లేవీయకాండము 2:1-10 - అన్ని సంస్కరణలను పోల్చండి

లేవీయకాండము 2:1-10 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఒకడు యెహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు అర్పించునది గోధుమపిండిదై యుండవలెను. అతడు దానిమీద నూనెపోసి సాంబ్రాణి వేసి యాజకులగు అహరోను కుమారులయొద్దకు దానిని తేవలెను. అందులోనుండి యాజకుడు తన చేరతో చేరెడు నూనెయు చేరెడు గోధుమపిండియు దాని సాంబ్రాణి అంతయు తీసికొని యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా బలిపీఠముమీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్యశేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయునప్పుడు అది నూనె కలిసినదియు, పొంగనిదియునైన గోధుమపిండి అప్పడములేగాని నూనె రాచినదియు పొంగనిదియునైన పూరీలేగాని కావలెను. నీ అర్పణము పెనముమీద కాల్చిన నైవేద్యమైనయెడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమపిండిదై యుండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటిమీద నూనె పోయవలెను. నీవు అర్పించునదికుండలో వండిన నైవేద్యమైనయెడల నూనె కలిసిన గోధుమపిండితో దానిని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవాయొద్దకు తేవలెను. యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత అతడు బలిపీఠము దగ్గరకు దానిని తేవలెను అప్పుడు యాజకుడు ఆ నైవేద్యములో ఒక భాగమును జ్ఞాపకార్థముగా తీసి బలిపీఠముమీద యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా దాని దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును జెందును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతిపరిశుద్ధము.

లేవీయకాండము 2:1-10 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎవరైనా ఒక వ్యక్తి యెహోవాకు ధాన్య నైవేద్యం అర్పించాలంటే ఆ అర్పణ సన్నని గోదుమ పిండి అయి ఉండాలి. అతడు దాని మీద నూనె పోసి, సాంబ్రాణి వేయాలి. అతడు దాన్ని యాజకులైన అహరోను కొడుకుల దగ్గరికి తీసుకు రావాలి. అప్పుడు యాజకుడు తన చేతి నిండుగా నూనే, సాంబ్రాణీ కలిసిన సన్నని పిండిని తీసుకుంటాడు. అప్పుడు యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించడానికై ఆ అర్పణని బలిపీఠం పైన వేసి కాల్చాలి. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. ఆ నైవేద్యంలో మిగిలింది అహరోనుకూ, అతని కొడుకులకూ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం. మీరు పొయ్యిలో కాల్చిన నైవేద్యం అర్పించాలంటే పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె కలిపి చేసిన మెత్తని చపాతీ అయి ఉండాలి. లేదా సన్నని పిండితో, నూనె రాసి చేసిన అప్పడంలా గట్టిగా ఉండాలి. ఒకవేళ నీ అర్పణ పెనం మీద కాల్చిన నైవేద్యమైతే అది పొంగజేసే పదార్ధం లేకుండా సన్నని పిండితో, నూనె రాసి చేసినదై ఉండాలి. అది నైవేద్యం, కాబట్టి దాన్ని నువ్వు ముక్కలు చేసి వాటి పైన నూనె పోయాలి. ఒకవేళ నీ నైవేద్యం వంట పాత్రలో వండినదైతే దాన్ని సన్నని పిండీ, నూనే కలిపి తయారు చేయాలి. ఈ పదార్ధాలతో చేసిన నైవేద్యాన్ని యెహోవా దగ్గరికి తీసుకురావాలి. దాన్ని యాజకుడికి అందించాలి. అతడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకు వస్తాడు. తరువాత యాజకుడు యెహోవా మంచితనం గూర్చి కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకోడానికి ఆ నైవేద్యంలో కొంత భాగం తీసుకుని బలిపీఠంపై దహించాలి. అది అగ్నితో చేసిన అర్పణ. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. ఆ నైవేద్యంలో మిగిలిన భాగం అహరోనుకీ, అతని కొడుకులకీ చెందుతుంది. యెహోవాకి అర్పించే దహన బలులన్నిటిలో ఇది అతి పరిశుద్ధం.

