ఎస్తేరు 2:5-8 - అన్ని సంస్కరణలను పోల్చండి
ఎస్తేరు 2:5-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను పట్టుకొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతోకూడ యెరూషలేము నుండి చెరపట్టబడినవారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తెయైన హదస్సా అను ఎస్తేరు తలిదండ్రులు లేనిదై యుండగా అతడామెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమునుగలదై యుండెను. ఆమె తలిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురముచేయబడి కన్యకలు అనేకులు షూషను కోటకు పోగుచేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా, ఎస్తేరును రాజుయొక్క నగరునకు తేబడి, స్త్రీలను కాయు హేగేవశమునకు అప్పగింపబడెను.
ఎస్తేరు 2:5-8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
షూషను కోటలో బెన్యామీను గోత్రం వాడైన కీషుకు పుట్టిన షిమీ కొడుకు, యాయీరు వంశికుడు అయిన మొర్దెకై అనే ఒక యూదుడుండేవాడు. బబులోను రాజు నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను బందీగా కొనిపోయినప్పుడు ఇతడు యెకోన్యాతో బాటు యెరూషలేము నుండి చెరకు వచ్చిన వాడు. అతడు తన బాబాయి కూతురు ఎస్తేరు అనే మారు పేరు గల హదస్సా అనే అమ్మాయిని చేరదీసి పెంచుకున్నాడు. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఆమె సౌందర్యవతి. చూడ చక్కని ముఖవర్చస్సు గలది. ఆమె తలిదండ్రులు చనిపోయాక మొర్దెకై ఆమెను తన సొంత కూతురుగా చూసుకోసాగాడు. రాజ శాసనం, ఆజ్ఞ ప్రకటించడం అయిన తరువాత చాలామంది కన్యలను తెచ్చి షూషను కోటలో ఉంచారు. వారినందరినీ హేగే పర్యవేక్షణలో ఉంచారు. ఎస్తేరును కూడా అంతఃపురానికి తెచ్చి స్త్రీల సంరక్షణ చూసుకునే హేగే వశంలో ఉంచారు.
ఎస్తేరు 2:5-8 TERV (పవిత్ర బైబిల్)
రాజధాని నగరం షూషనులో బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై అనే ఒక యూదుడు వున్నాడు. మొర్దెకై తండ్రి యాయీరు. యాయీరు తండ్రి కీషు. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకోన్యాను బందీగా పట్టుకొన్నాడు యెరూషలేము నుంచి చెరపట్టబడినవారిలో మొర్దెకై కూడా ఒకడు. హదస్సా అనే ఒక అమ్మాయి వుంది. ఆమె మొర్దెకైకి పినతండ్రి కూతురు. ఆమె తల్లితండ్రులు మరణించినప్పుడు, మొర్దకై ఆమెని చేరదీసి, తన స్వంత కూతురులా పెంచి పోషించాడు. హదస్సాకి ఎస్తేరు అనే పేరుకూడా వుంది. ఎస్తేరు అందమైన రూపమును సుందర ముఖమును గలదై యుండెను. మహారాజుయొక్క ఆజ్ఞ ప్రకటింపబడిన మీదట చాలామంది కన్యలు రాజధాని అయిన షూషను నగరానికి తరలింపబడ్డారు. వాళ్లందరూ హేగే నపుంసకుని అధీనంలో ఉంచబడ్డారు. ఆ యువతుల్లో ఎస్తేరు ఒకతె. ఎస్తేరును రాజభవనానికి తీసుకుపోయి, మిగిలిన అంతఃపుర స్త్రీలతో బాటు హేగే అధీనంలో ఉంచారు.
ఎస్తేరు 2:5-8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ సమయంలో షూషను కోటలో బెన్యామీను గోత్రానికి చెందిన కీషుకు పుట్టిన షిమీ యొక్క కుమారుడైన యాయీరుకు పుట్టిన మొర్దెకై అనే యూదుడు ఉండేవాడు, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నుండి చెరకు తీసుకెళ్లిన యూదా రాజైన యెహోయాకీనుతో పాటు ఉన్నవారిలో ఇతడు ఉన్నాడు. మొర్దెకై యొక్క పినతండ్రి యొక్క కుమార్తె, హదస్సా అనే బంధువు ఉన్నది, ఆమెకు తల్లిదండ్రులు లేనందుకు అతడే ఆమెను పెంచాడు. ఎస్తేరు అని కూడ పిలువబడే ఈ యువతి మంచి రూపం కలిగి, అందంగా ఉండేది. ఆమె తల్లిదండ్రులు చనిపోయినప్పుడు మొర్దెకై ఆమెను తన సొంత కుమార్తెగా దత్తత తీసుకున్నాడు. రాజు ఆజ్ఞ అంతా ప్రకటించబడింది, చాలామంది యువతులను, షూషను కోటకు తెచ్చారు, హేగై అనే ఆ అంతఃపురం యొక్క అధికారి ఆధీనంలో వారిని ఉంచారు, ఎస్తేరును కూడా రాజభవనానికి తీసుకెళ్లి హేగైకు అప్పగించారు.