ఆదికాండము 7:1-24

ఆదికాండము 7:1-24 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

అప్పుడు యెహోవా నోవహుతో, “నీవు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి, ఎందుకంటే ఈ తరంలో నీవు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు. నీతో పాటు పవిత్రమైన జంతువుల్లో జంటల చొప్పున ఏడు మగవాటిని, ఏడు ఆడవాటిని, అపవిత్రమైన వాటిలో ఒక మగదానిని, అలాగే పక్షిజాతులన్నిటిలో నుండి ఏడు మగవాటిని ఏడు ఆడవాటిని భూమిపై వాటి జాతులు సజీవంగా ఉంచడానికి ఓడలోకి తీసుకెళ్లు. ఇంకా ఏడు రోజుల్లో భూమి మీద నలభై రాత్రింబగళ్ళు నేను వర్షం కురిపిస్తాను, నేను చేసిన ప్రతి ప్రాణిని భూమి మీద నుండి తుడిచివేస్తాను” అని అన్నారు. యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారమే నోవహు అంతా చేశాడు. భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు. జలప్రళయం నుండి తప్పించుకోడానికి నోవహు, అతని భార్య, కుమారులు, వారి భార్యలు ఓడలోనికి ప్రవేశించారు. పవిత్రమైన, అపవిత్రమైన జంతువుల్లో, పక్షుల్లో, నేలపై ప్రాకే జీవులన్నిటిలో, దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే మగవి ఆడవి, జతలుగా నోవహు దగ్గరకు వచ్చి ఓడలో ప్రవేశించాయి. ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. నోవహుకు 600 సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున గొప్ప అగాధంలోని ఊటలన్నీ ఉప్పొంగాయి, ఆకాశ తూములు ద్వారాలు తెరుచుకున్నాయి. నలభై రాత్రింబగళ్ళు భూమిపై వర్షం కురిసింది. ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు. ప్రతి జాతి ప్రకారం అడవి జంతువులు, వాటి వాటి జాతుల ప్రకారం అన్ని రకాల పశువులు, ఆయా జాతుల ప్రకారం నేలపై ప్రాకే జీవులు, వాటి వాటి జాతుల ప్రకారం పక్షులు, రెక్కలు గల ప్రతిదీ వారితో ఉన్నాయి. జీవపు ఊపిరి ఉన్న అన్ని జీవుల జతలు నోవహు దగ్గరకు వచ్చి ఓడలోకి ప్రవేశించాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారమే అన్ని జీవులలో ఆడవి మగవి జతలుగా ఓడలోకి వెళ్లాయి. అప్పుడు యెహోవా ఓడ తలుపు మూసివేశారు. నలభై రోజులు భూమిపై జలప్రళయం ముంచెత్తింది, నీళ్లు నిండిన కొలది ఓడ నీటిపై తేలుతూ ఉంది. భూమిపై జలాలు అధికంగా విస్తరించాయి, ఆ ఓడ నీటిపై తేలింది. నీరు ఎక్కువై భూమిని కప్పివేశాయి, ఆకాశాల క్రింద ఉన్న అన్ని ఎత్తైన పర్వతాలు నీటిలో మునిగిపోయాయి. నీరు పర్వతాల కన్నా పదిహేను మూరల ఎత్తు లేచి వాటిని కప్పివేశాయి. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అంటే పక్షులు, పశువులు, అడవి జంతువులు, భూమి మీద సంచరించే సమస్త ప్రాణులు చనిపోయాయి, మనుష్యులు కూడా అందరు చనిపోయారు. పొడి నేలపై నాసికారంధ్రాలలో జీవం కలిగి ఉన్న ప్రతి ప్రాణి చనిపోయింది. నేల మీద ఉన్న జీవరాశులన్నీ తుడిచివేయబడ్డాయి; మనుష్యులు, పశువులు, నేల మీద తిరిగే జీవులు, పక్షులు తుడిచివేయబడ్డాయి. కేవలం నోవహు, అతనితో ఓడలో ఉన్నవారు మిగిలారు. వరదనీరు భూమిని నూట యాభై రోజులు ముంచెత్తాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 7

