మత్తయి 6:19-24
మత్తయి 6:19-24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినయెడల నీ దేహమంతయు వెలుగు మయమైయుండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై యుండును; నీలోనున్న వెలుగు చీకటియైయుండినయెడల ఆ చీకటి యెంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు.
మత్తయి 6:19-24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“భూమి మీద మీ కొరకు ధనాన్ని కూడపెట్టుకోకండి. ఇక్కడ దానికి చెదలు పట్టి, తుప్పు పట్టి నాశనం అవుతుంది, దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారు. అయితే మీ కొరకు పరలోకంలో ధనం కూడపెట్టుకోండి, అక్కడ చిమ్మెట గాని క్రిమికీటకాలుగాని నాశనం చేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలించలేరు. ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో, అక్కడే మీ హృదయం ఉంటుంది. “కన్ను దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే నీ దేహమంతా వెలుగుతో నిండి ఉంటుంది. కాని నీ కన్ను అనారోగ్యంగా ఉంటే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుకే మీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి కటిక చీకటై ఉంటుంది కదా! “ఎవ్వరూ ఇద్దరు యజమానులకు సేవచేయలేరు. వారు ఒకరిని ద్వేషించి మరొకరిని ప్రేమిస్తారు లేక ఒక యజమానికి అంకితమై మరొకనిని తృణీకరిస్తారు. మీరు దేవుణ్ణి, ధనాన్ని రెండింటిని ఒకేసారి సేవించలేరు.
మత్తయి 6:19-24 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“భూమి మీద మీకోసం సంపద కూడబెట్టుకోవద్దు. ఇక్కడ చెదలూ తుప్పూ తినివేస్తాయి. దొంగలు పడి దోచుకుంటారు. పరలోకంలో మీ కోసం సంపద కూడబెట్టుకోండి. అక్కడ చెదలుగానీ, తుప్పుగానీ తినివేయవు. దొంగలు పడి దోచుకోరు. ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది. “శరీరానికి దీపం కన్ను. కాబట్టి నీ కన్ను బాగుంటే నీ శరీరమంతా వెలుగుతో నిండి ఉంటుంది. నీ కన్ను పాడైతే నీ శరీరమంతా చీకటితో నిండి ఉంటుంది. అందుచేత నీలో ఉన్న వెలుగే చీకటి అయితే ఆ చీకటి ఎంత భయంకరమైనదో కదా! ఇద్దరు యజమానులకు ఎవరూ సేవ చేయలేరు. అతడు ఒకణ్ణి ద్వేషించి మరొకణ్ణి ప్రేమిస్తాడు. లేకపోతే ఒకడికి కట్టుబడి మరొకణ్ణి చిన్నచూపు చూస్తాడు. అలాగే దేవునికీ సంపదకూ ఒకేసారి సేవ చేయడం కుదరదు.
మత్తయి 6:19-24 పవిత్ర బైబిల్ (TERV)
“మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి. ఇక్కడ ఆ ధనానికి చెదలు పడుతుంది. తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది. దొంగలు పడి దోచుకొంటారు. మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకొండి. అక్కడ చెదలు పట్టవు, తుప్పు తినివేయదు. దొంగలు పడి దోచుకోరు. మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది. “కన్ను శరీరానికి ఒక దీపంలాంటిది. మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది. మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది. మీలో ఉన్న వెలుగే చీకటై పోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా. “ఒకే వ్యక్తి యిద్దరు యజమానులకు సేవ చేయలేడు. అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి, యింకొకణ్ణి ద్వేషిస్తూ ఉంటాడు. లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి, యింకొకణ్ణి అశ్రద్ధ చేస్తాడు. మీరు దేవునికి, డబ్బుకు సేవకునిగా ఉండటమనేది అసంభవం.