈ మాటలు చెప్పి, ఒక రొట్టె పట్టుకుని అందరి ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాడు. అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు. ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డెబ్భై ఆరుగురం. వారు తిని తృప్తి పొందిన తరువాత, గోదుమలను సముద్రంలో పారబోసి ఓడను తేలిక చేశారు. తెల్లవారిన తరవాత అది ఏ దేశమో వారు గుర్తు పట్టలేకపోయారు, కానీ తీరం గల ఒక సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే ఓడను అందులోకి నడిపించాలని ఆలోచించారు. కాబట్టి వారు గుర్తు పట్టలేకపోయారు వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా ఒడ్డుకి నడిపించారు. కానీ ఓడ రెండు ప్రవాహాలు కలిసిన చోట చిక్కుకుపోయి ఇసుకలో ఇరుక్కుపోయింది. అందువల్ల ఓడ ముందు భాగం కూరుకుపోయి కదలలేదు. వెనక భాగం అలల దెబ్బకు బద్దలైపోతూ ఉంది. ఖైదీల్లో ఎవరూ ఈదుకుని పారిపోకుండేలా వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని, శతాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు. ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటూనూ, మిగిలినవారు ఓడ చెక్క పలకలు, ఇతర వస్తువుల సాయంతోనూ ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకుని ఒడ్డుకు చేరాం.
అపొస్తలుల కార్యములు 27:21-44 పవిత్ర బైబిల్ (TERV)
చాలా రోజులనుండి వాళ్ళు ఆహారం తినలేదు. పౌలు వాళ్ళ మధ్య నిలబడి, “నా సలహా పాటించి మీరు క్రేతునుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది. అలా చేసి ఉంటే మీకు కష్టంగాని, నష్టంగాని కలిగేది కాదు. కాని, యిప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాను. ధైర్యంగా ఉండండి. మీలో ఒక్కరు కూడా ప్రాణాల్ని కోల్పోరు. కాని ఓడ మాత్రం నష్టమౌతుంది. నేను ఎవరికి చెందానో, ఎవరి సేవ నేను చేస్తున్నానో ఆయన దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి ఇలా చెప్పాడు: ‘పౌలూ! భయపడకు. విచారణకై నీవు చక్రవర్తి ముందు నిలబడతావు. దేవుడు దయదలిచి, నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళ ప్రాణాలను రక్షించాడు.’ అందువల్ల ప్రజలారా! దైర్యంగా ఉండండి. నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. మనం త్వరలోనే ఒక ద్వీపానికి కొట్టకుపోతాము” అని అన్నాడు. పదునాల్గవ రోజు రాత్రి కూడా మేమింకా అద్రియ సముద్రంలో గాలికి కొట్టుకొని పోతున్నాము. సుమారు అర్ధరాత్రి వేళ నావికులు భూమి దగ్గరకొచ్చిందని గ్రహించారు. బుడుదు నీళ్ళలోకి వేసి ఇరవై బారల లోతుందని తెలుసుకున్నారు. కొంతసేపైన తర్వాత మళ్ళీ బుడుదు