సామెతలు 31:10-31

సామెతలు 31:10-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది. ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు. ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు. ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది. వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది. ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది. ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది. తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది. దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది. తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు. ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు. ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి. ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది. బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది. ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది. ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు. ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు. “చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు. చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు. ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.

షేర్ చేయి
Read సామెతలు 31

సామెతలు 31:10-31 పవిత్ర బైబిల్ (TERV)

“పరిపూర్ణమైన స్త్రీ” దొరకటం ఎంతో కష్టం. కాని ఆమె నగలకంటె ఎంతో ఎక్కువ అమూల్యం. ఆమె భర్త ఆమెను నమ్మగలడు. అతడు ఎన్నడూ దరిద్రునిగా ఉండడు. మంచి భార్య తన జీవితకాలం అంతా తన భర్తకు మంచినే చేస్తుంది. ఆమె ఎన్నడూ అతనికి చిక్కు కలిగించదు. ఆమె ఉన్నిబట్ట తయారు చేస్తూ ఎల్లప్పుడూ పనిలో నిమగ్నమవుతుంది. ఆమె దూరము నుండి వచ్చిన ఓడలా ఉంటుంది. అన్ని చోట్ల నుండీ ఆమె ఆహారం తీసుకొని వస్తుంది. ఆమె అతి వేకువనే మేలుకొంటుంది. తన కుటుంబానికి భోజనం, తన పని వారికి భోజనం ఆమె వండుతుంది. ఆమె పొలాన్ని చూస్తుంది. దాన్నికొంటుంది. ఆమె ద్రాక్షతోట నాటేందుకు ఆమె దాచుకొన్న డబ్బు ఉపయోగిస్తుంది. ఆమె చాలా కష్టపడి పని చేస్తుంది. ఆమె బలంగా ఉండి తన పని అంతా చేసుకోగలుగుతుంది. ఆమె తయారు చేసిన వాటిని అమ్మినప్పుడు ఆమె ఎల్లప్పుడూ లాభం సంపాదిస్తుంది. మరియు రాత్రి చాలా పొద్దుపోయేదాకా ఆమె పని చేస్తుంది. ఆమె స్వంతంగా దారం తయారు చేసికొని తన స్వంత బట్ట నేస్తుంది. ఆమె ఎల్లప్పుడూ పేద ప్రజలకు పెడుతుంది. అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది! చలిగా ఉన్నప్పుడు ఆమె తన కుటుంబం విషయం దిగులు పడదు. ఆమె వారందరికి మంచి వెచ్చని దుస్తులు ఇస్తుంది. ఆమె దుప్పట్లు నేసి పడకలమీద పరుస్తుంది. సన్నని నారతో చేయబడ్డ వస్త్రాలు ఆమె ధరిస్తుంది. ఆమె భర్తను ప్రజలు గౌరవిస్తారు. అతడు దేశ నాయకులలో ఒకడు. ఆమె మంచి వ్యాపార దక్షతగల స్త్రీ. ఆమె బట్టలు, నడికట్లు తయారు చేసి వాటిని వ్యాపారస్థులకు అమ్ముతుంది. ఆమె బలంగా ఉంటుంది. మరియు, ప్రజలు ఆమెను గౌరవిస్తారు. ఆమె స్థానము బలంగాను మరియు సురక్షితంగాను ఉంటుంది. భవిష్యత్తును గురించి సంతోషిస్తుంది. ఆమె మాట్లాడినప్పుడు జ్ఞానముగా ఉంటుంది. ఆమె జ్ఞానం ఉపదేశముతోనిండి ఉంటుంది. ఆమె ఎన్నడూ బద్ధకంగా ఉండదు. కాని ఆమె తన ఇంటి విషయాలను గూర్చి జాగ్రత్త తీసుకొంటుంది. ఆమె పిల్లలు పెద్దవారై ఆమెను ఘనపరుస్తారు. మరియు ఆమె భర్త ఆమెను గూర్చి ఎన్నో మంచి విషయాలు చెబుతాడు. “ఎంతో మంది స్త్రీలు మంచి భార్యలు అవుతారు. కాని నీవు శ్రేష్ఠమైన దానివి” అని ఆమె భర్త చెబుతాడు. సౌందర్యము, అందము నిన్ను మోసగించవచ్చు. అయితే యెహోవాను గౌరవించే స్త్రీ పొగడబడాలి. ఆమెకు అర్హమైన ప్రతిఫలం రావాలి. ఆమె చేసిన విషయాల కోసం ప్రజలు ఆమెను బహిరంగంగా ఘనపర్చాలి.

షేర్ చేయి
Read సామెతలు 31

సామెతలు 31:10-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలుచేయును గాని కీడేమియు చేయదు. ఆమె గొఱ్ఱెబొచ్చును అవిసెనారను వెదకును తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరమునుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరమునుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి, తన యింటివారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసికొనును తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్షతోట యొకటి నాటించును. ఆమె నడికట్టుచేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయును తన వ్యాపారలాభము అనుభవముచే తెలిసికొనును రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేతపట్టుకొనును తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును దరిద్రులకు తన చేతులు చాపును తన యింటివారికి చలి తగులునని భయపడదు ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును ఆమె బట్టలు సన్నని నారబట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతోకూడ కూర్చుండును గవినియొద్ద పేరుగొనినవాడైయుండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు – చాలమంది కుమార్తెలు పతివ్రతాధర్మము ననుసరించియున్నారు గాని వారందరిని నీవు మించినదానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును చేసిన పనినిబట్టి అట్టిదానికి ప్రతిఫలమియ్యదగును గవునులయొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును.

షేర్ చేయి
Read సామెతలు 31

సామెతలు 31:10-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది. ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు అతనికి లాభం తక్కువకాదు. ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు. ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని, ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది. ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే, వర్తకుల ఓడల లాంటిది. ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది; తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది; తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది. ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది; తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది. ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది, ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి. ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది, రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకుంటుంది, తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది. పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది, దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది. మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు, ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు. ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు. ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు, అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు. ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది, వర్తకులకు నడికట్లను అమ్ముతుంది. బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది; ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు. ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది. ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది, పని చేయకుండ ఆమె భోజనం చేయదు. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు; ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు: “చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు, కాని వారందరినీ నీవు మించినదానవు.” అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం; యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది. చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది, ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.

షేర్ చేయి
Read సామెతలు 31