ద్వితీయోపదేశకాండము 30:19-20
ద్వితీయోపదేశకాండము 30:19-20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.
ద్వితీయోపదేశకాండము 30:19-20 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఈరోజు జీవాన్నీ చావునూ ఆశీర్వాదాన్నీ శాపాన్నీ నేను మీ ఎదుట ఉంచుతున్నాను. భూమినీ, ఆకాశాన్నీ మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”
ద్వితీయోపదేశకాండము 30:19-20 పవిత్ర బైబిల్ (TERV)
“ఈ వేళ మీరు కోరుకొనేందుకు రెండు విషయాలు మీకు యిస్తున్నాను. మీరు కోరుకొనే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు లేదా మరణం కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదం తెచ్చిపెడ్తుంది. రెండోది కోరుకుంటే అది శాపం తెస్తుంది. అందుచేత జీవం కోరుకోండి. అప్పుడు మీరూ, మీ పిల్లలూ జీవిస్తారు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం, మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు యిస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్షు ఇస్తాడు.”
ద్వితీయోపదేశకాండము 30:19-20 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఈ రోజు నేను మీ ముందు జీవాన్ని మరణాన్ని, దీవెనలు శాపాలను ఉంచి, ఆకాశాలను భూమిని మీకు మీద సాక్షులుగా పిలుస్తాను. ఇప్పుడు జీవాన్ని ఎంచుకోండి, అప్పుడు మీరు, మీ పిల్లలు బ్రతకవచ్చు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించేలా, ఆయన స్వరాన్ని విని ఆయనను గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే యెహోవాయే మీ జీవం; మీ పితరులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ప్రమాణం చేసిన దేశంలో ఆయన మీకు దీర్ఘాయుష్షు ఇస్తారు.