యోబు 14:1-6

యోబు 14:1-6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలి బాధనొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టివానిమీద నీవు కనుదృష్టి యుంచియున్నావు తీర్పు నొందుటకై నన్ను నీ యెదుటికి రప్పించి యున్నావు. పాపసహితునిలోనుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు? ఆలాగున ఎవడును పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించియున్నావు కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకువారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడక యుండుము.

షేర్ చేయి
Read యోబు 14

యోబు 14:1-6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

స్త్రీ కడుపున పుట్టిన మనిషి కొన్ని రోజులపాటు జీవిస్తాడు. అతడు తన జీవిత కాలమంతా కష్టాలు అనుభవిస్తాడు. అతడు పువ్వులాగా పెరిగి వికసిస్తాడు. అంతలోనే వాడిపోతాడు. నీడ కనబడకుండా పోయినట్టు వాడు పారిపోతాడు. అలాంటి వాడిని నువ్వు పట్టించుకుంటున్నావా? నాకు తీర్పు తీర్చడానికి నీ ఎదుటికి రప్పించుకుంటావా? అపవిత్రమైన వ్యక్తికి పవిత్రుడైనవాడు పుట్టగలిగితే ఎంత మేలు? కానీ ఆ విధంగా ఎన్నడూ జరగదు. మనిషి ఎంతకాలం బ్రతకాలో దానికి పరిమితి నువ్వే నియమిస్తావు. అతడు ఎన్ని నెలలు జీవిస్తాడో నీకు తెలుసు. అతడి వైపు నుంచి నీ దృష్టి మరల్చుకో. కూలిపని వాడిలాగా తనకు నియమింపబడిన పని పూర్తి చేసేదాకా అతని వైపు చూడకు.

షేర్ చేయి
Read యోబు 14

యోబు 14:1-6 పవిత్ర బైబిల్ (TERV)

యోబు ఈ విధంగా చెప్పాడు: “మనమందరం కష్టంతో నిండిన కొద్దిపాటి జీవితం కోసమేపుట్టాం. మనిషి జీవితం పువ్వులాంటిది. అతడు త్వరగా పెరిగి, త్వరగా చస్తాడు. కొంచెం సేపు ఉండి, ఆ తర్వాత ఉండని నీడలాంటిది మనిషి జీవితం. దేవా, నీవు అలాంటి మనిషిని గమనిస్తావా? నీతో తీర్పు పొందటానికి నన్ను నీ ముందుకు తీసుకొనిరమ్ము. “మురికి దానిలో నుండి శుభ్రమైన దాన్ని ఎవరు తీయగలరు? ఎవ్వరూ తీయలేరు. నరుని జీవితం పరిమితం. దేవా, నరుని మాసాల సంఖ్య నీవు నిర్ణయం చేశావు. నరుడు మార్చజాలని హద్దులు నీవు ఉంచావు. కనుక దేవా, నరునికి దూరంగా చూడు. వానిని ఒంటరిగా విడిచిపెట్టు. అతని కాలం తీరేవరకు అతని కష్టజీవితం అతణ్ణి అనుభవించనివ్వు.

షేర్ చేయి
Read యోబు 14

యోబు 14:1-6 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“స్త్రీకి పుట్టిన మనుష్యులు, ఉండేది కొంతకాలమే అయినా ఎన్నో శ్రమలు పొందుతారు. వారు పువ్వులా వికసించి వాడిపోతారు; నిలకడలేని నీడలా వారు స్థిరంగా ఉండరు. అలాంటివారి మీద మీ దృష్టిని నిలిపారా? తీర్పు తీర్చడానికి వారిని మీ ఎదుటికి తీసుకువస్తారా? అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని ఎవరు తీసుకురాగలరు? ఎవరు తీసుకురాలేరు! మనుష్యులు బ్రతికే రోజులు నిశ్చయించబడ్డాయి; వారు ఎన్ని నెలలు బ్రతుకుతారో మీరు శాసించారు వారు దాటలేని పరిధిని మీరు నియమించారు. కూలివారిలా వారు తమ పని ముగించే వరకు మీరు వారివైపు చూడకండి, వారిని అలా వదిలేయండి.

షేర్ చేయి
Read యోబు 14