యోబు 2:11-13
యోబు 2:11-13 పవిత్ర బైబిల్ (TERV)
తేమాను వాడైన ఎలీఫజు, షూహీవాడైన బిల్దదు, నయమాతీవాడైన జోఫరు అనే ముగ్గురు యోబుకు స్నేహితులు. యోబుకు సంభవించిన చెడు సంగతులు అన్నింటిని గూర్చి ఈ ముగ్గురు స్నేహితులూ విన్నారు. ఈ ముగ్గురు స్నేహితులూ వారి ఇండ్లు విడిచి ఒకచోట సమావేశమయ్యారు. వారు వెళ్లి యోబుకు సానుభూతి చూపించి, ఆదరించాలని తీర్మానించుకున్నారు. కాని ఆ స్నేహితులు ముగ్గురూ యోబును దూరమునుండి చూచి, అతడు చాలా వేరుగా కనబడటం చేత అతడు యోబు అని సరిగ్గా గుర్తించ లేక పోయారు. వారు గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టారు. వారు తమ వస్త్రాలు చింపుకొని, తాము విచారంగాను, కలవరంగాను ఉన్నట్టు తెలియ చేయడానికి తమ తలల మీద దుమ్మెత్తి పోసుకొన్నారు. తరువాత ఆ ముగ్గురు స్నేహితులూ యోబుతో పాటు ఏడు రాత్రుళ్లు, ఏడు పగళ్లు నేలమీద కూర్చున్నారు. యోబు చాలా శ్రమ పడుతూ ఉన్న కారణంగా వారిలో ఏ ఒక్కరూ యోబుతో ఒక్క మాట కూడా పలుకలేదు.
యోబు 2:11-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విన్నారు. అతనితో కలిసి దుఃఖించడానికి, అతణ్ణి ఓదార్చడానికి వెళ్లాలని నిర్ణయించుకుని తమ ప్రాంతాలు విడిచి యోబు దగ్గరికి వచ్చారు. వారు వచ్చి కొంత దూరంగా నిలబడి అతణ్ణి చూశారు. యోబును పోల్చుకోలేక తమ బట్టలు చింపుకున్నారు. ఆకాశం వైపు తల మీదికి దుమ్ము చల్లుకుని బిగ్గరగా ఏడ్చారు. అతడు అనుభవిస్తున్న తీవ్రమైన బాధను గ్రహించి ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడు రోజులపాటు రాత్రీ పగలూ అతనితో కలిసి నేలపై కూర్చున్నారు.
యోబు 2:11-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినినవారై, అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలెనని ఆలోచించుకొని తమతమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశముతట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి. అతని బాధ అత్యధికముగానుండెనని గ్రహించి యెవరును అతనితో ఒక్క మాటయైనను పలుకక రేయింబగలు ఏడు దినములు అతనితోకూడ నేలను కూర్చుండిరి.
యోబు 2:11-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరు అనే యోబు ముగ్గురు స్నేహితులు అతనికి వచ్చిన కష్టాలన్నిటి గురించి విని తమ స్నేహితుడిని కలిసి సానుభూతి చూపించి ఆదరించడానికి వెళ్లాలని వారు నిర్ణయించుకొని, తమ ఇళ్ళ నుండి బయలుదేరి వచ్చారు. వారు దూరం నుండి చూసినప్పుడు యోబును సరిగా గుర్తుపట్టలేకపోయారు; దానితో వారు బట్టలు చింపుకొని తమ తలలపై దుమ్ము వేసుకుంటూ గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టారు. వారు ఏడు రోజులు రాత్రింబగళ్ళు అతనితో పాటు నేలమీద కూర్చుండిపోయారు. అతడు పడుతున్న తీవ్రమైన బాధను చూసి అతనితో ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.