కొలొస్సయులకు 1:26-29

కొలొస్సయులకు 1:26-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

దేవుని వాక్యం అనగా గత అనేక యుగాలుగా తరాలుగా మరుగుచేయబడిన మర్మం, కాని ఇది ఇప్పుడు పరిశుద్ధులకు తెలియజేయబడింది. యూదేతరుల మధ్యలో నుండి దేవుడు ఎన్నికచేసిన వారికి ఈ మర్మం యొక్క సంపూర్ణ మహిమైశ్వర్యం ఎలాంటిదో, అనగా మీలో ఉన్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై ఉన్నారనే విషయం తెలియజేయబడింది. మేము అందరిని సంపూర్ణులుగా క్రీస్తులో నిలబెట్టడానికి సమస్త జ్ఞానంతో అందరికి ఆయన గురించే ప్రకటిస్తున్నాము, హెచ్చరిస్తున్నాము, బోధిస్తున్నాము. నాలో బలంగా పని చేస్తున్న క్రీస్తు శక్తి అంతటిని బట్టి, ఇప్పటివరకు నేను ప్రయాసపడి పని చేస్తున్నాను.

కొలొస్సయులకు 1:26-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ రహస్యం యుగయుగాలుగా తరతరాలుగా మర్మంగా ఉంది కానీ ఇప్పుడు దేవుడు తన పవిత్రులకు దాన్ని తెలియజేశాడు. అన్యజనుల్లో ఈ మర్మం అనే దివ్య సంపదను తెలియజేయాలని దేవుడు తలంచాడు. ఈ మర్మం మీలో ఉన్న యేసు క్రీస్తే. ఆయనే మహిమను గూర్చిన ఆశాభావం. మేము ప్రకటిస్తున్నది ఈయననే. ప్రతి వ్యక్తినీ క్రీస్తులో పరిపూర్ణుడిగా చేసి దేవుని ముందు నిలబెట్టాలి. ఈ ఉద్దేశంతోనే మేము సమస్త జ్ఞానంతో ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నాం బోధిస్తున్నాం. దీని కోసం నేను శ్రమిస్తూ ఉన్నాను. నాలో బలంగా పని చేస్తున్న ఆయన మహత్తర శక్తిని నేను వినియోగించుకుంటూ ప్రయాసపడుతున్నాను.

కొలొస్సయులకు 1:26-29 పవిత్ర బైబిల్ (TERV)

యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము. దీన్ని సాధించటానికి నేను నా శక్తినంతా ఉపయోగించి కష్టపడి పని చేస్తున్నాను. నాలో ఉన్న ఈ బలవత్తరమైన శక్తి క్రీస్తు నాలో ఉండి పని చేయటం వల్ల కలుగుతోంది.

కొలొస్సయులకు 1:25-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుని వాక్యమును, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడియున్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు, మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యేర్పాటు ప్రకారము, నేను ఆ సంఘమునకు పరిచార కుడనైతిని. అన్యజనులలో ఈ మర్మముయొక్క మిహ మైశ్వర్యము ఎట్టిదో అది, అనగా మీయందున్న క్రీస్తు, మహిమ నిరీక్షణయై యున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి యిప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ప్రతిమనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతిమనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతిమనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. అందునిమిత్తము నాలో బలముగా, కార్యసిద్ధికలుగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను.