ఆదికాండము 6:1-22

ఆదికాండము 6:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నరులు భూమిమీద విస్తరింప నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కనివారని చూచి వారందరిలో తమకు మనస్సువచ్చిన స్త్రీలను వివాహము చేసికొనిరి. అప్పుడు యెహోవా–నా ఆత్మ నరులతో ఎల్లప్పుడును వాదించదు; వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై యున్నారు; అయినను వారి దినములు నూట ఇరువది యేండ్లగుననెను. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీదనుండిరి; తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వ కాలమందు పేరు పొందిన శూరులు వీరే. నరుల చెడు తనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయముయొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా–నేను సృజించిన నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; ఏలయనగా నేను వారిని సృష్టించినం దుకు సంతాపము నొందియున్నాననెను. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను. నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి. దేవుడు నోవహుతో–సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చియున్నది; ఇదిగో వారిని భూమితోకూడ నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలుపెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాని చేయవలసిన విధమిది; ఆ ఓడ మూడువందల మూరల పొడుగును ఏబది మూరల వెడల్పును ముప్పది మూరల యెత్తును గలదై యుండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరెడు క్రిందికి దాని ముగించవలెను; ఓడ తలుపు దాని ప్రక్కను ఉంచవలెను; క్రింది అంతస్థు రెండవ అంతస్థు మూడవ అంతస్థు గలదిగా దాని చేయవలెను. ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండకుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును; అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును; నీవును నీతోకూడ నీ కుమారులును నీ భార్యయు నీ కోడండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతోకూడ వాటిని బ్రదికించి యుంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరులయొక్క ప్రతి జాతిలో నివి రెండేసి చొప్పున నీవు ఓడలోనికి తేవలెను; వాటిలో మగదియు ఆడుదియు నుండవలెను. నీవు వాటిని బ్రదికించి యుంచుకొనుటకై వాటి వాటి జాతుల ప్రకారము పక్షులలోను, వాటి వాటి జాతుల ప్రకారము జంతువులలోను, వాటి వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోను, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ యొద్దకు అవి వచ్చును. మరియు తినుటకు నానావిధములైన ఆహారపదార్థములను కూర్చుకొని నీదగ్గర ఉంచుకొనుము; అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను.