ఆదికాండము 7:1-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా “ఈ తరంలో నా దృష్టిలో నువ్వే నీతిమంతుడివిగా ఉండడం చూశాను కాబట్టి నువ్వు, నీ కుటుంబం ఓడలో ప్రవేశించండి. శుద్ధమైన జంతువుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు, శుద్ధంకాని జంతువుల్లో ప్రతి జాతిలో మగ ఆడ రెండు, ఆకాశపక్షుల్లో ప్రతి జాతిలో మగవి ఏడు, ఆడవి ఏడు తీసుకురావాలి. నువ్వు భూమి అంతటిమీద వాటి సంతానాన్ని ప్రాణంతో ఉంచి భద్రం చేసేలా అలా చెయ్యాలి. ఎందుకంటే, ఇంకా ఏడు రోజుల్లో నేను, నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమిమీద వర్షం కురిపించి, నేను చేసిన జీవం ఉన్న ప్రతి దాన్ని నాశనం చేస్తాను” అని నోవహుతో చెప్పాడు. తనకు యెహోవా ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం నోవహు అంతా చేశాడు. ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు. నోవహు, అతనితోపాటు అతని కొడుకులు, అతని భార్య, అతని కోడళ్ళు ఆ జలప్రళయం తప్పించుకోడానికి ఆ ఓడలో ప్రవేశించారు. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం శుద్ధ జంతువుల్లో, అపవిత్ర జంతువుల్లో, పక్షుల్లో నేలమీద పాకే వాటన్నిటిలో, మగ, ఆడ, జతలుగా ఓడలో ఉన్న నోవహు దగ్గరికి చేరాయి. ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి. నోవహు వయస్సు ఆరువందల సంవత్సరాల రెండు నెలల పదిహేడవ రోజున, మహా అగాధజలాల ఊటలన్నీ తెరుచుకున్నాయి. ఆకాశపు కిటికీలు తెరుచుకున్నాయి. నలభై పగళ్ళు, నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. ఆ రోజే నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, వాళ్ళతో పాటు అతని ముగ్గురు కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించారు. వాళ్ళతోపాటు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి మృగం, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పశువు, వాటి వాటి జాతుల ప్రకారం నేలమీద పాకే ప్రతి పురుగు, వాటి వాటి జాతుల ప్రకారం ప్రతి పక్షి, నానావిధాల రెక్కల పక్షులు ప్రవేశించాయి. శ్వాస తీసుకోగలిగి, శరీరం గల జీవులన్నీరెండేసి చొప్పున నోవహు దగ్గరికి వచ్చి, ఓడలో ప్రవేశించాయి. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం శరీరం కలిగిన ఆ జీవులన్నీ, మగవిగా, ఆడవిగా, ప్రవేశించాయి. అప్పుడు యెహోవా, వాళ్ళను ఓడలో ఉంచి, ఓడ తలుపు మూశాడు. ఆ జలప్రళయం నలభై రోజులు భూమి మీదికి వచ్చినప్పుడు, నీళ్ళు విస్తరించి ఓడను నీళ్ళ మీద తేలేలా చేశాయి. ఓడ భూమి మీద నుంచి పైకి లేచింది. నీళ్ళు భూమి మీద భీకరంగా ప్రవహించి అధికంగా విస్తరించినప్పుడు, ఆ ఓడ నీళ్ళ మీద తేలింది. ఆ భీకర జలాలు భూమి మీద పైపైకి లేచినప్పుడు, ఆకాశం కింద ఉన్న ఉన్నత పర్వతాలన్నీ మునిగిపోయాయి. ఉన్నత పర్వత శిఖరాలకన్నా పదిహేను మూరలు ఎత్తుగా నీళ్ళు విస్తరించాయి. పక్షులు, పశువులు, మృగాలు భూమిమీద పాకే పురుగులు, శరీరం ఉండి భూమిమీద తిరిగేవన్నీ చనిపోయాయి. మనుషులందరూ చనిపోయారు. పొడి నేలమీద ఉన్న వాటన్నిటిలో, నాసికారంధ్రాల్లో ఊపిరి ఉన్నవన్నీ చనిపోయాయి. మనుషులతో పాటు పశువులు, పురుగులు, ఆకాశపక్షులు, నేలమీద ఉన్న జీవాలన్నీ అంతం అయిపోయాయి. అవన్నీ భూమిమీద ఉండకుండాా నాశనం అయ్యాయి. నోవహు, అతనితో పాటు ఆ ఓడలో ఉన్నవి మాత్రం మిగిలాయి. నూట ఏభై రోజుల వరకూ భూమి మీద నీళ్ళు ప్రబలాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 7

