ప్రసంగి 5:1-7 - అన్ని సంస్కరణలను పోల్చండి
ప్రసంగి 5:1-7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము; బుద్ధిహీనులు అర్పించునట్లుగా బలి అర్పించుటకంటె సమీపించి ఆలకించుట శ్రేష్ఠము; వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనియ్యక నీ నోటిని కాచు కొమ్ము; దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాటులవలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము; బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు. నీవు మ్రొక్కుకొనినదాని చెల్లించుము, నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుటకంటె మ్రొక్కుకొనకుండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటివలన జరుగనియ్యకుము; అది పొరపాటుచేత జరిగెనని దూత యెదుట చెప్పకుము; నీ మాటలవలన దేవునికి కోపము పుట్టించి నీవేల నీ కష్టమును వ్యర్థపరచుకొనెదవు? అధికమైన స్వప్నములును మాటలును నిష్‌ప్రయోజనములు; నీమట్టుకు నీవు దేవునియందు భయభక్తులు కలిగియుండుము.
ప్రసంగి 5:1-7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము చేసే పనులు దుర్మార్గమైనవని తెలుసుకోకుండా బుద్ధిహీనుల్లాగా బలులు అర్పించడం కంటే దానికి దగ్గరగా వెళ్లి మాటలు వినడం మంచిది. దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడక నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి. విస్తారమైన పనులు, చింతల వలన చెడ్డ కలలు వస్తాయి. ఎక్కువ మాటలు పలికేవాడు ఎక్కువ మూర్ఖంగా పలుకుతాడు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుంటే దాన్ని త్వరగా చెల్లించు. మూర్ఖుల విషయంలో ఆయన సంతోషించడు. నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించు. మొక్కుకుని చెల్లించకపోవడం కంటే అసలు మొక్కుకోకపోవడం మంచిది. నీ శరీరం పాపంలో పడేలా చేసేటంతగా నీ నోటిని మాట్లాడనీయకు. “ఆ మొక్కుబడి పొరపాటుగా చేశాను” అని యాజకునితో చెప్పవద్దు. నీ మాటలతో దేవునికి కోపం తెప్పించి ఎందుకు నష్టపోతావు? ఎక్కువ కలలతో, మాటలతో ప్రయోజనం లేదు. నీ వరకూ నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి ఉండు.
ప్రసంగి 5:1-7 TERV (పవిత్ర బైబిల్)
దేవుణ్ణి ఆరాధించేందుకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మూఢ జనం మాదిరిగా బలులు ఇవ్వడం కంటె (దైవవాణిని) వినడం మేలు. మూఢులు తరచు చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకి తమ పనులు చెడ్డవని కూడా తెలియదు. దేవునికి మీరు మొక్కులు మొక్కేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవునికి మీ సమర్పణ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆవేశంలో తొందరపడి నోరుజారకండి. దేవుడు పైన పరలోకంలో ఉన్నాడు, మీరు క్రింద భూమిమీద వున్నారు. అందుకని దేవునికి వేడుకొనుట కొద్దిగా మాత్రమే మీరు చెయ్యండి. (ఈ కింది లోకోక్తి లోని వాస్తవాన్ని గమనించండి) అధిక వ్యాకుల మనస్కులు పీడకలలు కంటారు, బుద్ధిహీనులు అతిగా వాగుతారు. దేవునికి నీవేదైనా మొక్కకుంటే, దాన్ని చెల్లించు. నీవు మొక్కుకున్నదాన్ని చెల్లించడంలో ఆలస్యం చేయకు. బుద్ధిహీనుల విషయంలో దేవుడు ప్రసన్నుడు కాడు. దేవునికి ఇస్తానన్నదాన్ని నీవాయనకు ఇవ్వు. ఏదైనా వాగ్దానం చేసి దాన్ని చేయలేక పోవడం కంటె, అసలేమి మొక్కుకోక పోవడమే మేలు. అందుకని, నీ మాటలు పాపకారణం కాకుండా చూసుకో. “నేను అన్న మాట అర్థం అది కాదు!” అని నీ యాజకుడితో చెప్పబోకు. నీవాపని చేస్తే, దేవునికి నీ మాటల పట్ల కోపం రావచ్చు, నీవు శ్రమించి సాధించిన దాన్నంతటినీ నాశనం చెయ్యవచ్చు. నీ పనికిమాలిన స్వప్నాలు, బింకాలు (నీకు హాని కలిగించకుండా) చూసుకో. నీవు దేవుని పట్ల భక్తి కలిగి ఉండు.
ప్రసంగి 5:1-7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీవు దేవుని ఆలయానికి వెళ్లినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. తాము దుర్మార్గపు పనులు చేస్తున్నామని తెలుసుకోకుండా మూర్ఖుల్లా బలి అర్పించడం కన్నా దగ్గరకు వెళ్లి వినడం మంచిది. దేవుని ముందు అనాలోచితంగా మాట్లాడటానికి, నీ హృదయం తొందరపడకుండ నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశంలో ఉన్నారు నీవు భూమిపై ఉన్నావు, కాబట్టి నీ మాటలు తక్కువగా ఉండాలి. విస్తారమైన పనుల వల్ల కలలు వస్తాయి. ఎక్కువ మాటలు మాట్లాడేవారు మూర్ఖునిలా మాట్లాడతారు. నీ దేవునికి చేసుకున్న మ్రొక్కుబడిని చెల్లించడంలో ఆలస్యం చేయవద్దు. మూర్ఖుల గురించి దేవుడు సంతోషించరు, నీ మ్రొక్కుబడిని చెల్లించు. మ్రొక్కుబడి చేసి చెల్లించక పోవడం కంటే మ్రొక్కుబడి చేయకపోవడమే మంచిది. నీ మాటలు నిన్ను పాపంలోకి పడవేయకుండా చూసుకో. ఆలయ దూతకు, “పొరపాటున మొక్కుబడి చేశాను” అని చెప్పవద్దు. నీ మాటలకు దేవుడు కోప్పడి నీ చేతిపనిని నాశనం చేయడం అవసరమా? ఎక్కువ కలలు ఎక్కువ మాటలు అర్థరహితమే. కాబట్టి దేవునికి భయపడు.