మత్తయి 8:1-13

మత్తయి 8:1-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఆయన ఆ కొండమీదనుండి దిగి వచ్చినప్పుడు బహుజనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి–ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి–నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి యాయెను. అప్పుడు యేసు–ఎవరితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనయొద్దకు వచ్చి –ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి, ఆయనను వేడుకొనెను. యేసు –నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి–ప్రభువా, నీవు నా యింటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను; నీవు మాటమాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడ అధికారమునకు లోబడినవాడను; నా చేతిక్రింద సైనికులున్నారు; నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయుమంటే చేయును అని యుత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, వెంట వచ్చుచున్నవారిని చూచి–ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడ లేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహా ముతోకూడను, ఇస్సాకుతోకూడను, యాకోబుతోకూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయునుండునని మీతో చెప్పుచున్నాననెను. అంతట యేసు – ఇక వెళ్లుము; నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతనిదాసుడు స్వస్థతనొందెను.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

యేసు కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, గొప్ప జనసమూహాలు ఆయనను వెంబడించాయి. కుష్ఠురోగంతో ఉన్న ఒకడు వచ్చి ఆయన ముందు మోకరించి ఆయనతో, “ప్రభువా, నీకిష్టమైతే, నన్ను శుద్ధునిగా చేయి” అన్నాడు. యేసు చేయి చాపి వాన్ని ముట్టారు. ఆయన వానితో, “నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు అవు!” అన్నారు. వెంటనే వాడు తన కుష్ఠురోగం నుండి శుద్ధుడయ్యాడు. అప్పుడు యేసు వానితో, “నీవు ఎవరికి చెప్పకు. కాని వెళ్లి, నిన్ను నీవు యాజకునికి చూపించుకొని, వారికి సాక్ష్యంగా ఉండేలా, మోషే నియమించిన కానుకను అర్పించు” అని వానికి చెప్పారు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు, ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, “ప్రభువా, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో చాలా బాధపడుతున్నాడు” అని సహాయాన్ని కోరాడు. యేసు అతనితో, “నేను వచ్చి అతన్ని స్వస్థపరచనా?” అన్నాడు. అందుకు శతాధిపతి, “ప్రభువా, నిన్ను నా ఇంటికి రప్పించుకునేంత యోగ్యత నాకు లేదు. కానీ నీవు ఒక మాట చెప్తే చాలు, నా పనివాడు స్వస్థపడతాడు. ఎందుకంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నవాడినే, నా క్రింద సైనికులున్నారు. ఒకడిని ‘వెళ్లు’ అంటే వెళ్తాడు, ‘రా’ అంటే వస్తాడు. నా దాసుని ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఈ మాటలను విని, ఆశ్చర్యపడి తనను వెంబడిస్తున్న వారితో, “ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను ఎవ్వరిలో చూడలేదని మీతో నిజంగా చెప్తున్నాను. అనేకులు తూర్పు, పడమర నుండి వచ్చి, పరలోకరాజ్యంలో జరిగే విందులో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. కానీ రాజ్యసంబంధులు బయట చీకటిలోనికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం పండ్లు కొరకడం ఉంటాయి.” అప్పుడు యేసు శతాధిపతితో, “వెళ్లు! నీవు నమ్మినట్లే నీకు జరుగును” అని చెప్పారు. ఆ క్షణమే అతని పనివాడు స్వస్థపడ్డాడు.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఆయన కొండ దిగి వచ్చినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయనను అనుసరించారు. ఒక కుష్టు రోగి వచ్చి ఆయనకు మొక్కి, “ప్రభూ, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలవు” అన్నాడు. యేసు చెయ్యిచాపి అతణ్ణి తాకి, “నాకిష్టమే, నువ్వు బాగుపడు” అన్నాడు. వెంటనే అతని కుష్టు రోగం నయమైంది. అప్పుడు యేసు అతనితో, “చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు” అని చెప్పాడు. యేసు కపెర్నహూములో ప్రవేశించినప్పుడు రోమా సైన్యంలో ఒక శతాధిపతి ఆయన దగ్గరికి వచ్చి, “ప్రభూ, నా పనివాడు పక్షవాతంతో ఇంట్లో పడి ఉన్నాడు. చాలా బాధపడుతున్నాడు” అని చెప్పాడు. “నేను వచ్చి అతణ్ణి బాగు చేస్తాను” అని యేసు అతనికి జవాబిచ్చాడు. ఆ శతాధిపతి, “ప్రభూ, నీవు నా యింట్లోకి వచ్చేటంత యోగ్యత నాకు లేదు. మాట మాత్రం అనండి. నా పనివాడు బాగుపడతాడు. నేను కూడా అధికారం కింద ఉన్నవాడినే. నా చేతి కింద కూడా సైనికులున్నారు. నేను ఎవడినైనా ‘వెళ్ళు’ అంటే వాడు వెళ్తాడు. ఎవడినైనా ‘రా’ అంటే వాడు వస్తాడు. నా పనివాణ్ణి ‘ఇది చెయ్యి’ అంటే చేస్తాడు” అని జవాబిచ్చాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, తన వెంట వస్తున్న వారితో ఇలా అన్నాడు, “ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఎవరికైనా ఇంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని కచ్చితంగా చెబుతున్నాను. తూర్పు నుంచీ పడమర నుంచీ చాలా మంది వచ్చి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో పాటు పరలోక రాజ్యంలో విందులో కూర్చుంటారు. అయితే రాజ్య కుమారులను మాత్రం బయట చీకట్లోకి తోసేయడం జరుగుతుంది. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.” యేసు శతాధిపతితో, “వెళ్ళు. నీవు నమ్మినట్టే నీకు జరుగుతుంది” అన్నాడు. ఆ క్షణంలోనే అతని పనివాడు బాగుపడ్డాడు.

