ఆదికాండము 3:21-24

ఆదికాండము 3:21-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా–ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవ వృక్షఫలమును కూడ తీసికొనితిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేలనుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలోనుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను.

షేర్ చేయి
Read ఆదికాండము 3

ఆదికాండము 3:21-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

దేవుడైన యెహోవా ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో బట్టలు చేసి తొడిగించాడు. దేవుడైన యెహోవా “ఇప్పుడు మనిషి మంచి చెడ్డలు తెలిసిన మనలాంటివాడయ్యాడు. కాబట్టి ఒకవేళ అతడు తన చెయ్యి చాపి ఆ జీవ వృక్షఫలం కూడా తీసుకుని తిని శాశ్వతంగా జీవిస్తాడేమో. అది మంచిది కాదు” అన్నాడు. దేవుడైన యెహోవా అతణ్ణి ఏ నేలనుంచి తీశాడో ఆ నేలను సాగు చెయ్యడానికి ఏదెను తోటలోనుంచి అతణ్ణి పంపివేశాడు. కాబట్టి దేవుడు ఏదెను తోటలోనుంచి ఆదామును వెళ్ళగొట్టి, ఏదెను తోటకు తూర్పు వైపు కెరూబులు, జీవవృక్షానికి వెళ్ళే దారిని కాపలా కాయడానికి ఇటు అటు తిరిగే అగ్నిఖడ్గం నిలబెట్టాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 3

ఆదికాండము 3:21-24 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా దేవుడు జంతు చర్మాలతో ఆ పురుషునికి, అతని భార్యకు చొక్కాలు చేశాడు. ఆ తరువాత ఆ చొక్కాలను వారికి తొడిగించాడు. అప్పుడు యెహోవా దేవుడు అన్నాడు: “చూడండి, మనిషి మనలా తయారయ్యాడు. మంచి, చెడ్డలు మనిషికి తెలుసు. ఇప్పుడు ఆ మనిషి జీవ వృక్షంనుండి ఫలములు తీసుకొని తింటే అతడు శాశ్వతంగా జీవిస్తాడు.” కనుక ఏదెను తోటనుండి ఆ మనిషిని యెహోవా దేవుడు వెళ్లగొట్టాడు. ఆదాము బలవంతంగా వెళ్లగొట్టబడి ఏ నేల నుండి అతడు తీయబడ్డాడో ఆ నేలను సేద్యం చేయటం మొదలు పెట్టాడు. తరువాత ఆ తోటకు కాపలాగా దాని ద్వారం దగ్గర కెరూబులను దేవుడు ఉంచాడు. ఒక అగ్ని ఖడ్గాన్ని కూడా అక్కడ ఉంచాడు. జీవ వృక్షమునకు పోయే మార్గాన్ని కాపలా కాస్తూ ఆ ఖడ్గం చుట్టూరా తిరుగుతూవుంది.

షేర్ చేయి
Read ఆదికాండము 3

ఆదికాండము 3:21-24 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవా దేవుడు ఆదాముకు అతని భార్యకు జంతు చర్మంతో చేసిన వస్త్రాలను తొడిగించారు. అప్పుడు యెహోవా దేవుడు, “మనుష్యుడు ఇప్పుడు మంచి చెడ్డలు తెలుసుకోగలిగి మనలాంటి వాడయ్యాడు, కాబట్టి అతడు తన చేయి చాపి జీవవృక్ష ఫలం కూడా తెంపుకొని తిని ఎప్పటికీ బ్రతికే ఉంటాడేమో, అలా జరగనివ్వకూడదు” అని అనుకున్నారు. కాబట్టి యెహోవా దేవుడు అతన్ని ఏదెను తోట నుండి బయటకు వెళ్లగొట్టి అతడు ఏ మట్టి నుండి తీయబడ్డాడో, ఆ మట్టినే సాగు చేసుకునేలా చేశారు. దేవుడు ఆదామును బయటకు పంపివేసి జీవవృక్షం దగ్గరకు వెళ్లే మార్గాన్ని కాపాడడానికి ఏదెను తోటకు తూర్పున కెరూబును ఇటు అటు తిరుగుతున్న మండుతున్న ఖడ్గాన్ని కాపలా ఉంచారు.

షేర్ చేయి
Read ఆదికాండము 3