షేర్ చేయి
Read ఆదికాండము 6

ఆదికాండము 6:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మనుషులు భూమి మీద విస్తరించడం మొదలుపెట్టారు. వాళ్లకు కూతుళ్ళు పుట్టినప్పుడు దైవ కుమారులు మనుషుల కూతుళ్ళు అందంగా ఉండడం చూసి, వాళ్ళల్లో తమకు నచ్చిన స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు. యెహోవా “జీవమిచ్చే నా ఊపిరి మనుషుల్లో ఎల్లకాలం ఉండదు. ఎందుకంటే వారు బలహీనమైన రక్తమాంసాలు గలవారు. వారు నూట ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకరు” అన్నాడు. దైవ కుమారులు మనుషుల కూతుళ్ళను పెళ్ళి చేసుకున్నప్పుడు వాళ్లకు పిల్లలు పుట్టారు. వీరు ఆ రోజుల్లో, ఆ తరువాత కూడా భూమి మీద ఉన్న దీర్ఘదేహులు. ఈ మహా కాయులు గొప్ప శూరులు. పూర్వకాలంలో పేరుప్రఖ్యాతులు గల వారు వీరే. మనుషుల దుర్మార్గం భూమిమీద మితిమీరి పోయిందని, వాళ్ళ హృదయ ఆలోచనా విధానం ఎప్పుడూ దుష్టత్వమే అని యెహోవా చూశాడు. తాను భూమిమీద మనుషులను చేసినందుకు బాధపడి, హృదయంలో విచారించాడు. కాబట్టి యెహోవా “నేను సృష్టించిన మనుషులను ఈ భూమిమీద లేకుండా చేస్తాను. మనుషులతో పాటు జంతువులను, పాకే జీవులను, ఆకాశపక్షులను భూమిమీద లేకుండా తుడిచి వేస్తాను. ఎందుకంటే నేను వాళ్ళను సృష్టించినందుకు బాధపడుతున్నాను” అన్నాడు. అయితే నోవహు యెహోవా దృష్టిలో అనుగ్రహం పొందాడు. నోవహు గురించిన సంగతులు ఇవే. నోవహు నీతిపరుడు. అతని తరం వాళ్ళల్లో నింద లేనివాడు. నోవహు దేవునితో కలసి నడిచాడు. షేము, హాము, యాపెతు అనే ముగ్గురు కొడుకులకు నోవహు తండ్రి అయ్యాడు. దేవుని దృష్టిలో లోకం చెడిపోయింది. అది హింసతో నిండిపోయింది. దేవుడు లోకాన్ని చూడగా అది చెడిపోయి ఉంది. భూమిమీద మనుషులందరూ తమ మార్గాల్లో చెడిపోయారు. దేవుడు నోవహుతో “మనుషుల మూలంగా భూమి హింసతో నిండిపోయింది గనుక వాళ్ళను అంతం చేసే సమయం వచ్చినట్టు తేటతెల్లం అయింది. కచ్చితంగా ఈ భూమితోపాటు వాళ్ళందరినీ నాశనం చేస్తాను. కోనిఫర్ కలపతో నీ కోసం ఒక ఓడ సిద్ధం చేసుకో. గదులతో ఉన్న ఓడను తయారుచేసి, దానికి లోపలా బయటా తారు పూయాలి. నువ్వు దాన్ని చెయ్యాల్సిన విధానం ఇదే. ఆ ఓడ మూడు వందల మూరల పొడవు, ఏభై మూరల వెడల్పు, ముప్ఫై మూరల ఎత్తు ఉండాలి. ఆ ఓడకు కిటికీ చేసి పైనుంచి కిందికి ఒక మూర దూరంలో దాన్ని బిగించాలి. ఓడకు ఒక పక్క తలుపు ఉంచాలి. మూడు అంతస్థులు ఉండేలా దాన్ని చెయ్యాలి. విను, నేను ఊపిరి ఉన్నవాటన్నిటినీ ఆకాశం కింద లేకుండా నాశనం చెయ్యడానికి భూమి మీదికి జలప్రవాహం రప్పించబోతున్నాను. లోకంలో ఉన్నవన్నీ చనిపోతాయి. కానీ, నీతో నా నిబంధన నెరవేరుస్తాను. నువ్వు, నీతోపాటు నీ కొడుకులు, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశిస్తారు. నీతోపాటు వాటిని కూడా సజీవంగా ఉంచడం కోసం జీవులన్నిటిలో, అంటే, శరీరం ఉన్న ప్రతి జాతిలోనుంచి రెండేసి చొప్పున నువ్వు ఓడలోకి తేవాలి. వాటిలో ఒకటి మగది ఒకటి ఆడది ఉండాలి. అవి చనిపోకుండా ఉండడానికి వాటి వాటి జాతుల ప్రకారం పక్షుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం జంతువుల్లో, వాటి వాటి జాతుల ప్రకారం నేల మీద పాకే వాటన్నిట్లో, ప్రతి జాతిలో రెండేసి చొప్పున నీ దగ్గరికి అవే వస్తాయి. తినడానికి కావలసిన అన్నిరకాల ఆహార పదార్ధాలు సమకూర్చుకుని నీ దగ్గర ఉంచుకోవాలి. అవి నీకు, వాటికి ఆహారం అవుతాయి” అని చెప్పాడు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 6

ఆదికాండము 6:1-22 పవిత్ర బైబిల్ (TERV)

భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు. ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు. అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.” భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్లు యెహోవా చూశాడు. ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.” అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు. ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు. దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు. కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి. “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు. “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.” వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 6

