మత్తయి 17:14-21
మత్తయి 17:14-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని– ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్ర రోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు; నీ శిష్యుల యొద్దకు వానిని తీసికొని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు–విశ్వాసములేని మూర్ఖతరమువారలారా, మీతో నేనెంత కాలము ఉందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని చెప్పెను. అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదలి పోయెను; ఆ గడియనుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసు నొద్దకు వచ్చి–మేమెందుచేత దానిని వెళ్లగొట్టలేక పోతి మని అడిగిరి. అందుకాయన–మీ అల్పవిశ్వాసము చేతనే; మీకు ఆవగింజంత విశ్వాసముండినయెడల ఈ కొండను చూచి–ఇక్కడనుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును; మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
మత్తయి 17:14-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు జనసమూహాన్ని సమీపించినప్పుడు ఒకడు యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరించి, “ప్రభువా, నా కుమారుని కరుణించు. వాడు మూర్ఛ రోగంతో చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పులో, నీళ్లలో పడిపోతున్నాడు. నేను వీన్ని నీ శిష్యుల దగ్గరకు తీసికొని వచ్చాను కానీ వారు వీన్ని బాగు చేయలేకపోయారు” అని చెప్పాడు. అందుకు యేసు, “విశ్వాసంలేని మూర్ఖతరమా, నేను మీతో ఎంతకాలం ఉంటాను? ఎంతకాలం మీ అవిశ్వాసాన్ని సహించగలను? ఆ పిల్లవాన్ని నా దగ్గరకు తీసుకొనిరండి” అన్నారు. అప్పుడు యేసు ఆ దయ్యాన్ని గద్దించారు, అది వానిని వదలిపోయింది. ఆ సమయం నుండి వాడు బాగైపోయాడు. ఆ తర్వాత శిష్యులు యేసు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి, “మేము ఎందుకు దానిని వెళ్లగొట్టలేకపోయాం” అని అడిగారు. అందుకు యేసు, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను చూసి, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అంటే అది పోతుంది. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. [ఇలాంటివి కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే బయటకు వెళ్లిపోతాయి” అని వారికి చెప్పారు.]
మత్తయి 17:14-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారు కొండ దిగి అక్కడి జనసమూహంలోకి రాగానే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఎదుట మోకరించి, “ప్రభూ, నా కొడుకును కనికరించు. వాడు మూర్ఛరోగి. చాలా బాధపడుతున్నాడు. పదే పదే నిప్పుల్లో నీళ్ళలో పడిపోతుంటాడు. వాణ్ణి నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను గాని వారు బాగుచేయలేక పోయారు” అని చెప్పాడు. అందుకు యేసు, “వక్ర మార్గం పట్టిన విశ్వాసం లేని తరమా! నేనెంత కాలం మీతో ఉంటాను? ఎప్పటి వరకూ మిమ్మల్ని సహిస్తాను? అతణ్ణి నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు. యేసు ఆ దయ్యాన్ని గద్దించగానే అది ఆ బాలుణ్ణి విడిచిపెట్టేసింది. వెంటనే అతడు బాగుపడ్డాడు. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసును కలిసి, “మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేక పోయాం?” అని అడిగారు. అందుకాయన, “మీ అల్పవిశ్వాసమే దానికి కారణం. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళు అనగానే అది వెళ్ళిపోతుంది అని మీతో కచ్చితంగా చెబుతున్నాను. మీకు అసాధ్యమైంది ఏదీ ఉండదు” అని వారితో చెప్పాడు.
మత్తయి 17:14-21 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు ప్రజల దగ్గరకు రాగానే ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి మోకరిల్లి, “ప్రభూ! నా కుమారునిపై దయ చూపండి. అతడు మూర్ఛ రోగంతో చాలా బాధపడ్తున్నాడు. మాటి మాటికి నిప్పుల్లో పడ్తూ ఉంటాడు. అతణ్ణి నేను మీ శిష్యుల దగ్గరకు తీసుకు వచ్చాను. కాని వాళ్ళతనికి నయం చెయ్యలేక పొయ్యారు” అని అన్నాడు. అప్పుడు యేసు, “మూర్ఖులైన ఈ తరానికి చెందిన మీలో విశ్వాసం లేదు. మీకు సక్రమమైన ఆలోచనలు రావు. నేనెంత కాలమని మీతో ఉండాలి? ఎంతకాలమని మీ పట్ల సహనం వహించాలి. ఆ బాలుణ్ణి నా దగ్గరకు పిలుచుకు రండి” అని అన్నాడు. యేసు ఆ దయ్యానికి వెళ్ళిపొమ్మని గట్టిగా చెప్పాడు. అది ఆ బాలుని నుండి వెలుపలికి వచ్చింది. అదే క్షణంలో ఆ బాలునికి నయమైపోయింది. శిష్యులు ఆ తర్వాత యేసు దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేక పోయాము?” అని అడిగారు. యేసు, “మీలో దృఢవిశ్వాసం లేదు కనుక మీరు దాన్ని వెళ్ళగొట్టలేక పొయ్యారు. కాని ఇది సత్యం. మీలో ఆవగింజంత విశ్వాసమున్నా చాలు. మీరీ కొండతో ‘అక్కడికి వెళ్ళు’ అని అంటే వెళ్తుంది. మీకు అసాధ్యమనేది ఉండదు” అని అన్నాడు.