యోహాను 16:16-33

యోహాను 16:16-33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కొంచెము కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు; మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని చెప్పెను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు–కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాననియు, ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని యొకనితో ఒకరు చెప్పుకొనిరి. –కొంచెము కాలమని ఆయన చెప్పుచున్న దేమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. వారు తన్ను అడుగ గోరుచుండిరని యేసు యెరిగి వారితో ఇట్లనెను–కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటనుగూర్చి మీరు ఒకనితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియ జెప్పుగడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమై నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను. ఆయన శిష్యులు–ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమియు చెప్పక స్పష్టముగా మాటలాడుచున్నావు. సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి–మీరిప్పుడు నమ్ము చున్నారా? యిదిగో మీలో ప్రతివాడును ఎవని యింటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది; అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాననెను.

షేర్ చేయి
Read యోహాను 16

యోహాను 16:16-33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు ఇంకా చెప్తూ, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, ఆ తర్వాత మరికొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు.” అప్పుడు, ఆయన శిష్యులలో కొందరు ఒకరితో ఒకరు, “ఆయన అంటున్న, ‘నేను నా తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ కనుక ‘కొద్దిసేపట్లో మీరు నన్ను చూడలేరు, తర్వాత కొద్దిసేపటికి మీరు నన్ను చూస్తారు’ అని ఆయన అనే దానికి అర్థమేంటి?” అని చెప్పుకొన్నారు. వారు, “ ‘ఇంకా కొద్ది సమయం’ అంటే ఆయన అర్థమేంటి? ఆయన ఏమంటున్నారో మనకు అర్థం కావడం లేదు” అని అనుకున్నారు. యేసు, తన శిష్యులు ఆ విషయం గురించి తనను అడగాలని అనుకుంటున్నారని గ్రహించి, వారితో, “ఇంకా కొద్ది సమయం తర్వాత మీరు నన్ను చూడరు, దాని తర్వాత ఇంకొద్ది సమయానికి మీరు నన్ను చూస్తారు” అని నేను చెప్పినదాని గురించి మీరు ఒకరిని ఒకరు అడుగుతున్నారా? నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. ఒక స్త్రీ ప్రసవించు సమయం వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదనపడుతుంది; కానీ శిశువు పుట్టగానే, తన ద్వారా ఈ లోకానికి ఒక బిడ్డ పుట్టాడనే ఆనందంలో తాను పడిన వేదననంతా ఆమె మర్చిపోతుంది. మీ విషయంలో కూడా అంతే; మీకు ఇది దుఃఖ సమయం, కాని నేను తిరిగి మిమ్మల్ని చూసినప్పుడు మీ హృదయాంతరంగంలో నుండి ఆనందిస్తారు, ఆ ఆనందాన్ని మీ దగ్గర నుండి ఎవ్వరూ తీసివేయలేరు. ఆ రోజు మీరు ఇక నన్ను దేని గురించి అడగరు. మీరు నా పేరట నా తండ్రిని ఏమి అడిగినా అది మీకు ఇస్తాడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు నా పేరట ఏమి అడగలేదు. అడగండి మీరు పొందుకొంటారు, మీ ఆనందం పరిపూర్ణమవుతుంది. “ఇంతవరకు నేను మీతో దృష్టాంతాలతో చెప్పాను. కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు ఈ దృష్టాంతాల భాషను వాడకుండ నా తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఆ రోజు మీరు నా పేరిట అడుగుతారు. అయితే మీ కొరకు నేను తండ్రిని అడుగుతానని చెప్పడం లేదు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను దేవుని దగ్గరి నుండి వచ్చానని నమ్మారు కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను తండ్రి దగ్గరి నుండి బయలుదేరి ఈ లోకానికి వచ్చాను; ఇప్పుడు నేను లోకాన్ని విడిచి తండ్రి దగ్గరకు తిరిగి వెళ్తున్నాను” అన్నారు. అప్పుడు యేసు శిష్యులు, “ఇప్పుడు నీవు దృష్టాంతాలతో కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నావు. నీకు అన్ని సంగతులు తెలుసని, ఎవరు నిన్ను ప్రశ్నించే అవసరం లేదని, మేము గ్రహిస్తున్నాం. దీనిని బట్టి నీవు దేవుని నుండి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు. యేసు వారితో, “ఇప్పుడు మీరు నమ్ముతున్నారా?” అన్నారు. “ఒక సమయం రాబోతుంది, అది ఇప్పటికే వచ్చేసింది అప్పుడు మీలో ప్రతి ఒక్కరు నన్ను ఒంటరిగా విడిచి, ఎవరి ఇంటికి వారు చెదరిపోతారు. అయినాసరే నేను ఒంటరి వానిని కాను, ఎందుకంటే నా తండ్రి నాతో ఉన్నాడు. “ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి. అయినా ధైర్యం తెచ్చుకోండి! ఎందుకంటే నేను లోకాన్ని జయించాను. నాలో మీకు సమాధానం ఉండాలని ఈ సంగతులను మీకు చెప్పాను” అన్నారు.