షేర్ చేయి
Read మత్తయి 8

మత్తయి 8:1-13 పవిత్ర బైబిల్ (TERV)

యేసు కొండదిగి రాగా, ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్టురోగంతో ఉన్న వాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మీరు తలచుకొంటే నన్ను బాగుచెయ్యగలరు” అని అన్నాడు. యేసు తన చేయి చాపి అతణ్ణి తాకుతూ, “నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవుకమ్ము!” అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, “ఈ సంఘటనను గురించి ఎవ్వరికీ చెప్పకు. కాని యాజకుని దగ్గరకు వెళ్ళి నీ దేహాన్ని చూపి, మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. తద్వారా నీకు నయమైనట్లు వాళ్ళకు రుజువౌతుంది” అని అన్నాడు. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన సహాయం కావాలని కోరుతూ, “ప్రభూ! నా సేవకుడు పక్షవాతం వచ్చి యింట్లో పడుకొని ఉన్నాడు. వానికి చాలా బాధ కలుగుతోంది” అని అన్నాడు. యేసు, “నేను వచ్చి నయం చేస్తాను” అని అన్నాడు. కాని శతాధిపతి సమాధానంగా, “ప్రభూ! మీరు మా యింటి గడపలో కాలు పెట్టటానికి కూడా నేను అర్హుడను కాను. కాని మీరు మాటంటే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే, నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి. నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు; ఆ సైనికునితో ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘ఇది చేయి’ అంటే చేస్తాడు” అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపొయ్యాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్ళతో, “ఇది సత్యం. ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవ్వరూ కనిపించలేదు. నేను చెప్పెదేమిటంటే, తూర్పునుండి, పడమరనుండి, చాలామంది ప్రజలు వస్తారు. వచ్చి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కాని దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుకవల్ల వారసులైన వాళ్ళను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు.” ఇలా అని, యేసు శతాధిపతితో, “వెళ్ళు! నీవు విశ్వసించినట్లే జరుగుతుంది” అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది.

షేర్ చేయి
Read మత్తయి 8