లేవీయకాండము 25:23-34
లేవీయకాండము 25:23-34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే, మీరు నాయొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చినయెడల తన సహోదరుడు అమ్మినదానిని అతడు విడి పించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించినయెడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి యెవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరల ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని యెడల అతడు అమ్మిన సొత్తు సునాదసంవత్సరమువరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాదసంవత్సరమున అది తొలగిపోవును; అప్పుడతడు తన స్వాస్థ్యమును మరల నొందును. ఒకడు ప్రాకారముగల ఊరిలోని నివాసగృహమును అమ్మినయెడల దాని అమ్మినదినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును; ఆ సంవత్సర దినములలోనే దాని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సరదినములు నిండకమునుపు దాని విడిపింపనియెడల ప్రాకారముగల ఊరిలోనున్న ఆ యిల్లుకొనినవానికి వాని తరతరములకు అది స్థిరముగానుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టును ప్రాకారములులేని గ్రామములలోని యిండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును; అవి సునాదకాలములో తొలగి పోవును. అయితే లేవీయుల పట్టణములు, అనగా వారి స్వాధీన పట్టణములలోని యిండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణములయిండ్లు ఇశ్రాయేలీయులమధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయులయొద్ద ఇల్లు సంపా దించినయెడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ యిల్లు సునాదసంవత్సరమున తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంతభూములను అమ్ముకొనకూడదు; అవి వారికి శాశ్వత స్వాస్థ్యము.
లేవీయకాండము 25:23-34 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు. నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి. నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు. అయితే ఒకడు సమీప బంధువు లేకపోయినా తన ఆస్తిని విడిపించుకోడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకుంటే దాన్ని అమ్మిన సమయం నుండి గడచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్న వాడికి ఆ డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు. అతనికి దాని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన డబ్బు దొరక్క పోతే అతడు అమ్మిన ఆస్తి సునాద సంవత్సరం వరకూ కొన్న వాడి స్వాధీనంలో ఉండాలి. సునాద సంవత్సరంలో అది విడుదల అవుతుంది. అప్పుడతడు తన ఆస్తిని తిరిగి పొందుతాడు. ఎవరైనా ప్రాకారం ఉన్న ఊరిలోని తన సొంతిల్లు అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకుని సంవత్సరంలోగా దాన్ని విడిపించుకోవచ్చు. ఆ సంవత్సరమంతా దాన్ని విడిపించుకునే అవకాశం అతనికి ఉంది. అయితే ఆ సంవత్సరం నిండే లోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్న వాడికే తరతరాలకు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు. ప్రాకారం లేని గ్రామాల్లోని ఇళ్ళను మాత్రం దేశంలోని పొలాలతో సమానంగా ఎంచాలి. వాటిని తిరిగి విడిపించుకోవచ్చు. అవి సునాదకాలంలో విడుదల అవుతాయి. అయితే లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళను వారు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు. లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న ఆ లేవీయుల ఆస్తి గనక ఎవరైనా లేవీయుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అది లేవీయులకు పిత్రార్జితంగా వచ్చిన పట్టణంలో అమ్మిన ఇల్లు. అది సునాద సంవత్సరంలో విడుదల అవుతుంది. లేవీయులు తమ పట్టణ ప్రాంతం భూములను అమ్ముకోకూడదు. అవి వారికి శాశ్వత ఆస్తి.
లేవీయకాండము 25:23-34 పవిత్ర బైబిల్ (TERV)
