మత్తయి 15:1-20 - అన్ని సంస్కరణలను పోల్చండి
మత్తయి 15:1-20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ సమయమున యెరూషలేమునుండి శాస్త్రులును పరిసయ్యులును యేసునొద్దకు వచ్చి నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండ భోజనముచేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకాయన మీరును మీపారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? –తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలచిచ్చెను. మీరైతే– ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి –నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పినయెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా – ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్ర పరచదు గాని నోటనుండి వచ్చున దియే మనుష్యుని అపవిత్రపరచునని వారితో చెప్పెను. అంతట ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా అని ఆయనను అడుగగా ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవ చూపువారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవ చూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు గదా అనెను. అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా ఆయన మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా? నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపరచదని చెప్పెను.
మత్తయి 15:1-20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ రోజుల్లో యెరూషలేము నుండి ధర్మశాస్త్ర పండితులూ, పరిసయ్యులూ వచ్చి, “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తూ మన పెద్దలు ఏర్పాటు చేసిన సంప్రదాయాన్ని పాటించడం లేదేంటి?” అని యేసుని అడిగారు. అందుకు ఆయన వారితో ఇలా అన్నాడు, “మీరు మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞనే మీరుతున్నారు. ఎలాగంటే తల్లిదండ్రులను ఘనపరచమనీ, తండ్రిని గాని తల్లిని గాని దూషించేవాడికి శిక్ష మరణమేననీ దేవుడు చెప్పాడు. కాని మీరు మాత్రం ఎవరైనా తన తండ్రితో, తల్లితో నా నుండి మీకు ఏమైనా లాభం కలుగుతూ ఉంటే దాన్ని దేవునికి ఇచ్చేశాను అని చెబితే అతడు ఇక నుండి తన తల్లిదండ్రులను పట్టించుకోనక్కర లేదని చెబుతారు. ఆ విధంగా మీరు మీ సంప్రదాయాల కోసం దేవుని మాటను పక్కన పెట్టేశారు. వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.” ఆయన ప్రజలందరినీ పిలిచి, “మీరు తెలుసుకోవలసింది ఏమంటే, ఒక వ్యక్తి నోటిలోకి వెళ్ళేది అతనినేమీ అపవిత్రపరచదు. నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరుస్తుంది” అని చెప్పాడు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, “నీకు తెలుసా? పరిసయ్యులు నీ మాటలు విని చాలా నొచ్చుకున్నారు” అని ఆయనతో అన్నారు. ఆయన, “పరలోకపు తండ్రి నాటని ప్రతి మొక్కనూ పీకివేయడం జరుగుతుంది. వారి జోలికి వెళ్ళవద్దు. వారు గుడ్డివారు. వేరే గుడ్డివారికి దారి చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపిస్తే వారిద్దరూ కలిసి గుంటలో పడతారు కదా” అన్నాడు. అందుకు పేతురు, “ఈ ఉపమానభావం మాకు వివరించు” అని ఆయనను అడిగాడు. అప్పుడాయన, “మీరు ఇంకా అవివేకంగా ఉన్నారా? నోటిలోకి పోయేదంతా కడుపులో పడి బయటకు విసర్జన అయిపోతుంది. కాని నోటి నుండి బయటికి వచ్చేవి హృదయంలో నుండి వస్తాయి. అవే మనుషులను అపవిత్రపరుస్తాయి. ఇది కూడా మీకు తెలియలేదా? హృదయంలో నుండే చెడు ఆలోచనలు, హత్యలు, వ్యభిచారాలు, లైంగిక దుర్నీతి, దొంగతనాలు, అబద్ధ సాక్ష్యాలు, దైవదూషణలు వస్తాయి. మనిషిని అపవిత్రపరచేవి ఇవే గానీ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం కాదు” అని వారితో చెప్పాడు.
మత్తయి 15:1-20 TERV (పవిత్ర బైబిల్)
కొందరు పరిసయ్యులు, శాస్త్రులు యెరూషలేము నుండి వచ్చి, “మీ శిష్యులు భోజనానికి ముందు చేతులెందుకు కడుక్కోరు? పెద్దలు నియమించిన ఆచారాల్ని వాళ్ళెందుకు ఉల్లంఘిస్తున్నారు?” అని అడిగారు. యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ఆచారాల కోసం దేవుని ఆజ్ఞల్ని ఎందుకుల్లంఘిస్తున్నారు? దేవుడు ‘తల్లి తండ్రుల్ని గౌరవించు’ అని అన్నాడు. అంతేకాక ‘తల్లి తండ్రుల్ని దూషించిన వానికి మరణ దండన వేయవలెను!’ అని కూడా చెప్పాడు. కాని మీరు ఒక వ్యక్తి తన తల్లి తండ్రులతో ‘మీ అవసరాలకివ్వాలనుకొన్న ధనం దేవునికి ముడుపు కట్టాను’ అని అన్నవాడు, తల్లి తండ్రుల్ని గౌరవించనవసరం లేదని అంటున్నారు. అంటే మీరు మీ ఆచారం కోసం దేవుని మాటను కాదంటున్నారన్న మాట. మీరు మోసగాళ్ళు. యెషయా మిమ్మల్ని గురించి సరిగ్గా ముందే చెప్పాడు. అతడు, ‘ఈ ప్రజలు నన్ను పెదాలతో గౌరవిస్తారు. కాని వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉంటాయి. వాళ్ళ ఆరాధనలు వ్యర్థం! వాళ్ళ బోధనలు మానవులు సృష్టించిన ఆజ్ఞలతో సమానం,’” అని అన్నాడు. యేసు ప్రజల్ని తన దగ్గరకు రమ్మని పిలిచి వాళ్ళతో, “విని అర్థం చేసుకోండి. మానవుని నోటిలోనికి వెళ్ళేదేదీ అతణ్ణి అపవిత్రం చెయ్యదు. అతని నోటినుండి వచ్చే మాటలు అతణ్ణి అపవిత్రం చేస్తాయి” అని అన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు వచ్చి, “మీరన్నది విని పరిసయ్యులు కోపగించుకొన్నారని మీకు తెలుసా?” అని అడిగారు. యేసు సమాధానంగా, “పరలోకంలో ఉన్న నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో పెరికి వేయబడుతుంది. వాళ్ళ విషయాన్ని వదిలెయ్యండి. వాళ్ళు గ్రుడ్డివాళ్ళు. కాని వారు ఇతరులకు దారి చూపుతూ ఉంటారు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపితే యిద్దరూ గోతిలో పడ్తారు” అని అన్నాడు. పేతురు, “ఆ ఉపమానాన్ని మాకు విడమరచి చెప్పండి” అని అడిగాడు. యేసు, “మీక్కూడా అర్థంకాలేదా? నోట్లోకి వెళ్ళినవి కడుపులోకి వెళ్ళి తదుపరి శరీరం నుండి బయటకు వెళ్తున్నాయని మీకు తెలియదా? కాని నోటినుండి బయటకు వచ్చే మాటలు హృదయం నుండి వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఇవే. ఎందుకంటే, దురాలోచన, హత్య, లైంగిక అవినీతి, వ్యభిచారం, దొంగతనము, తప్పుడు సాక్ష్యము, అపనింద, మానవుని హృదయం నుండి వస్తాయి. వీటి కారణంగా మానవుడు అపవిత్రమౌతున్నాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినంత మాత్రాన అపవిత్రం కాడు” అని అన్నాడు.
మత్తయి 15:1-20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు కొందరు పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేము పట్టణం నుండి యేసు దగ్గరకు వచ్చి, “నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. వారు పెద్దల సాంప్రదాయాన్ని ఎందుకు పాటించరు?” అని అడిగారు. అప్పుడు యేసు వారితో ఈ విధంగా చెప్పారు, “మీ సంప్రదాయం కోసం దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? ‘మీ తండ్రిని తల్లిని గౌరవించాలి. ఎవరైనా తల్లిని గాని తండ్రిని గాని శపిస్తే వారికి మరణశిక్ష విధించాలి’ అని దేవుడు చెప్పారు. కానీ మీరు, ఎవరైనా తమ తండ్రితో గాని తల్లితో గాని సహాయపడడానికి ఉపయోగించినది ‘దేవునికి అంకితం’ అని ప్రకటిస్తే, వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు. వేషధారులారా! మీ గురించి ఇలా యెషయా ప్రవచించింది నిజమే: “ ‘ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు కాని వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి; వారు వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు; వారి బోధలు కేవలం మానవ నియమాలు మాత్రమే.’ ” యేసు జనసమూహాన్ని తన దగ్గరకు పిలిచి, “మీరు విని తెలుసుకోండి. నోటిలోకి వెళ్లేవీ ఒకరిని అపవిత్రపరచవు, కాని నోటి నుండి బయటకు వచ్చేవి మాత్రమే వారిని అపవిత్రపరుస్తాయి” అని వారితో చెప్పారు. ఆ తర్వాత యేసు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “పరిసయ్యులు ఆ మాటలను విని అభ్యంతరపడ్డారు అని నీకు తెలుసా!” అని అడిగారు. అందుకు యేసు, “పరలోకపు నా తండ్రి నాటని ప్రతి మొక్క వేర్లతో సహా పీకివేయబడుతుంది. వారిని వదిలిపెట్టండి; వారు గ్రుడ్డి మార్గదర్శకులు. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపిస్తే, వారిద్దరు గుంటలో పడతారు” అన్నారు. అందుకు పేతురు, “మాకు ఈ ఉపమానం అర్థమయ్యేలా చెప్పమని” అడిగాడు. యేసు, “మీరు ఇంకా అవివేకంగానే ఉన్నారా? నోటిలోకి పోయేవన్ని కడుపులోనికి వెళ్లి, తర్వాత శరీరం నుండి బయటకు విసర్జింపబడతాయని మీరు చూడలేదా? అని వారిని అడిగారు. కానీ వ్యక్తి నోటి నుండి వచ్చేవన్ని హృదయంలోనుండి వస్తాయి. ఇవే వారిని అపవిత్రపరుస్తాయి. ఎందుకంటే, హృదయంలో నుండే నరహత్య, వ్యభిచారం, లైంగిక అనైతికత, దొంగతనం, అబద్ధసాక్ష్యం దూషణ అనే చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఇవే వ్యక్తిని అపవిత్రపరుస్తాయి; అంతేకాని చేతులు కడక్కుండా భోజనం చేస్తే అది వారిని అపవిత్రపరచదు” అని చెప్పారు.