లూకా 20:1-26

లూకా 20:1-26 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఒకనాడు యేసు దేవాలయ ఆవరణంలో ప్రజలకు బోధిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, నాయకులతో కలసి ఆయన దగ్గరకు వచ్చారు. వారు, “నీవు ఏ అధికారంతో ఈ కార్యాలను చేస్తున్నావో మాకు చెప్పు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు. అందుకు యేసు, “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను: యోహానుకు ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగిందా? లేదా మానవుల నుండి కలిగిందా?” వారు తమలో తాము చర్చించుకొంటూ, “ఒకవేళ మనం ‘పరలోకం నుండి కలిగింది’ అని చెప్పితే ‘మరి మీరు ఎందుకు అతన్ని నమ్మలేదు?’ ఒకవేళ మనం, ‘మనుష్యుల వలన’ అని చెప్తే ప్రజలు రాళ్లతో కొడతారు, ఎందుకంటే వారికి యోహాను ఒక ప్రవక్త అని గట్టి నమ్మకం” అని అనుకున్నారు. అందుకు వారు, “అది ఎక్కడ నుండి వచ్చిందో మాకు తెలియదు” అని జవాబిచ్చారు. అందుకు యేసు, “నేను కూడా ఏ అధికారంతో వీటిని చేస్తున్నానో చెప్పను” అన్నారు. ఆయన ప్రజల వైపు తిరిగి ఈ ఉపమానం చెప్పడం మొదలుపెట్టారు: “ఒక మనుష్యుడు ద్రాక్షతోటను నాటించి, దానిని కొందరు కౌలురైతులకు అద్దెకు ఇచ్చి, దూర దేశానికి వెళ్లి చాలా కాలం అక్కడే ఉన్నాడు. కోతకాలం వచ్చినప్పుడు అతడు ఒక పనివానిని ఆ ద్రాక్షతోటకు వెళ్లి దానిలోని తన భాగం తెమ్మని ఆ రైతుల దగ్గరకు పంపాడు, కాని ఆ రైతులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మళ్ళీ అతడు మరొక పనివానిని పంపించాడు. వారు వానిని కూడా కొట్టి అవమానపరచి, వట్టి చేతులతో పంపారు. మళ్ళీ అతడు మూడవ వానిని పంపించాడు. వారు వానిని గాయపరచి బయటకు తోసివేసారు. “అప్పుడా ద్రాక్షతోట యజమాని ‘నేనేమి చేయాలి? నేను ప్రేమించే నా కుమారున్ని పంపిస్తాను, వారు ఒకవేళ అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు. “కాని ఆ కౌలు రైతులు అతన్ని చూసి, ‘ఇతడే వారసుడు, ఇతన్ని చంపుదాం, అప్పుడు ఈ వారసత్వం మనదైపోతుంది’ అని ఒకనితో ఒకరు చెప్పుకొని, కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు. “అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏమి చేస్తాడు? అతడు వచ్చి ఆ కౌలురైతులను చంపి తన ద్రాక్షతోటను ఇతరులకు అప్పగిస్తాడు” అని చెప్పారు. అది విన్న వారు, “అలా ఎన్నటికి కాకూడదు” అన్నారు. యేసు సూటిగా వారిని చూసి, “అలాగైతే లేఖనాల్లో, “ ‘ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడిన మాటకు అర్థం ఏమిటి? ఈ రాయి మీద పడిన ప్రతివారు ముక్కలైపోతారు, కాని ఎవరి మీద రాయి పడుతుందో వారు దాని క్రింద నలిగిపోతారు” అని చెప్పారు. ఇది విన్న ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన తమ గురించే ఆయన ఈ ఉపమానం చెప్పారని గ్రహించి, ఎలాగైనా ఆయనను త్వరగా బంధించడానికి అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. కాని ప్రజలకు భయపడ్డారు. ఆయనపై నిఘా వేసి ఉంచడానికి, వారు యథార్థంగా ఉన్నట్లు నటించగల వేగులవారిని పంపారు. యేసు మాట్లాడే దాంట్లో ఏదో తప్పు పట్టి ఆయనను పట్టుకుని, ఆయనను అధిపతి యొక్క అధికారానికి, ప్రభావానికి అప్పగించవచ్చని వారు ఆశించారు. అయితే ఆ వేగులవారు వచ్చి, “బోధకుడా, నీవు న్యాయంగా మాట్లాడుతూ బోధిస్తావని మాకు తెలుసు. నీవు ఏ పక్షపాతం చూపకుండ, దేవుని మార్గాన్ని సత్యం ఆధారంగా బోధిస్తావు. అయితే మనం కైసరుకు పన్ను చెల్లించడం న్యాయమా కాదా?” అని యేసును అడిగారు. ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో, “నాకు ఒక దేనారాన్ని చూపించండి, దీనిపై ఉన్న బొమ్మ ఎవరిది? ఈ వ్రాయబడిన ముద్ర ఎవరిది?” అని అడిగారు. అందుకు వారు, “కైసరువి” అన్నారు. అప్పుడు ఆయన, “అలాగైతే కైసరువి కైసరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అని వారితో చెప్పారు. మాటల్లో చిక్కులు పెట్టాలని చూసినవారు ప్రజల ముందు ఆయన మాటలను తప్పు పట్టలేక ఆయన జవాబుకు ఆశ్చర్యపడి నిశ్శబ్దమై పోయారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:1-26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆ రోజుల్లో ఒకసారి ఆయన దేవాలయంలో ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తున్నాడు. అప్పుడు ప్రధాన యాజకులూ, ధర్మశాస్త్ర పండితులూ పెద్దలతో కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చి, “నువ్వు ఏ అధికారంతో ఈ పనులన్నీ చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు? మాకు చెప్పు” అని ఆయనను అడిగారు. దానికి ఆయన, “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. నాకు జవాబివ్వండి. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల్లో నుండి కలిగిందా?” అని వారినడిగాడు. వారు ఇలా ఆలోచించారు, “మనం ‘పరలోకం నుండి కలిగింది’ అంటే, ‘అలాగైతే మీరెందుకు నమ్మలేదు?’ అని అడుగుతాడు. ‘మనుషుల్లో నుండి కలిగింది’ అంటే జనం మనలను రాళ్ళతో కొడతారు. ఎందుకంటే యోహాను ఒక ప్రవక్త అని అంతా కచ్చితంగా నమ్ముతున్నారు.” ఇలా ఆలోచించుకుని వారు, “అది ఎక్కడ నుండి కలిగిందో మాకు తెలీదు” అని జవాబిచ్చారు. దానికి యేసు, “నేను కూడా ఏ అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో మీతో చెప్పను” అన్నాడు. ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి ద్రాక్షతోట నాటించి, దాన్ని రైతులకు కౌలుకిచ్చాడు. ఆ తరువాత వేరే దేశానికి వెళ్ళి అక్కడ చాలా కాలం ఉన్నాడు. కోతల కాలం వచ్చినపుడు అతడు ఆ ద్రాక్ష తోటలో తన భాగం కోసం రైతుల దగ్గరికి తన పనివాడు ఒకణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి కొట్టి వట్టి చేతులతో పంపి వేశారు. మళ్ళీ అతడు మరో పనివాణ్ణి పంపాడు. వారు వాణ్ణి కూడా కొట్టి, అవమానపరిచి వట్టి చేతులతో పంపివేశారు. మళ్ళీ అతడు మూడవ వాణ్ణి పంపాడు. ఆ రైతులు వాణ్ణి గాయపరిచి బయటకు తోసివేశారు. అప్పుడా ద్రాక్షతోట యజమాని ఇలా అనుకున్నాడు, “ఇప్పుడు నేనేం చేయాలి? ఇక నా సొంత కుమారుణ్ణి పంపుతాను. వారు ఒకవేళ అతణ్ణి గౌరవిస్తారేమో.” అయితే ఆ కౌలు రైతులు అతణ్ణి చూసి, “ఇతడే వారసుడు. ఇతన్ని చంపివేస్తే ఈ పొలం మనదవుతుంది” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. వారు అతణ్ణి ద్రాక్ష తోట బయటకు తోసి చంపివేశారు. ఇప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వారినేం చేస్తాడు? అతడు వచ్చి ఆ రైతులను నాశనం చేసి తన ద్రాక్షతోటను మరొకరికి అప్పగిస్తాడు.” వారు అది విని, “అలా ఎన్నటికీ కాకూడదు” అన్నారు. ఆయన వారిని చూసి, “అలాగైతే, ‘ఇల్లు కట్టేవారు పనికి రాదని తీసివేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది’ అని రాసి ఉన్న మాట సంగతి ఏమిటి? ఈ రాయి పైన పడే ప్రతి వాడూ ముక్కలై పోతాడు. కానీ ఈ రాయి ఎవరిమీద పడుతుందో వాణ్ణి పిండి చేసేస్తుంది.” ఆయన తమను ఉద్దేశించే ఈ ఉపమానం చెప్పాడని ప్రధాన యాజకులూ ధర్మశాస్త్ర పండితులూ గ్రహించి ఆయనను ఆ సమయంలోనే పట్టుకోవాలని చూశారు కానీ ప్రజలకు భయపడ్డారు. వారాయన్ని కనిపెట్టి చూస్తూ ఉన్నారు. ఆయనను గవర్నర్ వశం చేసి అతని అధికారానికి అప్పగించడం కోసం ఆయనను మాటల్లో తప్పు పట్టుకోవాలని, నీతిపరులుగా నటించే వేగుల వారిని ఆయన దగ్గరికి పంపారు. వారు వచ్చి బోధకా, “నీవు న్యాయంగా మాటలాడుతూ ఉపదేశిస్తూ ఉన్నావు. మొహమాటం లేకుండా యథార్థంగా దేవుని మార్గం బోధిస్తున్నావని మాకు తెలుసు. మనం సీజరుకు పన్ను కట్టడం న్యాయమా కాదా?” అని ఆయనను అడిగారు. ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి, “ఒక నాణెం చూపించండి. దీని మీది బొమ్మ, అక్షరాలు ఎవరివి?” అని అడిగాడు. వారు, “సీజరువి” అన్నారు. అందుకాయన, “ఆలాగైతే సీజరువి సీజరుకు, దేవునివి దేవునికి చెల్లించండి” అన్నాడు. వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టడం చేతగాక ఆయన ఇచ్చిన జవాబుకు ఆశ్చర్యపడి ఊరుకున్నారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:1-26 పవిత్ర బైబిల్ (TERV)

ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు. ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు. వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’ అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు. యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు. ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు. పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు. ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు. అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు. “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు. కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు. అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు. “ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు. ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు. యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి: ‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’? ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు. శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు. వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు. మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు. వాళ్ళ పన్నాగం గమనించి యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు. ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:1-26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయన మీదికివచ్చి –నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీ కెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. అందుకాయన– నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారినడుగగా వారు–మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల–ఆలాగైతే మీ రెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని – అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు–ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితోననెను. అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్ప సాగెను – ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, కాపులకు గుత్తకిచ్చి, దేశాంతరముపోయి బహుకాల ముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపులయొద్ద కొక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టిచేతులతో పంపి వేసిరి. మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరచి, వట్టిచేతులతో పంపివేసిరి. మరల నతడు మూడవవాని పంపగా వారు వానిని గాయ పరచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడా ద్రాక్షతోట యజమానుడు–నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెదరను కొనెను. అయినను ఆ కాపులు అతనిని చూచి–ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని– అట్లు కాకపోవును గాకనిరి. ఆయన వారిని చూచి– ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతిమీద పడు ప్రతివాడును తునకలై పోవును; గాని అది ఎవనిమీద పడునో వానిని నలిచేయుననెను. ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరిగాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయనయొద్దకు పంపిరి. వారు వచ్చి–బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీ వెవనియందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి–ఒక దేనారము నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు– కైసరు వనిరి. అందుకాయన–ఆలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి.

షేర్ చేయి
చదువండి లూకా 20

లూకా 20:1-26 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)