కీర్తనలు 130:1-8
కీర్తనలు 130:1-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా, అగాధస్థలములలోనుండి నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచినయెడల ప్రభువా, ఎవడు నిలువగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీయొద్ద క్షమాపణ దొరుకును. యెహోవాకొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయనకొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాటమీద నేను ఆశపెట్టుకొనియున్నాను. కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ఇశ్రాయేలూ, యెహోవామీద ఆశపెట్టుకొనుము యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.
కీర్తనలు 130:1-8 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
యెహోవా, లోతైన స్థలంలో నుండి నేను మీకు మొరపెడతాను; ప్రభువా, నా స్వరం వినండి. దయ కోసం నేను చేసే మొర మీ చెవులు శ్రద్ధతో విననివ్వండి. యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు? కాని మీ దగ్గర క్షమాపణ లభిస్తుంది, కాబట్టి మేము భయభక్తులు కలిగి మిమ్మల్ని సేవించగలము. యెహోవా కోసం నేను ఉన్నాను, ఆయన కోసం నా ప్రాణం కనిపెట్టుకొని ఉంది, ఆయన మాటలో నేను నిరీక్షణ ఉంచాను. కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా అవును, కావలివారు ఉదయం కోసం ఎదురు చూసే దానికన్నా ఎక్కువగా, నేను ప్రభువు కోసం ఎదురు చూస్తున్నాను. ఓ ఇశ్రాయేలూ, యెహోవా మీద నీ నిరీక్షణ ఉంచు, ఎందుకంటే యెహోవా దగ్గర మారని ప్రేమ లభిస్తుంది ఆయన దగ్గర పూర్తి విమోచన దొరుకుతుంది. ఆయనే ఇశ్రాయేలీయులను వారి అన్ని పాపాల నుండి విడిపిస్తారు.
కీర్తనలు 130:1-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా, లోతైన లోయలో ఉండి నేను నిన్ను ప్రాధేయపడుతున్నాను. ప్రభూ, నా ప్రార్థన అంగీకరించు. నేను చేసే ఆర్తనాదం శ్రద్ధగా ఆలకించు. యెహోవా, నువ్వు మా పాపాలను కనిపెట్టి చూసినప్పుడు నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు. అయినప్పటికీ నువ్వు వాళ్ళను క్షమిస్తున్నావు. నీ పట్ల భయభక్తులు కలిగి జీవించేలా చేస్తున్నావు. యెహోవా కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా ప్రాణం ఎదురు చూస్తుంది. ఆయన మాటపైనే ఆశ పెట్టుకున్నాను. రాత్రి కాపలాదారులు ఉదయం కోసం ఎలా ఎదురు చూస్తారో అంతకంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభువు కోసం ఎదురు చూస్తూ ఉంది. యెహోవా జాలిపరుడు. ఇశ్రాయేలూ, యెహోవా మీద ఆశలు నిలుపుకో. ఆయన క్షమించడానికి ఇష్టపడే వాడు. ఇశ్రాయేలువారి పాపాలన్నిటి నుండి విముక్తి కలిగించేది ఆయనే.
కీర్తనలు 130:1-8 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను. కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను. నా ప్రభువా, నా మాట వినుము. సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము. యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే ఒక్క మనిషి కూడా మిగలడు. యెహోవా, నీ ప్రజలను క్షమించుము. అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు. యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను. నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది. యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను. నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను. ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను. ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో. నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది. యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు. మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.