“వాస్తవానికి భూమి నాది. అందుచేత మీరు దాన్ని శాశ్వతంగా అమ్మజాలరు. మీరు కేవలం నాతో, నా భూమి మీద నివసిస్తున్న యాత్రికులు, విదేశీయులు. మనుష్యులు వారి భూమిని అమ్మివేయ వచ్చును కానీ ఎల్లప్పుడూ ఆ భూమి తిరిగి ఆ కుటుంబానిదేఅవుతుంది. మీ దేశంలో ఒక వ్యక్తి చాల నిరుపేద కావచ్చును. అతడు తన ఆస్తి అమ్ముకోవాల్సినంత పేదవాడై పోవచ్చును. కనుక అతని రక్తసంబంధీకులు వచ్చి తమ బంధువుకోసం ఆ ఆస్తిని కొనాలి. తన భూమిని తిరిగి తనకోసం కొనేందుకు ఒకనికి రక్తసంబంధి ఎవరూ లేక పోవచ్చును. అయితే తన భూమిని తనకోసం కొనేందుకు కావలసినంత డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు అతడు భూమి అమ్మివేసి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్క పెట్టాలి. ఆ లెక్కను ఉపయోగించి ఆ భూమి ధర నిర్ణయం చేయాలి. అప్పుడు అతడు ఆ భూమిని తిరిగి కొనుక్కోవాలి. ఆ భూమి మరల అతని ఆస్తి అవుతుంది. అయితే ఈ వ్యక్తి ఆ భూమిని తిరిగి తనకోసం కొనేందుకు సరిపడినంత డబ్బు అతని వద్ద లేకపోతే, అతడు అమ్మి వేసిన భూమి, వచ్చే బూరధ్వని చేసే మహోత్సవకాలం వరకు దానిని కొన్న వారి స్వాధీనంలోనే ఉంటుంది. అప్పుడు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో ఆ భూమి దాని మొదటి స్వంతదారుల పరం అవుతుంది. కనుక ఆ ఆస్తి తిరిగి దాని అసలైన కుటుంబానికి చెందుతుంది. “ప్రాకారంగల పట్టణంలో ఒకడు తన ఇల్లు అమ్మినట్టయితే, ఆ తర్వాత ఒక పూర్తి సంవత్సరం పాటు ఆ ఇల్లును తిరిగి పొందే హక్కు ఆ వ్యక్తికి ఉంటుంది. ఇంటిని తిరిగి పొందే హక్కు ఒక సంవత్సరంవరకు కొనసాగుతుంది. అయితే ఒక సంవత్సరం పూర్తయ్యేలోపల ఆ ఇంటి స్వంతదారుడు కొనక పోయినట్టయితే, అప్పుడు ప్రాకారంగల పట్టణంలోని ఆ ఇల్లు, దానిని కొన్నవానికి, అతని సంతానానికి స్వంతం అవుతుంది. బూరధ్యని చేసే మహోత్సవ సమయంలో ఆ యిల్లు తిరిగి దాని ప్రథమ స్వంత దారుని వశం కాదు. ప్రాకారాలు లేని పట్టణాలు బహిరంగ పొలాల్లా గుర్తించ బడతాయి. కనుక అలాంటి పట్టణాల్లో నిర్మించబడిన ఇళ్లు బూరధ్వని చేసే మహోత్సవ సమయంలో తిరిగి వాటి ప్రథమ స్వంత దారులపరం అవుతాయి. “అయితే లేవీయుల పట్టణాల విషయం. లేవీయులు వారికి చెందిన పట్టణాల్లోని వారి ఇళ్లను ఎప్పుడైనా సరే తిరిగి కొనవచ్చును. ఒక వ్యక్తి ఒక లేవీయుని దగ్గర ఒక ఇల్లు కొంటే, లేవీయుల పట్టణంలోని ఆ ఇల్లు బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో తిరిగి లేవీయులకే చెందుతుంది. ఎందుచేతనంటే లేవీయుల పట్టణాలు లేవీ వంశపు ప్రజలకు చెందినవి. ఆ పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలే లేవీయులకు ఇచ్చారు. అలానే, లేవీయుల పట్టణాల చుట్టు ప్రక్కల పొలాలు, పచ్చికబయళ్లు అమ్మేందుకు వీల్లేదు. ఆ పొలాలు శాశ్వతంగా లేవీయులకే చెందుతాయి.
లేవీయకాండము 25:23-34 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు. మీరు స్వాధీనంగా కలిగి ఉన్న భూమి అంతటా, మీరు భూమిని విడిపించడానికి తప్పక ఏర్పాటు చేయాలి. “ ‘ఒకవేళ మీ తోటి ఇశ్రాయేలీయులలో ఒకరు పేదవారిగా మారి వారి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మితే, వారి అతి సమీపబంధువు వచ్చి వారు అమ్మిన వాటిని తిరిగి విడిపించాలి. ఒకవేళ, వారి కోసం దానిని విడిపించడానికి సమీపబంధువు ఎవరు లేకపోతే, కాని తర్వాత వారు వృద్ధి చెంది దానిని విడిపించుకోడానికి తగినంత సంపాదిస్తే, వారు దాన్ని కొన్నప్పటి నుండి వారు విలువను నిర్ణయించి, బకాయిలను వారు ఎవరికి అమ్మారో వారికి తిరిగి చెల్లించాలి; వారు తిరిగి వారి సొంత ఆస్తికి వెళ్లవచ్చు. ఆస్తి మళ్ళీ కొనుక్కోవడానికి కావలసినంత డబ్బు వారికి దొరక్కపోతే, వారు అమ్మిన ఆస్తి యాభైయవ వార్షికోత్సవం వరకు కొన్న వారి స్వాధీనమవుతుంది. యాభైయవ వార్షికోత్సవంలో అది వారికి తిరిగి ఇవ్వబడుతుంది, వారు తమ స్వాస్థ్యానికి తిరిగి వెళ్లవచ్చు. “ ‘ప్రాకారాలు గల పట్టణంలో ఎవరైనా ఇంటిని అమ్మితే, దాని అమ్మకం తర్వాత పూర్తి సంవత్సరం విముక్తి హక్కును కలిగి ఉంటారు. ఆ సమయంలో అమ్మేవారు దానిని విడిపించవచ్చు. ఒకవేళ సంవత్సరం పూర్తిగా గడిచే లోపు దానిని విడిపించకపోతే, ప్రాకారం కలిగిన పట్టణంలోని ఇల్లు శాశ్వతంగా కొనుగోలుదారునికి, అతని వారసులకు చెందుతుంది. ఇది యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడదు. కానీ వారి చుట్టూ ఉన్న ప్రాకారాలు లేని గ్రామాల్లోని ఇల్లు బహిరంగ దేశానికి చెందినవిగా పరిగణించాలి. అవి విడిపించబడవచ్చు, అవి యాభైయవ వార్షికోత్సవంలో తిరిగి ఇవ్వబడాలి. “ ‘లేవీయులకు శాశ్వతంగా తమ దగ్గర ఉన్న లేవీయ పట్టణాల్లో తమ ఇళ్ళను విడిపించుకునే హక్కు ఉంటుంది. కాబట్టి లేవీయుల ఆస్తి విడిపించదగినది అంటే, వారి ఇల్లు ఏ పట్టణంలో అమ్మబడినా యాభైయవ వార్షికోత్సవంలో, తిరిగి ఇవ్వబడాలి, ఎందుకంటే లేవీయుల పట్టణాలలోని ఇల్లు ఇశ్రాయేలీయుల మధ్యలో వారి ఆస్తి. కానీ వారి పట్టణాలకు చెందిన పచ్చికబయళ్లు అమ్మకూడదు; అది వారి శాశ్వత స్వాస్థ్యము.