నీళ్ళలోకి వేసి పదునైదు బారల లోతుందని తెలుసుకున్నారు. ఓడ రాళ్ళకు కొట్టుకుంటుందని భయపడి ఓడ వెనుక భాగంనుండి నాలుగు లంగర్లు వేసారు. ఆ తదుపరి సూర్యుని వెలుగు కోసం ప్రార్థించారు. నావికులు ఓడ ముందుభాగంనుండి లంగర్లు నీళ్ళలోకి దింపుతున్నట్లు నటిస్తూ ఓడకు కట్టబడిన చిన్న పడవను సముద్రంలోకి దింపారు. తప్పించుకు వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశ్యం. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ నావికులు ఓడలో ఉంటే తప్ప మీరు రక్షింపబడరు” అని అన్నాడు. ఇది విని సైనికులు పడవకు కట్టిన త్రాళ్ళను కోసి ఆ పడవను నీళ్ళలోకి పోనిచ్చారు. సూర్యోదయానికి ముందు పౌలు వాళ్ళనందర్ని తినమని చెబుతూ, “గడిచిన పదునాలుగు రోజులనుండి మీరు ఆహారం ముట్టకుండా జీవించారు. ఏం జరుగనున్నదో మీకు తెలియదు. అయినా కాచుకున్నారు. ఇక మిమ్మల్ని కొంచెం తినమని వేడుకొంటున్నాను. మిమ్మల్ని రక్షించుకోవాలంటే తినటం అవసరం. మీ తలలపై ఉన్న ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు” అని అన్నాడు. ఇలా చెప్పాక అతడు రొట్టెను తీసుకొని దేవునికి అందరి ముందు కృతజ్ఞతలు చెప్పి దాన్నుండి ఒక ముక్కను విరిచి తినటం మొదలు పెట్టాడు. అప్పుడందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకున్నారు. మా సంఖ్య మొత్తం రెండువందల డెబ్బది ఆరు. వాళ్ళంతా తృప్తిగా తిన్నారు. ఆ తర్వాత ఓడలో ఉన్న మిగతా ధాన్యాన్ని సముద్రంలోకి పారవేసి ఓడను తేలిక చేసారు. సూర్యోదయమయింది. వాళ్ళకు భూమి కనిపించింది. కాని వాళ్ళు అది గుర్తించలేదు. ఇసుక ఉన్న తీరం యొక్క పాయ కనపడగానే ఓడను వీలైతే అక్కడ ఆపాలనుకున్నారు. త్రాళ్ళు కోసేసి లంగర్లను సముద్రంలోకి పడనిచ్చారు. చుక్కానుల త్రాళ్ళు విప్పారు. ఓడ యొక్క ముందుభాగంలో ఉన్న తెరచాపను లేపి ఓడను తీరం వైపు పోనిచ్చారు. కాని ఆ ఓడ నీళ్ళలో ఉన్న యిసుకకు తగిలి భూమిలో చిక్కుకొని పోయింది. ఓడ యొక్క ముందుభాగం యిసుకలో చిక్కుకుపోవటం వల్ల ఓడ కదల్లేదు. అలలు తీవ్రంగా కొట్టటం వల్ల ఓడ యొక్క వెనుక భాగం ముక్కలై పోయింది. నేరస్థులు ఈది పారిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో సైనికులు వాళ్ళను చంపాలని నిశ్చయించుకున్నారు, కాని పౌలు ప్రాణాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతో ఆ శతాధిపతి సైనికులు చేయదలచిన దానిని చేయనివ్వలేదు. ఈద గలిగినవాళ్ళను, నీళ్ళలోకి దూకి ఒడ్డును చేరుకోమని ఆజ్ఞాపించాడు. మిగతావాళ్ళను చెక్కల సహాయంతో, ఓడ యొక్క విరిగిన ముక్కల సహాయంతో ఒడ్డును చేరుకోమన్నాడు. ఈ విధంగా అందరూ క్షేమంగా తీరాన్ని చేరుకున్నారు.
