ఆదికాండము 40:1-8
ఆదికాండము 40:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటుపిమ్మట ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పుచేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన యిద్దరు ఉద్యోగస్థులమీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశముచేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్నిదినములు కావలిలోనుండినతరువాత వారిద్దరు, అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజుయొక్క పానదాయకుడును, భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి; ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతా క్రాంతులై యుండిరి. అతడు–ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి యున్నవని తన యజమానుని యింట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్థుల నడిగెను. అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.
ఆదికాండము 40:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ తరువాత ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడూ, రొట్టెలు చేసేవాడూ తమ యజమాని పట్ల నేరం చేశారు. తన ఇద్దరు ఉద్యోగస్థులు, అంటే గిన్నె అందించే వాడి మీదా రొట్టెలు చేసే వాడి మీదా ఫరో కోపగించుకున్నాడు. వారిని చెరసాలలో ఉంచడానికి రాజు అంగరక్షకుల అధిపతికి అప్పగించాడు. ఆ చెరసాలలోనే యోసేపును కూడా బంధించారు. ఆ అధిపతి వారందరినీ యోసేపు ఆధీనంలో ఉంచాడు. అతడు వారి బాగోగులు చూసేవాడు. వారు కొన్నిరోజులు బందీలుగా ఉన్న తరువాత వారిద్దరూ, అంటే ఐగుప్తు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు ఒకే రాత్రి కలలు కన్నారు. ఒక్కొక్కడు వేరు వేరు భావాలతో కల కన్నారు. ఉదయాన యోసేపు వారి దగ్గరికి వచ్చి చూసినపుడు వారు విచారంగా ఉన్నారు. అతడు “మీరెందుకు విచారంగా ఉన్నారు?” అని వారిని అడిగాడు. అందుకు వారు “మా ఇద్దరికీ ఒక్కో కల వచ్చింది. వాటి అర్థం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు” అన్నారు. యోసేపు వారితో “అర్థాలు తెలియచేయడం దేవుని అధీనమే గదా! దయచేసి నాకు చెప్పండి” అన్నాడు.
ఆదికాండము 40:1-8 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తరువాత ఫరో సేవకులు ఇద్దరు ఫరోకు అపకారం చేశారు. ఆ సేవకుల్లో ఒకడు రొట్టెలు కాల్చేవాడు. మరొకడు ద్రాక్షా పాత్రలు అందించేవారి పెద్ద. వంటల పెద్ద, ద్రాక్షా పాత్రల పెద్ద మీద ఫరోకు కోపం వచ్చింది. కనుక వారిని కూడా యోసేపు ఉన్న చెరసాలలోనే వేయించాడు. ఫరో రాజు సంరక్షకుల అధికారియైన పోతీఫరు ఈ చెరసాల అధికారి. ఈ ఇద్దరు ఖైదీలను యోసేపు బాధ్యతకు అప్పగించాడు అధికారి. ఆ ఇద్దరు మనుష్యులు కొన్నాళ్ల వరకు అలా చెరసాలలోనే ఉన్నారు. ఒక రాత్రి ఆ ఇద్దరు ఖైదీలకు కలలు వచ్చాయి. (ఈ ఇద్దరు ఖైదీలు ఈజిప్టు రాజు సేవకులు– ఒకడు రొట్టెలు కాల్చేవాడు, మరొకడు ద్రాక్షా పాత్రల పెద్ద). ఒక్కో ఖైదీకి ఒక్కో కల వచ్చింది. ఒక్కో కలకు ఒక్కో భావం ఉంది. మర్నాడు ఉదయం యోసేపు వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఆ ఇద్దరు మనుష్యులు ఏదో చింతిస్తున్నట్లు యోసేపు గమనించాడు. “ఏమిటి, ఈ వేళ మీరు చాలా చింతిస్తున్నట్లు కనబడుతున్నారు?” అని వారిని అడిగాడు యోసేపు. “రాత్రి మాకు కలలు వచ్చాయి. కాని మేము కన్న కలలు మాకు అర్థం కాలేదు. ఆ కలలు ఏమిటో, వాటి భావం ఏమిటో మాకు వివరించే వాళ్లెవరూ లేరు” అని వాళ్లిద్దరు జవాబిచ్చారు. యోసేపు, “కలలను తెలిసికొని, వాటి భావం చెప్పగలవాడు దేవుడు మాత్రమే కనుక దయచేసి మీ కలలు నాకు చెప్పండి” అని వారితో అన్నాడు.
ఆదికాండము 40:1-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కొంతకాలం తర్వాత ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు రొట్టెలు చేసేవాడు తమ యజమాని పట్ల తప్పు చేశారు. కాబట్టి ఫరో తన ఇద్దరి అధికారులపై అనగా గిన్నె అందించేవారి నాయకునిపై, రొట్టెలు కాల్చేవారి నాయకునిపై కోప్పడి, వారిని అంగరక్షకుల అధికారి ఆధీనంలో, అతని ఇంట్లో ఉంచాడు, అదే చెరసాలలో యోసేపు బంధించబడి ఉన్నాడు. అంగరక్షకుల అధికారి వీరిద్దరిని యోసేపుకు అప్పగించాడు, అతడు వారిని చూసుకున్నాడు. వారు కొంతకాలం వరకు చెరసాలలో ఉన్నప్పుడు, ఈజిప్టు రాజుకు గిన్నె అందించేవాడు, రొట్టెలు చేసేవాడు చెరలో ఉన్నప్పుడు ఇద్దరూ ఒకే రాత్రి కలగన్నారు. ఇద్దరి కలలకు దేని భావం దానికే ఉంది. మరుసటిరోజు ప్రొద్దున్నే యోసేపు వారి దగ్గరకు వచ్చినప్పుడు, వారు దిగులుగా ఉన్నట్లు గమనించాడు. కాబట్టి అతడు తన యజమాని ఇంట్లో నిర్బంధంలో ఉన్న అధికారులను, “మీరు ఎందుకు ఈ రోజు విచారంగా ఉన్నారు?” అని అడిగాడు. “మా ఇద్దరికి కలలు వచ్చాయి కానీ వాటి భావం చెప్పడానికి ఎవరు లేరు” అని వారు జవాబిచ్చారు. అప్పుడు యోసేపు వారితో, “భావాలు చెప్పడం దేవుని వశం కాదా? మీ కలలు నాకు చెప్పండి” అని అన్నాడు.