యోబు 1:20-22
యోబు 1:20-22 పవిత్ర బైబిల్ (TERV)
యోబు ఇది వినగానే తన విచారాన్ని, కలవరాన్ని తెలియజేయడానికి తన బట్టలు చింపుకొని, తల గుండు చేసుకొన్నాడు. తరువాత యోబు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించాడు. అతడు ఇలా చెప్పాడు: “నేను ఈ లోకంలో పుట్టినప్పుడు నేను దిగంబరిని, నాకు ఏమీ లేదు. నేను మరణించి లోకాన్ని విడిచి పెట్టేటప్పుడు నేను దిగంబరినిగా ఉంటాను. నాకు ఏమీ ఉండదు. యెహోవా ఇచ్చాడు. యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామాన్ని స్తుతించండి!” ఇవన్నీ సంభవించినాగానీ యోబు మాత్రం పాపం చేయలేదు. అతడు దేవుణ్ణి నిందించనూలేదు.
యోబు 1:20-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను –నేను నా తల్లిగర్భములోనుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్లెదను; యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసెనని చెప్పలేదు.
యోబు 1:20-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు యోబు లేచి తన పై దుస్తులు చింపుకున్నాడు. తలవెంట్రుకలు గొరిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు. “నేను నా తల్లి కడుపులోనుండి దిగంబరిగా వచ్చాను. దిగంబరిగానే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు. యెహోవా నామానికి స్తుతి కలుగు గాక.” జరిగిన విషయాలన్నిటిలో ఏ సందర్భంలోనూ యోబు ఎలాంటి పాపం చేయలేదు, దేవుడు అన్యాయం చేశాడని పలకలేదు.
యోబు 1:20-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు యోబు పైకి లేచి తన పైవస్త్రాన్ని చింపుకొని గుండు చేసుకుని అప్పుడు నేలమీద సాష్టాంగపడి ఆరాధిస్తూ, ఇలా అన్నాడు: “నేను తల్లి గర్భంలోనుండి దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్తాను. యెహోవాయే ఇచ్చారు యెహోవాయే తీసుకున్నారు; యెహోవా నామం స్తుతింపబడును గాక.” జరిగిన ఈ సంఘటనలలో ఏ విషయంలోను యోబు పాపం చేయలేదు, దేవున్ని నిందించలేదు.