అపొస్తలుల కార్యములు 27:20-44 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మామీద కొట్టినందున ప్రాణములతో తప్పించు కొందుమను ఆశ బొత్తిగ పోయెను. వారు బహు కాలము భోజనము లేక యున్నందున పౌలు వారిమధ్యను నిలిచి–అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి బయలుదేరకయే యుండవలసినది. అప్పుడీ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఓడకేగాని మీలో ఎవని ప్రాణమునకును హానికలుగదు. నేను ఎవనివాడనో, యెవనిని సేవించుచున్నానో, ఆ దేవుని దూత గడచిన రాత్రి నాయొద్ద నిలిచి–పౌలా, భయపడకుము; నీవు కైసరు ఎదుట నిలువవలసియున్నది; ఇదిగో నీతోకూడ ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరిని దేవుడు నీకు అనుగ్రహించియున్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి; నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొనిపోయి యేదైన ఒక ద్వీపముమీద పడవలసి యుండునని చెప్పెను. పదునాలుగవ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియ సముద్రములో ఇటు అటు కొట్టుకొనిపోవుచుండగా అర్ధరాత్రివేళ ఓడవారు ఏదో యొక దేశము దగ్గర పడు చున్నదని యూహించి బుడుదువేసి చూచి యిరువది బారల లోతని తెలిసికొనిరి. ఇంకను కొంతదూరము వెళ్లిన తరువాత, మరల బుడుదువేసి చూచి పదునైదు బారల లోతని తెలిసికొనిరి. అప్పుడు రాతి తిప్పలుగల చోట్ల పడుదుమేమో అని భయపడి, వారు ఓడ అమరములోనుండి నాలుగు లంగరులువేసి యెప్పుడు తెల్ల వారునా అని కాచుకొని యుండిరి. అయితే ఓడవారు ఓడ విడిచి పారిపోవలెనని చూచి, తాము అనివిలోనుండి లంగరులు వేయబోవునట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు–వీరు ఓడలో ఉంటేనేగాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోను సైనికులతోను చెప్పెను. వెంటనే సైనికులు పడవ త్రాళ్లు కోసి దాని కొట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు– పదునాలుగు దినములనుండి మీరేమియు పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని యున్నారు గనుక ఆహా రము పుచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను; ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండియు ఒక వెండ్రుకయైనను నశింపదని చెప్పుచు, ఆహారము పుచ్చుకొనుడని అందరిని బతిమాలెను. ఈ మాటలు చెప్పి, యొక రొట్టె పట్టుకొని అందరి యెదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి తిన సాగెను. అప్పుడందరు ధైర్యము తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. ఓడలో ఉన్న మేమందరము రెండువందల డెబ్బది ఆరుగురము. వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలను సముద్రములో పారబోసి ఓడ తేలికచేసిరి. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైనయెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి గనుక లంగరుల త్రాళ్లుకోసి వాటిని సముద్రములో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందటి తెరచాప గాలికెత్తి సరిగా దరికి నడిపించిరి గాని రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పెట్టించిరి. అందువలన అనివి కూరుకొనిపోయి కదలక యుండెను, అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండునట్లు వారిని చంపవలెనని సైనికులకు ఆలోచన పుట్టెను గాని శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పోవలెననియు కడమ వారిలో కొందరు పలకలమీదను, కొందరు ఓడ చెక్కలమీదను, పోవలెననియు ఆజ్ఞాపించెను. ఈలాగు అందరు తప్పించుకొని దరిచేరిరి.
అపొస్తలుల కార్యములు 27:21-44 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
