యెషయా 58:6-7
యెషయా 58:6-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను ఆమోదించే ఉపవాసం ఏదంటే, దుర్మార్గపు బంధకాలను విప్పడం, కాడిమాను మోకులు తీసేయడం, అణగారిన వారిని విడిపించడం, ప్రతి కాడినీ విరగగొట్టడం. ఆకలితో అలమటించే వాళ్లతో నీ ఆహారం పంచుకోవడం, ఇల్లు లేకుండా తిరిగే పేదవారిని నీ ఇంట్లోకి చేర్చుకోవడం. దిగంబరిగా నీకెవరైనా కనిపిస్తే, వాడికి బట్టలు ఇవ్వు. నీ సొంత బంధువులకు నీ ముఖం చాటేయవద్దు.
యెషయా 58:6-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“నేను కోరుకునే ఉపవాసం అన్యాయపు సంకెళ్ళను విప్పడం, బరువైన కాడి త్రాళ్లు తీసివేయడం, బాధించబడిన వారిని విడిపించడం, ప్రతీ కాడిని విరగ్గొట్టడం కాదా? మీ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారితో పంచుకోవడం, ఇల్లు లేక తిరుగుతున్న పేదలకు ఆశ్రయం కల్పించడం, మీరు ఎవరినైనా నగ్నంగా చూస్తే, వారికి బట్టలు ఇవ్వడం, మీ రక్తసంబంధులకు ముఖం దాచకపోవడమే కదా ఉపవాసం?
యెషయా 58:6-7 పవిత్ర బైబిల్ (TERV)
“నేను కోరే ప్రత్యేక రోజు, ప్రజలను స్వతంత్రులను చేసే రోజు ఎలాంటిదో నేను మీకు చెబుతాను. ప్రజల మీద నుండి భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. కష్టాలుపడే ప్రజలను మీరు స్వతంత్రులుగా చేసే రోజు నాకు కావాలి. వారి భుజాలమీది భారాన్ని మీరు తొలగించే రోజు నాకు కావాలి. ఆకలిగొన్న ప్రజలతో మీరు మీ భోజనం పంచుకోవాలని నేను కోరుతున్నాను. ఇళ్లులేని పేద ప్రజలను మీరు వెదికి, వారిని మీరు మీ స్వంత ఇళ్లలోనికి తీసుకొని రావాలని నేను కోరుతున్నాను. బట్టలు లేనివాడ్ని మీరు చూచినప్పుడు, మీ బట్టలు వానికి ఇవ్వండి. ఆ మనుష్యులకు సహాయం చేయకుండా దాచుకోవద్దు; వాళ్లూ మీలాంటి వారే.”
యెషయా 58:6-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు కాడిమాను మోకులు తీయుటయు బాధింపబడినవారిని విడిపించుటయు ప్రతి కాడిని విరుగగొట్టుటయు నే నేర్పరచుకొనిన ఉపవాసము గదా? నీ ఆహారము ఆకలిగొనినవారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు దిక్కుమాలిన బీదలను నీ యింట చేర్చుకొనుటయు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము? ఆలాగున నీవు చేసినయెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడచును యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును.