ప్రకటన 22:1-21
ప్రకటన 22:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనమునొద్దనుండి ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను; అది నెలనెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయును. ఆ వృక్షముయొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియో గించును. ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, దేవునియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనముచేయుచుందురు; ఆయన నామము వారి నొసళ్లయందుండును. రాత్రి యికనెన్నడు ఉండదు; దీపకాంతియైనను సూర్య కాంతియైనను వారికక్కరలేదు; దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. మరియు ఆ దూత యీలాగు నాతో చెప్పెను– ఈ మాటలు నమ్మకములును సత్యములునై యున్నవి; ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు , త్వరలో సంభవింప వలసినవాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచనవాక్యములను గైకొనువాడు ధన్యుడు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను; నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూతపాదముల యెదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా, అతడు–వద్దుసుమీ, నేను నీతోను, ప్రవక్తలైన నీ సహోదరులతోను, ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొనువారితోను సహదాసుడను; దేవునికే నమస్కారము చేయుమని చెప్పెను. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను–ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములకు ముద్రవేయవలదు; కాలము సమీపమైయున్నది; అన్యాయముచేయు వాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైనవాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనుపరిశుద్ధుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియలచొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను. జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకుకొను వారు ధన్యులు. కుక్కలును మాంత్రికులును వ్యభిచారులును నరహంతకులును విగ్రహారాధకులును అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందురు. సంఘములకోసము ఈ సంగతులనుగూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి యున్నాను. నేను దావీదు వేరుచిగురును సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కయునై యున్నాను. ఆత్మ యు పెండ్లికుమార్తెయు రమ్ము అని చెప్పు చున్నారు; వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పి గొనిన వానిని రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా–ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును; ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల. దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులనుగూర్చి సాక్ష్యమిచ్చువాడు–అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడై యుం డును గాక. ఆమేన్.
ప్రకటన 22:1-21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు. ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకొరకు ఉన్నాయి. అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు. వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది. అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తాడు కనుక వారికి దీపకాంతి కానీ సూర్యకాంతి కానీ అక్కరలేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తు ఉంటారు. అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపాడు” అని చెప్పాడు. “ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపు చుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!” యోహాను అనే నేను ఈ సంగతులను విని చూసాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కనుక దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు. తరువాత అతడు నాతో, “ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది. అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు. “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పని చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. ఆల్ఫా ఒమేగాను నేనే, మొదటి వాడను చివరి వాడను నేనే, ఆది అంతం నేనే! “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కొన్నవారు ధన్యులు. అయితే మాంత్రికులు, లైంగిక ఆశలకు లోనైన వారు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు. “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వుమని నా దూతను పంపాను. నేను దావీదు యొక్క వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.” ఆత్మ మరియు పెండ్లికుమార్తె ఇలా అన్నారు, “రండి!” ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని పిలవండి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి. ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతివానికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తాడు. అలాగే ఈ గ్రంథపు చుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపు చుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తాడు. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలందరికి తోడై ఉండును గాక! ఆమేన్.
ప్రకటన 22:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అప్పుడు జీవజలనదిని ఆ దూత నాకు చూపించాడు. అది స్ఫటికంలా నిర్మలంగా మెరుస్తూ ఉంది. అది దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం నుండీ, ఆ పట్టణం ప్రధాన వీధి మధ్యలో నుండి ప్రవహిస్తుంది. ఆ నదికి రెండు పక్కలా జీవ వృక్షం ఉంది. అది నెల నెలా ఫలిస్తూ, పన్నెండు రకాల పండ్లు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉపయోగపడతాయి. అక్కడ ఇక శాపం అనేది ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయిన సింహాసనం అక్కడ ఉంటుంది. ఆయన సేవకులు ఆయనకు సేవ చేస్తారు. ఆయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళపై ఉంటుంది. రాత్రి ఇక ఎప్పటికీ కలగదు. దీపాల కాంతీ, సూర్యుడి వెలుగూ వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వెలుగై వారిమీద ప్రకాశిస్తూ ఉంటాడు. వారు కలకాలం పరిపాలిస్తారు. ఆ దూత నాతో ఇలా చెప్పాడు, “ఈ మాటలు నమ్మదగ్గవి, సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలో జరగాల్సిన వాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు.” “చూడండి! నేను త్వరగా వస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను స్వీకరించేవాడు ధన్యుడు.” యోహాను అనే నేను ఈ సంగతులన్నీ విన్నాను, చూశాను. అలా నేను వింటూ చూస్తూ ఉన్నప్పుడు వాటిని నాకు చూపిస్తున్న దూతను పూజించడానికి అతని ఎదుట సాష్టాంగపడ్డాను. అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు. అతడు నాతో ఇంకా ఇలా చెప్పాడు, “ఈ పుస్తకంలో ఉన్న ప్రవచన వాక్కులను మూసి ముద్ర వేయవద్దు. ఎందుకంటే సమయం దగ్గర పడింది. అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి. “చూడండి, నేను త్వరగా వస్తున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసిన పనుల ప్రకారం నేనివ్వబోయే ప్రతిఫలం నా దగ్గర ఉంది. ఆల్ఫా, ఓమెగా నేనే. మొదటి వాణ్ణి, చివరి వాణ్ణి నేనే. ప్రారంభాన్నీ ముగింపునీ నేనే. జీవ వృక్ష ఫలాన్ని ఆరగించడానికీ, ఆ పట్టణ ద్వారాల నుండి లోపలికి ప్రవేశించడానికీ యోగ్యులు అయ్యేందుకై తమ వస్త్రాలను ఉతుక్కునే వారు దీవెన పొందిన వారు. పట్టణం బయట కుక్కలూ, మాంత్రికులూ, వ్యభిచారులూ, హంతకులూ, విగ్రహ పూజ చేసేవారూ, అబద్ధాన్ని ప్రేమించి అభ్యాసం చేసేవారూ ఉంటారు. యేసు అనే నేను సంఘాలకు చెప్పడం కోసం ఈ విషయాలను మీకు తెలియజేయడానికి నా దూతను పంపించాను. నేనే దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశవంతమైన వేకువ నక్షత్రాన్నీ. “రా” అంటూ ఆత్మా, పెళ్ళికూతురూ చెబుతున్నారు. వింటున్నవాడూ, “రా” అని చెప్పాలి. దాహం వేసిన వాడు రావాలి. ఇష్టమున్న వ్యక్తి జీవ జలాన్ని ఉచితంగా తీసుకోవచ్చు.” ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు. ఎవడైనా దేనినైనా తీసి వేస్తే దేవుడు ఈ పుస్తకంలో వివరించిన జీవ వృక్షంలోనూ, పరిశుద్ధ పట్టణంలోనూ వాడికి భాగం లేకుండా చేస్తాడు. ఈ సంగతులను గురించి సాక్షమిస్తున్న వాడు, “అవును, త్వరగా వస్తున్నాను” అని అంటున్నాడు. ఆమేన్! ప్రభు యేసూ, త్వరగా రా. ప్రభు యేసు కృప పరిశుద్ధులందరికీ తోడై ఉండుగాక. ఆమేన్.