ఆదికాండము 7:1-24 పవిత్ర బైబిల్ (TERV)

అప్పుడు నోవహుతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ కాలపు దుర్మార్గుల మధ్య నీవు మంచి వాడివిగా నాకు కనబడ్డావు. కనుక నీ కుటుంబం అంతటినీ కలుపుకొని మీరంతా ఓడలోపలికి వెళ్లండి. శుద్ధమయిన జంతువులన్నింటిలో నుండి ఏడేసి జాతులు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో, భూమి మీద ఉన్న ఇతర జంతువులన్నింటిలోనుండి ఒక్క జత (మగది ఒకటి, ఆడది ఒకటి) తీసుకో. ఈ జంతువులన్నింటిని నీతోబాటు ఓడలోనికి నడిపించు. ఆకాశంలో ఎగిరే పక్షులన్నింటిలో నుండి ఏడేసి జతలు (మగవి ఏడు, ఆడవి ఏడు) తీసుకో. ఇలా చేయటంవల్ల మిగతా జంతువులన్ని నాశనం చేయబడిన తర్వాత కూడా ఈ జంతువులన్ని భూమిమీద జీవించడానికి వీలవుతుంది. ఇంక ఏడు రోజులకు భూమిమీద విస్తారమైన వర్షం కురిపిస్తాను. 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురుస్తుంది. భూమిమీద జీవించే ప్రతిప్రాణి నాశనం చేయబడుతుంది. నేను చేసినవన్నీ నశించిపోతాయి.” యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నిటి విషయంలో నోవహు విధేయుడయ్యాడు. ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. వరద నీటినుండి తప్పించుకొనేందుకు నోవహు, అతని కుంటుంబం ఓడలో ప్రవేశించారు. నోవహు భార్య, అతని కుమారులు, వారి భార్యలు అతనితో కూడ ఓడలో ఉన్నారు. పవిత్ర జంతువులన్నీ, భూమిమీది ఇతర జంతువులన్నీ, పక్షులన్నీ, నేలమీద ప్రాకు ప్రాణులన్నీ నోవహుతో పాటు ఓడలోకి వెళ్లాయి. దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్లుగా ఆడ, మగ అనే జంటలుగ లోపలికి వెళ్లాయి. ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. రెండవ నెల 17వ రోజున భూమి క్రింద ఉన్న జల ఊటలన్నీ బ్రద్దలై, నేలనుండి నీరు ప్రవహించటం మొదలయింది. అదే రోజున భూమిమీద భారీ వర్షాలు కురవటం ప్రారంభం అయింది. ఆకాశానికి కిటికీలు తీసినట్లుగా ఉంది. 40 పగళ్లు 40 రాత్రులు భూమి మీద వర్షం కురిసింది. సరిగ్గా అదే రోజున నోవహు, అతని భార్య, అతని కుమారులు షేము, హాము, యాఫెతు, వారి భార్యలు ఓడ ఎక్కారు. ఈ సమయంలో నోవహు 600 సంవత్సరాల వయస్సువాడు. ఆ మనుష్యులు, భూమిమీదనున్న అన్ని రకాల జంతువులు ఆ ఓడలో ఉన్నారు. అన్ని రకాల పశువులు, నేలమీద ప్రాకు అన్ని రకాల జంతువులు, అన్ని రకాల పక్షులు ఆ ఓడలో ఉన్నాయి. ఈ జంతువులన్నీ నోవహుతో కలిసి ఓడలోకి వెళ్లాయి. ప్రాణం ఉన్న ప్రతి రకం జంతువు రెండేసి చొప్పున వచ్చాయి. సరిగ్గా దేవుడు ఆజ్ఞాపించినట్లే ఈ జంతువులన్నీ ఓడలో జతలు జతలుగా ప్రవేశించాయి. తరువాత యెహోవా ఓడ తలుపులు మూసివేశాడు. 40 రోజుల పాటు నీళ్లు భూమిమీద వరదలై పారాయి. నీటిమట్టం పెరుగుతూ ఓడను నేలమీదనుండి పైకి లేపడం మొదలయింది. నీటిమట్టం పెరగటం కొనసాగుతూనే ఉంది. ఓడ నేలకు చాలా ఎత్తుగా నీటిమీద తేలుతోంది. నీటి మట్టం చాలా పైకి లేచినందువల్ల గొప్ప ఎత్తయిన పర్వతాలు అన్నీ నీళ్లలో మునిగిపోయాయి. పర్వత శిఖరాలకు పైగా నీటిమట్టం లేస్తూనే ఉంది. అన్నింటికంటే ఎత్తయిన పర్వత శిఖరానికి ఇంకా 20 అడుగులు ఎత్తుగానే నీటిమట్టం ఉంది. భూమిమీద బ్రతికి ఉన్న ప్రతి ప్రాణీ చనిపోయింది. ప్రతి పురుషుడు, స్త్రీ మరణించారు. పక్షులు, పశువులు, జంతువులు ఎగిరే ప్రతి ప్రాణి చంపివేయబడ్డాయి. బ్రతికి శ్వాసించే ప్రతి జీవి చనిపోయింది. కనుక భూమిమీద ఉన్న సకల ప్రాణులను, ప్రతి మనిషి, ప్రతి జంతువు, ప్రాకు ప్రతి ప్రాణి, ప్రతి పక్షి అన్నింటినీ దేవుడు నాశనం చేశాడు. ఇవన్నీ భూమిమీద నుండి నాశనం చేయబడ్డాయి. ఓడలోవున్న నోవహు అతనితో ఉన్న మనుష్యులు, జంతువులు మాత్రమే బ్రతికి ఉన్న ప్రాణులు. 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.