షేర్ చేయి
Read యోహాను 16

యోహాను 16:16-33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు.” ఆయన శిష్యుల్లో కొంతమంది “ఆయన కొద్ది కాలంలో మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత కొద్ది కాలంలో మీరు నన్ను చూస్తారు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అంటున్నాడు. ఇది ఏమిటి? ఆయన మనతో ఏం చెబుతున్నాడు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, కాబట్టి వారు, కొద్ది కాలం అంటే ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ఏం చెబుతున్నాడో మనకు తెలియడం లేదు” అనుకున్నారు. వారు ఈ విషయం తనను అడగాలని ఆతురతతో ఉన్నారని యేసు గమనించి వారితో, “‘కొద్ది కాలం తరువాత మీరు నన్ను ఇక చూడరు. ఆ తరువాత మరి కొద్ది కాలానికి మీరు నన్ను చూస్తారు’ అని నేను అన్నదానికి అర్థం ఏమిటని ఆలోచిస్తున్నారా? నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు శోకంతో ఏడుస్తారు, కాని ఈ లోకం ఆనందిస్తుంది. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. స్త్రీ ప్రసవించే సమయం వచ్చినప్పుడు ప్రసవ వేదన కలుగుతుంది. కాని, బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డ ఈ లోకం లోకి వచ్చిన ఆనందంలో ప్రసవంలో తాను పడిన బాధ ఆమెకు ఇక గుర్తు రాదు. “అలాగే, మీరు ఇప్పుడు దుఖపడుతున్నారు గాని, నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తాను. అప్పుడు మీ హృదయం ఆనందిస్తుంది. మీ ఆనందం మీ దగ్గరనుంచి ఎవ్వరూ తీసివేయలేరు. ఆ రోజున మీరు నన్ను ఏ ప్రశ్నలూ అడగరు. నేను మీతో కచ్చితంగా చెబుతున్నాను, మీరు తండ్రిని ఏది అడిగినా, నా పేరిట ఆయన మీకు అది ఇస్తాడు. ఇంతవరకూ నా పేరిట మీరు ఏమీ అడగలేదు. అడగండి, అప్పుడు మీ ఆనందం సంపూర్తి అయ్యేలా మీరు పొందుతారు. ఈ సంగతులు ఇంతవరకూ తేలికగా అర్థం కాని భాషలో మీకు చెప్పాను. అయితే ఒక సమయం రాబోతుంది అప్పుడు తండ్రి గురించి స్పష్టంగా చెబుతాను. ఆ రోజున మీరు నా పేరట అడుగుతారు. అయితే మీ కోసం నేను తండ్రికి ప్రార్థన చేస్తానని అనడం లేదు. ఎందుకంటే మీరు నన్ను ప్రేమించి, నేను తండ్రి దగ్గర నుంచి వచ్చానని నమ్మారు కాబట్టి తండ్రే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నేను తండ్రి దగ్గరనుంచి ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ లోకాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తున్నాను” అన్నాడు. ఆయన శిష్యులు, “చూడు, ఇప్పుడు నువ్వు అర్థం కానట్టు కాకుండా, స్పష్టంగా మాట్లాడుతున్నావు. నువ్వు అన్నీ తెలిసిన వాడివని, నిన్ను ఎవరూ ప్రశ్నలు అడగవలసిన అవసరం లేదని, ఇప్పుడు మేము తెలుసుకున్నాం. దీని వలన నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావని మేము నమ్ముతున్నాం” అన్నారు. యేసు జవాబిస్తూ, “మీరు ఇప్పుడు నమ్ముతున్నారా? మీరందరూ ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం రాబోతూ ఉంది. వచ్చేసింది కూడా. అయినప్పటికీ, నా తండ్రి నాతో ఉన్నాడు కాబట్టి నేను ఒంటరిని కాదు. నన్ను బట్టి మీకు శాంతి కలగాలని నేను ఈ సంగతులు మీతో చెప్పాను. ఈ లోకంలో మీకు బాధ ఉంది. కాని ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్ని జయించాను” అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 16

యోహాను 16:16-33 పవిత్ర బైబిల్ (TERV)

“కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.” ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు. ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం. “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది. “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.” శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు. యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను. “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.

షేర్ చేయి
Read యోహాను 16