ప్రకటన 22:1-21 పవిత్ర బైబిల్ (TERV)
ఆ తర్వాత ఆ దేవదూత స్పటికంలా స్వచ్ఛంగా ఉన్న నదిని నాకు చూపాడు. దానిలో జీవజలం ఉంది. ఆ నది దేవుడు మరియు గొఱ్ఱెపిల్ల కూర్చున్న సింహాసనం నుండి మొదలై, పట్టణంలోని గొప్ప వీధి మధ్యనుండి పారుతూ ఉంది. ఆ నదికి యిరువైపులా జీవ వృక్షం ఉంది. ఆ వృక్షానికి పన్నెండు కాపులు కాస్తాయి. ప్రతి నెలా ఆ వృక్షం ఫలాలనిస్తుంది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను నయం చేయటానికి ఉపయోగింపబడుతాయి. ఇక మీదట ఏ శాపం ఉండదు. దేవునికి మరియు గొఱ్ఱెపిల్లకు చెందిన సింహాసనం పట్టణంలో ఉంటుంది. ఆయన భక్తులు ఆయనకు సేవ చేస్తారు. వాళ్ళు ఆయన ముఖం చూస్తారు. ఆయన పేరు వాళ్ళ నొసళ్ళపై ఉంటుంది. ఇక మీదట చీకటి ఉండదు. ప్రభువైన దేవుడు వాళ్ళకు వెలుగునిస్తాడు. కనుక వాళ్ళకు దీపపు వెలుగు కాని, సూర్యుని వెలుగు కాని అవసరం ఉండదు. వాళ్ళు చిరకాలం రాజ్యం చేస్తారు. ఆ దూత నాతో, “ఇవి నమ్మదగినవి, నిజమైనవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడైన ప్రభువు త్వరలోనే జరుగనున్న వాటిని తన సేవకులకు చూపించటానికి తన దూతను పంపాడు. ‘చూడు! నేను త్వరలోనే రాబోతున్నాను. ఈ గ్రంథంలో చెప్పబడిన ప్రవచన వాక్కును ఆచరించే వాడు ధన్యుడు’” అని అన్నాడు. యోహాను అనబడే నేను ఈ విషయం చూసాను. నేను అవి విని, చూసినప్పుడు నాకు యివి చూపిస్తున్న దూతను ఆరాధించటానికి అతని కాళ్ళమీద పడ్డాను. కాని అతడు నాతో, “నేను నీ తోటి సేవకుణ్ణి, నీ సోదరులతో, ప్రవక్తలతో, ఈ గ్రంథంలో ఉన్న సందేశాలు ఆచరించేవాళ్ళతో కలిసి సేవ చేసేవాణ్ణి. నన్ను ఆరాధించకు. దేవుణ్ణి ఆరాధించు” అని అన్నాడు. అతడు యింకా ఈ విధంగా అన్నాడు: “కాలం సమీపిస్తోంది, కనుక ఈ గ్రంథంలోని ప్రవచన వాక్కును రహస్యంగా దాచవద్దు. తప్పు చేసేవాణ్ణి తప్పు చేయనీ! నీచంగా ప్రవర్తించేవాణ్ణి నీచంగా ప్రవర్తించనీ! నీతిగా ఉండేవాణ్ణి నీతిగా ఉండనీ! పవిత్రంగా ఉండేవాణ్ణి పవిత్రంగా ఉండనీ.” “జాగ్రత్త, నేను త్వరలో రాబోతున్నాను. ప్రతి ఒక్కనికి అతడు చేసేవాటిని బట్టి నా దగ్గరున్నదాన్ని బహుమతిగా ఇస్తాను. ఆదియు, అంతమును నేనే. మొదటివాణ్ణి, చివరివాణ్ణి నేనే, ఆరంభాన్ని, సమాప్తాన్ని నేనే. “జీవవృక్షం మీది ఫలాన్ని తినటానికి అర్హత పొందేందుకు, గుమ్మాల ద్వారా పట్టణంలోకి వెళ్ళే అర్హత పొందేందుకు తమ తమ దుస్తుల్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉన్నవాళ్ళు ధన్యులు. పట్టణానికి వెలుపట కుక్కలు, మంత్రగాళ్ళు, అవినీతిపరులు, హంతకులు, విగ్రహారాధికులు, అసత్యాన్ని ప్రేమించి జీవించేవాళ్ళు రకరకాల మనుష్యులు ఉంటారు. “నేను యేసును. ఈ విషయాన్ని సంఘాలకు చెప్పటానికి నా దూతను నీ దగ్గరకు పంపాను. నేను వేరును, దావీదు వంశాంకురాన్ని, ప్రకాశించే వేకువచుక్కను.” ఆత్మ మరియు పెళ్ళికుమార్తె “రండి” అని అంటున్నారు. ఇది విన్నవాడు “రండి!” అనాలి. దాహంతో ఉన్నవాళ్ళు రావచ్చును. ఇష్టమున్నవాడు ఉచితంగా లభించే జీవజలాన్ని త్రాగవచ్చు. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్కును వినే ప్రతి ఒక్కణ్ణి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఒకవేళ ఎవరైనా దీనికి ఏదైనా చేర్చితే, ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు వాని మీదకు వస్తాయి. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథంనుండి ఏవైనా మాటలు తీసి వేస్తే, ఈ గ్రంథంలో వర్ణింపబడిన జీవవృక్షంలో, పవిత్ర పట్టణంలో అతనికున్న హక్కును దేవుడు తీసివేస్తాడు. యేసు ఇవన్నీ నిజమని చెపుతున్నాడు. ఇప్పుడు ఆయన, “ఔను, నేను త్వరలోనే వస్తాను” అని అంటున్నాడు. ఆమేన్! రండి యేసు ప్రభూ! యేసు ప్రభువు అనుగ్రహం దేవుని జనులపై ఉండుగాక. ఆమేన్.