ఆదికాండము 6:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

నరులు భూమిపై వృద్ధి చెంది విస్తరిస్తూ ఉన్న సమయంలో వారికి కుమార్తెలు పుట్టినప్పుడు, దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉండడం చూసి, వారిలో నచ్చిన వారిని పెళ్ళి చేసుకున్నారు. అప్పుడు యెహోవా, “నా ఆత్మ నరులతో నిరంతరం వాదించదు, ఎందుకంటే వారు శరీరులు; వారి బ్రతుకు దినాలు 120 సంవత్సరాలు అవుతాయి” అని అన్నారు. ఆ దినాల్లో భూమిపై నెఫిలీములు ఉండేవారు, వీరు తర్వాత కూడా ఉన్నారు. వీరు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో లైంగిక సంబంధం పెట్టుకున్నప్పుడు పుట్టిన పిల్లలు. వీరు ప్రాచీన కాలంలో పేరు పొందిన యోధులు. యెహోవా భూమిపై నరుల దుష్టత్వం చాలా విస్తరించిందని, నరుల హృదయంలోని ప్రతీ ఊహ కేవలం చెడు అని చూశారు. యెహోవా భూమిపై నరులను చేసినందుకు చింతించి, హృదయంలో చాలా బాధపడ్డారు. అప్పుడు యెహోవా, “నేను సృజించిన నరులను, వారితో పాటు జంతువులను, పక్షులను, నేలపై ప్రాకే జీవులను భూమి మీద నుండి తుడిచివేస్తాను, వాటిని చేసినందుకు నేను బాధపడుతున్నాను” అని అనుకున్నారు. అయితే నోవహు యెహోవా దృష్టిలో దయ పొందుకున్నాడు. నోవహు అతని కుటుంబం యొక్క వివరాలు: నోవహు నీతిమంతుడు, అతని సమకాలికులలో అతడు నిందారహితుడు, దేవునితో నమ్మకంగా జీవించాడు. నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు. దేవుని దృష్టిలో భూమి అవినీతితో హింసతో నిండిపోయింది. దేవుడు ఈ భూమి ఎంతో అవినీతితో ఉందని చూశారు, ఎందుకంటే భూమిపై ఉన్న ప్రజలంతా తమ జీవిత విధానాలను పాడుచేసుకున్నారు. కాబట్టి దేవుడు నోవహుతో ఇలా అన్నారు, “నేను ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, ఎందుకంటే వారిని బట్టి భూమి హింసతో నిండిపోయింది. నేను ఖచ్చితంగా వారిని, భూమిని నాశనం చేయబోతున్నాను. కాబట్టి నీకోసం తమాల వృక్ష చెక్కతో ఒక ఓడను నిర్మించుకో; దానిలో గదులు చేసి, దానికి లోపల బయట కీలు పూయాలి. దానిని నిర్మించవలసిన విధానం: ఆ ఓడ పొడవు 300 మూరలు, వెడల్పు 50 మూరలు, ఎత్తు 30 మూరలు ఉండాలి. దానికి పైకప్పు వేసి, మూర కొలత క్రింద అన్ని మూలలు గల ఒక కిటికీ పెట్టాలి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి, క్రింద, మధ్య, పై అంతస్తులు నిర్మించాలి. ఆకాశం క్రింద ఉన్న సమస్త జీవులను, జీవవాయువు గల ప్రతి ప్రాణిని నాశనం చేయడానికి నేను భూమి మీదికి జలప్రళయం తీసుకురాబోతున్నాను. భూమిపై ఉన్న ప్రతిదీ నశిస్తుంది. అయితే నీతో నా నిబంధనను స్థిరపరుస్తాను, ఓడలో నీతో పాటు నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్ళు ప్రవేశించాలి. మీతో పాటు బ్రతికి ఉండేలా జీవులన్నిటిలో మగ, ఆడవాటిని మీరు ఓడలోకి తీసుకురావాలి. ప్రతి జాతిలో రెండేసి పక్షులు, ప్రతి జాతిలో రెండేసి జంతువులు, ప్రతి జాతిలో నేలపై ప్రాకే ప్రాణులు బ్రతికి ఉండడానికి నీ దగ్గరకు వస్తాయి. నీకు, వాటికి తినడానికి ఆహారాన్ని అన్ని రకాల భోజనపదార్థాలు సమకూర్చుకోవాలి.” దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు.

షేర్ చేయి
Read ఆదికాండము 6