యిర్మీయా 30:12-17
యిర్మీయా 30:12-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు–నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది; నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమునుబట్టి నేను నీకు కఠినశిక్షచేసి నిన్ను గాయపరచియున్నాను; కాగా నీ పక్షమున వ్యాజ్యెమాడువాడెవడును లేడు, నీ గాయములకు చికిత్స చేయదగినమందు నీకు లేదు. నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్నుగూర్చి విచారింపరు. నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్త రించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను. నిన్ను మ్రింగువారందరు మ్రింగి వేయబడుదురు, నిన్ను బాధించువారందరు ఎవడును తప్పకుండ చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించువారినందరిని దోపుడు సొమ్ముగా అప్పగించెదను. వారు–ఎవరును లక్ష్యపెట్టని సీయోననియు వెలివేయబడినదనియు నీకు పేరుపెట్టుచున్నారు; అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను నీ గాయములను మాన్పెదను; ఇదే యెహోవా వాక్కు.
యిర్మీయా 30:12-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా ఇలా అంటున్నాడు, ‘నీ దెబ్బ నయం కాదు. నీ గాయం మానని పుండుగా అయ్యింది. నీ పక్షంగా వాదించేవాళ్ళు ఎవరూ లేరు. నీ పుండు నయం చేసే మందు లేదు. నీ ప్రేమికులంతా నిన్ను మరిచిపోయారు. వాళ్ళు నీ కోసం చూడరు. ఎందుకంటే, అధికమైన నీ పాపాలనుబట్టి, నీ గొప్ప దోషాన్నిబట్టి, ఒక కఠినమైన యజమాని పెట్టే క్రమశిక్షణ కింద నిన్ను ఉంచి, ఒక శత్రువు గాయపరిచినట్టు నేను నిన్ను గాయపరిచాను. నీ గాయాన్నిబట్టి నువ్వు సాయం కోసం అడుగుతున్నావా? నీ బాధ తీరనిది. విస్తారమైన నీ పాపాలనుబట్టి, అనేకమైన నీ దోషాలను బట్టి నేను నీకు ఇలా చేశాను. కాబట్టి, నిన్ను దిగమింగే వాళ్ళెవరో, వాళ్ళనే దిగమింగడం జరుగుతుంది. నీ ప్రత్యర్దులందరూ బందీలుగా చెరలోకి వెళ్తారు. నిన్ను దోచుకున్నవాళ్ళు దోపుడు సొమ్ము అవుతారు. నిన్ను కొల్లగొట్టిన వాళ్ళను కొల్లసొమ్ముగా చేస్తాను. నీకు స్వస్థత తీసుకొస్తాను. నీ గాయాలను స్వస్థపరుస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “ఎందుకంటే వాళ్ళు ‘సీయోను వెలి వేయబడింది. దాన్ని పట్టించుకునే వాడు లేడు’ అని నీ గురించి అన్నారు గనుక, నేను ఈ విధంగా చేస్తాను.”
యిర్మీయా 30:12-17 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఇలా అంటున్నాడు: “ఓ ఇశ్రాయేలు, యూదా ప్రజలారా, మీకు బాగుకాని గాయం ఉంది. మీకు తగిలిన దెబ్బ నయం కానిది. మీ పుండ్లను గురించి శ్రద్ధ తీసికొనే వ్యక్తి లేడు. అందుచేత మీరు స్వస్థపర్చబడరు. మీరనేక దేశాలతో స్నేహం కుదుర్చుకున్నారు. అయినా ఆ రాజ్యాలు మిమ్మల్ని గురించి పట్టించుకోవు. మీ స్నేహితులనబడేవారు మిమ్మల్ని మర్చిపోయారు. ఒక శత్రువువలె మిమ్మల్ని గాయపర్చాను! మిమ్మల్ని చాలా కఠినంగా శిక్షించాను! మీరు చేసిన ఘోరమైన నేరం కారణంగా నేనలా చేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేనలాచేశాను. ఇశ్రాయేలూ, యూదా! మీ గాయం గురించి ఎందుకు రోదిస్తున్నారు. మీ గాయం బాధకరమైనది. పైగా దానికి చికిత్స లేదు. ఘోరమైన మీ అపరాధం కారణంగా, యెహోవానైన నేను మీకవన్నీ కలుగజేశాను. మీరు చేసిన అనేక పాపాల కారణంగా నేను మీకు ఈ కష్టాలు కలుగజేశాను. ఆ రాజ్యాలవారు మిమ్మల్ని నాశనం చేశారు. కాని ఇప్పుడా రాజ్యాలే నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలూ, యూదా! మీ శత్రువులే బందీలవుతారు! ఆ ప్రజలు మీ ఆస్తిపాస్తులు పొందియున్నారు. కాని ఇతర ప్రజలు వారి ఆస్తిపాస్తులు దోచుకుంటారు. ఆ ప్రజలు యుద్ధంలో మీ వస్తువులను తీసుకున్నారు. అలాగే యితరులు యుద్ధంలో వారి వస్తువులు తీసుకుంటారు. అయినా నేను మీకు మరల ఆరోగ్యం చేకూర్చుతాను. మీ గాయాలన్నీ మాన్పుతాను.” ఇదే యెహోవా వాక్కు, “ఎందువల్లననగా అన్యులు మిమ్మల్ని వెలివేసి భ్రష్టులన్నారు. ‘సీయోనును ఎవ్వరూ లెక్కచేయరు’ అని వారన్నారు!”
యిర్మీయా 30:12-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘నీ గాయం నయం కానిది, నీ గాయం తీవ్రమైనది. నీ పక్షంగా వాదించడానికి ఎవరు లేరు, నీ పుండుకు నివారణ లేదు, నీకు స్వస్థత లేదు. నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ. నీ గాయం గురించి, తీరని నీ బాధ గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నీ గొప్ప అపరాధం అనేక పాపాల కారణంగా నేను నీకు ఇవన్నీ చేశాను. “ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను. అయితే నేను నీకు స్వస్థత కలుగజేసి నీ గాయాలను బాగుచేస్తాను’ అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే ‘నీవు వెలివేయబడినవాడవని, సీయోనును ఎవ్వరూ పట్టించుకోరు’ అని నీ గురించి అన్నారు.