ప్రకటన 22:1-21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తున్న స్వచ్ఛమైన స్ఫటికం లాంటి జీవజలనది నాకు చూపించాడు. ఆ నది ఆ పట్టణపు ప్రధాన వీధి మధ్యన ప్రవహిస్తుంది. ఆ నదికి ఇరువైపుల జీవవృక్షం ఉంది. అది ప్రతి నెల ఫలాన్ని ఇస్తూ పన్నెండు పంటలను ఇస్తుంది. ఇంకా ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థత కోసం ఉన్నాయి. అక్కడ ఏ శాపం ఉండదు. దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఆ పట్టణంలో ఉంటాయి. ఆయన సేవకులు ఆయనను సేవిస్తుంటారు. వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది. అక్కడ రాత్రి ఉండదు. ప్రభువైన దేవుడే వారికి కాంతిని ఇస్తారు కాబట్టి వారికి దీపకాంతి గాని సూర్యకాంతి గాని అవసరం లేదు. వారు ఎల్లకాలం పరిపాలిస్తూ ఉంటారు. అప్పుడు ఆ దేవదూత నాతో, “ఈ మాటలు నమ్మదగినవి సత్యమైనవి. ప్రవక్తల ఆత్మలను ప్రేరేపించే ప్రభువైన దేవుడు తన సేవకులకు త్వరలో జరుగబోయే సంగతులను చూపించడానికి తన దూతను పంపారు” అని చెప్పాడు. “ఇదిగో, నేను త్వరగా వస్తున్నాను! ఈ గ్రంథపుచుట్టలో ప్రవచించిన మాటలను పాటించేవారు ధన్యులు!” యోహాను అనే నేను ఈ సంగతులను విని చూశాను. నేను వాటిని విని చూసినప్పుడు, నాకు వాటిని చూపిస్తున్న దేవదూతను ఆరాధించడానికి అతని పాదాల ముందు సాష్టాంగపడ్డాను. కాని అతడు నాతో, “నీవు అలా చేయవద్దు! ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన మాటలను పాటించేవారిలా, నీ తోటి ప్రవక్తల్లా నేను కూడా నీ తోటి సేవకుడనే. కాబట్టి దేవున్నే ఆరాధించు!” అని చెప్పాడు. తర్వాత అతడు నాతో, “ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను ముద్ర వేయకు ఎందుకంటే సమయం సమీపంగా ఉంది. అన్యాయం చేసేవారిని అన్యాయం చేయనివ్వు, దుష్టుడిని దుష్టునిలా కొనసాగనివ్వు, నీతి క్రియలు చేసేవారిని నీతి క్రియలను చేస్తూ ఉండనివ్వు, పరిశుద్ధులను పరిశుద్ధులుగా కొనసాగనివ్వు” అని చెప్పాడు. “ఇదిగో! నేను త్వరగా వస్తున్నాను! ప్రతివారికి వారు చేసిన పనుల చొప్పున వారికి ఇవ్వడానికి నా ప్రతిఫలం నా దగ్గర ఉంది. అల్ఫా ఒమేగాను నేనే, మొదటివాడను చివరివాడను నేనే, ఆది అంతం నేనే! “జీవ వృక్షానికి హక్కు పొంది, ద్వారాల గుండా పట్టణంలోనికి ప్రవేశించేలా తమ వస్త్రాలను ఉతుక్కున్నవారు ధన్యులు. అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు. “యేసు అనే నేను సంఘాల కోసమైన ఈ సాక్ష్యం మీకు ఇవ్వమని నా దూతను పంపాను. నేను దావీదు వేరును సంతానాన్ని, ప్రకాశవంతమైన వేకువ చుక్కను.” “రండి!” అని ఆత్మ, పెండ్లికుమార్తె అంటున్నారు. ఈ మాటలు వింటున్నవారు, “రండి!” అని చెప్పాలి. దప్పికగల వారందరు రండి; ఆశపడినవారు జీవజలాన్ని ఉచితంగా పొందుకోండి. ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన ప్రవచనాలను వినే ప్రతిఒక్కరికి నేను ఖచ్చితంగా హెచ్చరించేది ఏమంటే: ఎవరైనా ఈ ప్రవచనాలకు దేనినైనా కలిపితే ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన తెగుళ్ళను దేవుడు వానిపైకి రప్పిస్తారు. అలాగే ఈ గ్రంథపుచుట్టలో ప్రవచనం నుండి ఏ మాటలనైనా తీసివేస్తే దేవుడు వానికి ఈ గ్రంథపుచుట్టలో వ్రాయబడిన పరిశుద్ధ పట్టణంలోని జీవవృక్ష ఫలంలో ఏ భాగం లేకుండా చేస్తారు. ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు! ప్రభువైన యేసు కృప దేవుని ప్రజలతో ఉండును గాక ఆమేన్.