లేవీయకాండము 2:1-10 TERV (పవిత్ర బైబిల్)

“ఎవరైనా యెహోవాకు ధాన్యార్పణ పెట్టేటప్పుడు అది శ్రేష్ఠమైన పిండిగా ఉండాలి. ఆ వ్యక్తి ఆ పిండిమీద నూనెపోసి, సాంబ్రాణి వేయాలి. అప్పుడు దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు అతడు తీసుకొని రావాలి. సాంబ్రాణిని, నూనె కలిపిన పిండిలో ఒక గుప్పెడు ఆ వ్యక్తి తీసుకోవాలి. అప్పుడు యాజకుడు బలిపీఠపు అగ్నితో ఆ పిండిని జ్ఞాపకార్థ అర్పణగా దహించాలి. అది యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉంటుంది. మిగిలిపోయిన ధాన్యార్పణ అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమములు అన్నింటిలో ఇది అతి పవిత్రం. “పొయ్యిమీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు పెట్టేటప్పుడు అది నూనె కలిపిన శ్రేష్ఠమైన పిండితో చేయబడ్డ పొంగని రొట్టెలు, లేక నూనె రాయబడ్డ పొంగని అప్పడాలు కావాలి. పెనం మీద కాల్చబడిన ధాన్యార్పణ నీవు తెస్తే అది నూనెతో కలిపిన పొంగని మంచి పిండి కావాలి. దానిని నీవు ముక్కలు చేసి, దాని మీద నూనెపోయాలి. అది ధాన్యార్పణ. నీవు వంట గిన్నెలో వండిన ధాన్యార్పణ తెస్తే అది నూనెతో కలుపబడిన మంచి పిండికావాలి. “ఈ పదార్థాలతో చేయబడిన ధాన్యార్పణను నీవు యెహోవాకు తీసుకొని రావాలి. నీవు వాటిని యాజకుని దగ్గరకు తీసుకొనివెళ్లాలి, అతడు వాటిని బలిపీఠం మీద ఉంచుతాడు. ఇది జ్ఞాపకార్థమైన అర్పణ. అది బలిపీఠం మీద దహించబడాలి. అగ్నిమీద అది దహించ బడుతుంది. ఇది యెహోవాకు ఇష్టమైన సువాసన. మిగిలిపోయిన ధాన్యార్పణలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. యెహోవాకు అర్పించే హోమాలలో ఇది అతి పవిత్రం.

లేవీయకాండము 2:1-10 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“ ‘ఎవరైనా యెహోవాకు భోజనార్పణ తెచ్చినప్పుడు, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి. వారు దాని మీద ఒలీవనూనె పోసి, దానిపై ధూపం వేసి, దానిని యాజకులైన అహరోను కుమారుల దగ్గరకు తీసుకురావాలి. యాజకుడు ఒక పిడికెడు పిండి, నూనె, ధూపమంతటితో పాటు తీసుకుని బలిపీఠం మీద దానిని ఒక జ్ఞాపకార్థ భాగంగా, యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా దహించాలి. భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది. “ ‘ఒకవేళ మీరు పొయ్యిలో కాల్చిన భోజనార్పణ తెస్తే, అది నాణ్యమైన పిండితో చేసినదై ఉండాలి: నూనె కలిపి చేసిన పులియని మందమైన రొట్టెలు లేదా నూనె రాసి చేసిన పులియని రొట్టెలు. ఒకవేళ మీ భోజనార్పణ పెనం మీద కాల్చినదైతే, అది నాణ్యమైన పిండిలో నూనె కలిపి, పులుపు లేకుండ చేయబడాలి. దానిని ముక్కలుగా చేసి, నూనె పోయాలి; అది భోజనార్పణ. ఒకవేళ మీ భోజనార్పణ వంటపాత్రలో వండినదైతే, దానిని నాణ్యమైన పిండిలో కొంచెం నూనె కలిపి చేయాలి. వీటితో చేయబడిన భోజనార్పణను యెహోవా దగ్గరకు తీసుకురావాలి; దానిని బలిపీఠం దగ్గరకు తీసుకెళ్లేలా యాజకునికి అప్పగించాలి. యాజకుడు ఆ భోజనార్పణలో నుండి జ్ఞాపకార్థ భాగాన్ని తీసి బలిపీఠం మీద దానిని యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా కాల్చుతాడు. భోజనార్పణలో మిగిలింది అహరోనుకు అతని కుమారులకు చెందుతుంది; యెహోవాకు అర్పించే హోమబలులలో ఇది అతిపరిశుద్ధమైనది.

షేర్ చేయి
లేవీయకాండము 2 TSA