కీర్తనలు 19:7-11
కీర్తనలు 19:7-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును యెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవ లము న్యాయమైనవి. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి తేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి. వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
కీర్తనలు 19:7-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెహోవా నియమించిన ధర్మశాస్త్రం పరిపూర్ణం, అది ప్రాణం తెప్పరిల్లేలా చేస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి. అవి బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తాయి. యెహోవా ఉపదేశాలు న్యాయమైనవి. అవి హృదయాన్ని సంతోషపరుస్తాయి. యెహోవా ఏర్పరచిన నిబంధన శాసనాలు స్వచ్ఛమైనవి. అవి కళ్ళను వెలిగిస్తాయి. యెహోవా భయం స్వచ్ఛమైనది. అది నిత్యం నిలుస్తుంది. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి పూర్తిగా న్యాయమైనవి. అవి బంగారం కంటే మేలిమి బంగారం కంటే విలువ గలవి. తేనె కంటే, తేనెపట్టు నుండి జాలువారే ధారలకంటే తీయనైనవి. వాటివల్ల నీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు. వాటికి లోబడినందువల్ల గొప్ప ప్రతిఫలం ఉంటుంది.
కీర్తనలు 19:7-11 పవిత్ర బైబిల్ (TERV)
యెహోవా ఉపదేశాలు పరిపూర్ణం. అవి దేవుని ప్రజలకు బలాన్నిస్తాయి. యెహోవా ఒడంబడిక విశ్వసించదగింది. జ్ఞానం లేని మనుష్యులకు అది జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవా చట్టాలు సరియైనవి. అవి మనుష్యులను సంతోషపెడ్తాయి. యెహోవా ఆదేశాలు పరిశుద్ధమైనవి. ప్రజలు జీవించుటకు సరైన మార్గాన్ని చూపడానికి అవి కన్నులకు వెలుగునిస్తాయి. యెహోవాను ఆరాధించుట మంచిది. అది నిరంతరము నిలుస్తుంది. యెహోవా తీర్పులు సత్యమైనవి, న్యాయమైనవి. అవి సంపూర్ణంగా సరియైనవి. శ్రేష్ఠమైన బంగారంకంటె యెహోవా ఉపదేశాలను మనము ఎక్కువగా కోరుకోవాలి. సాధారణ తేనె పట్టు నుండి వచ్చే శ్రేష్ఠమైన తేనె కంటె అవి మధురంగా ఉంటాయి. యెహోవా ఉపదేశాలు నీ సేవకుణ్ణి చాలా తెలివిగలవాణ్ణిగా చేస్తాయి. నీ చట్టాలు పాటించేవారు గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు.
కీర్తనలు 19:7-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
యెహోవా ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుంది. యెహోవా కట్టడలు నమ్మదగినవి, అవి సామాన్యులకు జ్ఞానాన్ని ఇస్తాయి. యెహోవా కట్టడలు సరియైనవి, హృదయానికి ఆనందం కలిగిస్తాయి. యెహోవా ఆజ్ఞలు ప్రకాశవంతమైనవి, కళ్లకు కాంతి కలిగిస్తాయి. యెహోవా పట్ల భయం స్వచ్ఛమైనది, నిరంతరం నిలుస్తుంది. యెహోవా శాసనాలు నమ్మదగినవి, అవన్నీ నీతియుక్తమైనవి. అవి బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనవి; తేనె కంటే, తేనెపట్టు నుండి వచ్చే ధారల కంటే మధురమైనవి. వాటి వల్ల మీ సేవకుడు హెచ్చరిక పొందుతాడు; వాటిని పాటించడం వలన గొప్ప బహుమానం దొరుకుతుంది.