లూకా 8:22-25
లూకా 8:22-25 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా, వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి. వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి దోనె నీళ్లతో నిండినందునవారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయనయొద్దకు వచ్చి–ప్రభువా ప్రభువా, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి, గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను. అప్పుడాయన –మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి–ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.
లూకా 8:22-25 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్ళతో నిండిపోవడం మొదలు పెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. కనుక శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, ఉప్పొంగుతున్న నీటిని మరియు గాలిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు. అయితే వారు విస్మయంతో భయపడుతు ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్ళను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
లూకా 8:22-25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరొక రోజు ఆయన తన శిష్యులతో కలిసి పడవ ఎక్కి, “సరస్సు అవతలి వైపుకు వెళ్దాం” అన్నాడు. వారు ఆ పడవను నీటిలోకి తోసి బయలుదేరారు. వారు ప్రయాణమయ్యాక ఆయన నిద్రపోయాడు. ఈలోగా సరస్సు మీద బలమైన గాలివాన వచ్చి పడవలోకి నీళ్ళు వచ్చేశాయి. వారి స్థితి ప్రమాదకరంగా మారింది. కాబట్టి వారు ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ! ప్రభూ! నశించిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలినీ, ఉవ్వెత్తున లేచే కెరటాలనూ గద్దించాడు. అవి అణిగిపోయి అంతా నిశ్శబ్దంగా అయింది. అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అన్నాడు. వారు భయపడి, “ఈయన గాలికీ నీళ్లకూ ఆజ్ఞాపిస్తే అవి లోబడుతున్నాయి. ఈయన ఎవరో” అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆశ్చర్యపోయారు.
లూకా 8:22-25 పవిత్ర బైబిల్ (TERV)
ఒక రోజు యేసు, ఆయన శిష్యులు పడవలో ఉండగా, “సముద్రం అవతలి ఒడ్డుకు వెళ్దాం” అని అన్నాడు. అందువల్ల వాళ్ళు ప్రయాణమయ్యారు. ప్రయాణం సాగిస్తుండగా యేసు నిద్రపొయ్యాడు. అకస్మాత్తుగా పెనుగాలి ఆ సముద్రం మీదుగా వీచింది. నీళ్ళు పడవలోకి రావటం మొదలు పెట్టాయి. వాళ్ళందరూ పెద్ద ప్రమాదంలో చిక్కుకొని పొయ్యారు. శిష్యులు యేసును నిద్ర లేపుతూ, “ప్రభూ! ప్రభూ! మనము మునిగి పోతున్నాం!” అని అన్నారు. ఆయన లేచి గాలిని, నీళ్ళను ఆగమని గద్దించాడు. పెనుగాలి ఆగిపోయింది. “యేసు, మీ విశ్వాసం ఏమైంది?” అని తన శిష్యుల్ని అడిగాడు. వాళ్ళు భయంతో ఆశ్చర్యంగా, “ఆయన ఎంత గొప్పవాడు! నీళ్ళను, గాలిని కూడా ఆజ్ఞాపిస్తున్నాడే! అవి విధేయతతో ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాయే!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.
లూకా 8:22-25 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు. వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో భయంకరమైన తుఫాను సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్లతో నిండిపోవడం మొదలుపెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు. కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అని అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది. అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు. అయితే వారు విస్మయంతో భయపడుతూ ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్లను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.