షేర్ చేయి
Read ఆదికాండము 7

ఆదికాండము 7:1-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

యెహోవా–ఈ తరమువారిలో నీవే నా యెదుట నీతిమంతుడవై యుండుట చూచితిని గనుక నీవును నీ యింటివారును ఓడలో ప్రవేశించుడి. పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును ఆకాశపక్షులలో ప్రతి జాతి మగవి యేడును ఆడువి యేడును, నీవు భూమి అంతటిమీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీయొద్ద ఉంచుకొనుము; ఎందు కనగా ఇంకను ఏడు దినములకు నేను నలుబది పగళ్లును నలుబది రాత్రులును భూమిమీద వర్షము కురిపించి, నేను చేసిన సమస్త జీవరాసులను భూమిమీద ఉండకుండ తుడిచివేయుదునని నోవహుతో చెప్పెను. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు. అప్పుడు నోవహును అతనితోకూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించు కొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను, మగది ఆడుది జతజతలుగా ఓడలో నున్న నోవహు నొద్దకు చేరెను. ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. నోవహు వయసుయొక్క ఆరువందల సంవత్సరము రెండవనెల పదియేడవదినమున మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. నలుబది పగళ్లును నలుబది రాత్రులును ప్రచండ వర్షము భూమిమీద కురిసెను. ఆ దినమందే నోవహును నోవహు కుమారులగు షేమును హామును యాపెతును నోవహు భార్యయు వారితోకూడ అతని ముగ్గురు కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు; ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేలమీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానావిధములైన రెక్కలుగల ప్రతి పిట్టయు ప్రవేశించెను. జీవాత్మగల సమస్త శరీరులలో రెండేసి రెండేసి ఓడలోనున్న నోవహు నొద్ద ప్రవేశించెను. ప్రవేశించినవన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఆ జలప్రవాహము నలుబది దినములు భూమిమీద నుండగా, జలములు విస్తరించి ఓడను తేలచేసినందున అది భూమిమీదనుండి పైకి లేచెను. జలములు భూమిమీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్లమీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను. అప్పుడు పక్షులేమి పశువులేమి మృగము లేమి భూమిమీద ప్రాకుపురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చని పోయెను. నరులతోకూడ పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచివేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితోకూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను. నూట ఏబది దినములవరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.

షేర్ చేయి
Read ఆదికాండము 7