వారు ఆ విధంగా ఆహారం లేకుండా చాలా రోజులు గడిపిన తర్వాత, పౌలు వారి ముందు నిలబడి వారితో, “సహోదరులారా, నేను ఇచ్చిన సలహాను మీరు విని క్రేతు నుండి బయలుదేరకుండా ఉండవలసింది; అప్పుడు మీకు ఈ ప్రమాదం గాని నష్టం కాని జరుగకపోయేది. ఇప్పుడైనా మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీలో ఎవరికి ప్రాణహాని కలుగదు; కేవలం ఓడ మాత్రమే పాడైపోతుంది. నేను ఎవరికి చెందిన వాడినో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నిన్న రాత్రి నా ప్రక్కన నిలబడి, ‘పౌలు భయపడకు. నీవు కైసరు ముందు విచారణకు నిలబడవలసి ఉంది. నీతో కూడ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరి జీవితాలను దేవుడు నీకు అనుగ్రహించాడు’ అని నాతో చెప్పాడు. అతడు నాకు చెప్పినట్లే జరుగుతుందని నాకు దేవునిలో విశ్వాసం ఉంది, కాబట్టి సహోదరులారా, మీరు ధైర్యం తెచ్చుకోండి. అయినప్పటికీ, మన ఓడ ఏదైనా ఒక ద్వీపం తగులుకోవాలి” అని చెప్పాడు. పద్నాలుగవ రోజు రాత్రి మేము ఇంకా అద్రియా సముద్రంలో కొట్టుకొనిపోతుండగా, ఇంచుమించు అర్థరాత్రి సమయంలో ఓడను నడిపేవారు ఒడ్డును సమీపిస్తున్నాం అని గ్రహించారు. వారు ఇనుప గుండు కట్టిన తాడు సముద్రంలో వేసి చూసి దానితో అక్కడ సుమారు నూట ఇరవై అడుగుల లోతుందని తెలుసుకున్నారు. మరికొద్ది సేపటికి సముద్రపు లోతును కనుగొనే దానిని మరలా వేసి తొంభై అడుగుల లోతుందని తెలుసుకొన్నారు. మేము రాతి దిబ్బలకు గుద్దుకొంటామేమో అనే భయంతో వారు నాలుగు లంగరులను ఓడ మూలలో నుండి క్రిందకు వేసి, పగటి వెలుగు కోసం ప్రార్థించాము. ఓడ నడిపేవారు ఓడలో నుండి పారిపోవాలని, తాము ఓడ ముందు భాగం నుండి కొన్ని లంగరులను పడవేయడానికి వెళ్తున్నట్లు నటిస్తూ రక్షక పడవను సముద్రంలోకి దింపారు. అప్పుడు పౌలు శతాధిపతితో, సైనికులతో, “ఈ మనుష్యులు ఓడలో ఉంటేనే తప్ప తమ ప్రాణాలను రక్షించుకోలేరు” అని చెప్పాడు. వెంటనే సైనికులు రక్షకపడవ దూరంగా కొట్టుకొని పోవడానికి దాని త్రాళ్లను కోసివేశారు. తెల్లవారుతునప్పుడు పౌలు వారందరిని ఆహారం తినమని వేడుకున్నాడు. “గత పద్నాలుగు రోజులనుండి ఏమి జరుగుతుందో అని మీరు ఏమి తినలేదు. మీరు బలహీనం కాకుండా దయచేసి భోజనం చేయండి, మీలో ఎవరి తల నుండి ఒక్క వెంట్రుక కూడా రాలదు” అని వారిని బ్రతిమాలాడు. అతడు ఈ మాటలను చెప్పిన తర్వాత, రొట్టెను తీసుకుని వారందరి ముందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి దానిని విరిచి తినడం ప్రారంభించాడు. అప్పుడు వారందరు ధైర్యం తెచ్చుకుని కొంత ఆహారం తిన్నారు. ఓడలో మొత్తం 276 మంది వ్యక్తులం ఉన్నాము. వారు తమకు కావలసినంత ఆహారం తిన్న తర్వాత, ఓడను తేలిక చేయడానికి ధాన్యాన్ని సముద్రంలో పడవేశారు. పగటి వెలుగు వచ్చినప్పుడు, వారు ఆ ప్రాంతాన్ని గుర్తించలేదు, కాని ఇసుకతీరం ఉన్న సముద్రపు పాయను చూసి, సాధ్యమైతే దానిలోనికి ఓడను నడిపించాలి అనుకున్నారు. త్రాళ్లను కోసి లంగరులను సముద్రంలో విడిచిపెట్టారు అదే సమయంలో చుక్కానులకు కట్టిన త్రాళ్లను విప్పేసారు. తర్వాత తెరచాపలను గాలికి ఎత్తి తీరం వైపునకు నడిపించారు. కాని రెండు ప్రవాహాలు కలిసిన చోట ఇసుకలో ఓడ ముందు భాగం కూరుకొనిపోయి కదల్లేదు. అలల తాకిడికి ఓడ వెనుక భాగం ముక్కలుగా విరిగి పోసాగింది. ఖైదీలు ఈదుకుని పారిపోకుండా వారిని చంపేయాలని సైనికులు అనుకున్నారు. కానీ శతాధిపతి పౌలు ప్రాణాన్ని కాపాడాలనుకొని సైనికులను తాము అనుకున్న దానిని చేయకుండా ఆపివేసి, ఈత వచ్చినవారు మొదట సముద్రంలోకి దూకి ఒడ్డుకు చేరుకోవాలని, మిగిలిన వారు చెక్కపలకల మీద లేదా ఓడ చెక్కల మీద ఒడ్డుకు చేరుకోవాలని ఆదేశించాడు. ఆ విధంగా వారందరు క్షేమంగా ఒడ్డుకు చేరుకొన్నారు.