రోమా 12:1-8 - అన్ని సంస్కరణలను పోల్చండి

రోమా 12:1-8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి. తన్నుతాను ఎంచుకొనతగినదానికంటె ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొకనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవా డగుటకై తగినరీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను, ఈ అవయవములన్నిటికిని ఒక్కటే పని యేలాగు ఉండదో, ఆలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై యున్నాము. మన కనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగినవారమై యున్నాము గనుక, ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణముచొప్పున ప్రవచింతము; పరిచర్యయైతే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగియుందము. పంచిపెట్టువాడు శుద్ధమనస్సుతోను, పైవిచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను.

షేర్ చేయి
రోమా 12 TELUBSI

రోమా 12:1-8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కాబట్టి సోదరులారా, దేవుని ప్రేమతో మిమ్మల్ని బతిమాలుతున్నాను, పవిత్రమూ, దేవునికి ఇష్టమైన సజీవయజ్ఞంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి. ఇది మీరు చేసే ఆత్మ సంబంధమైన సేవ. మీరు ఈ లోక విధానాలను అనుసరించవద్దు. మీ మనసు మారి నూతనమై, రూపాంతరం పొందడం ద్వారా మంచిదీ, తగినదీ, పరిపూర్ణమైనదీ అయిన దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను చెబుతున్నదేమంటే, మీలో ఎవరూ తనను తాను ఎంచుకోదగినంత కంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం ప్రకారం, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మీరు తగిన రీతిగా ఎంచుకోండి. ఎలాగంటే ఒక్క శరీరంలో మనకు అనేక అవయవాలున్నప్పటికీ, వాటన్నిటికీ ఒక్కటే పని ఉండదు. అలాగే మనం అనేకులమైనా క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి, ఒకరికొకరం ప్రత్యేకంగా అవయవాలుగా ఉన్నాము. దేవుడు మనకనుగ్రహించిన కృప ప్రకారం వివిధ రకాల కృపావరాలు కలిగి ఉన్నాము. కాబట్టి, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం ప్రకారం ప్రవచించాలి. పరిచర్య వరం ఉన్న వాడు పరిచర్య చేయాలి. బోధించే వరం ఉన్నవాడు బోధించాలి. ప్రోత్సహించేవాడు ప్రోత్సహించడంలో తన వరం ఉపయోగించాలి. పంచిపెట్టేవాడు ధారాళంగా పంచిపెట్టాలి.

షేర్ చేయి
రోమా 12 IRVTEL

రోమా 12:1-8 TERV (పవిత్ర బైబిల్)

అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు! దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది. దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.

షేర్ చేయి
రోమా 12 TERV

రోమా 12:1-8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

కాబట్టి, సహోదరీ సహోదరులారా, పరిశుద్ధమైనది దేవుని సంతోషపరచే సజీవయాగాలుగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోమని దేవుని కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇదే మీ నిజమైన సరియైన ఆరాధన. ఈ లోకపు తీరును అనుసరించవద్దు కాని మీ మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మార్పు చెందండి. అప్పుడు మీరు మంచిదైన, సంతోషకరమైన పరిపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోగలరు. నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో అందరికి నేను చెప్పేదేమిటంటే, మీరు ఉండవలసిన దానికన్నా మిమ్మల్ని మీరు ఎక్కువగా భావించవద్దు కాని, దేవుడు మీలో అందరికి పంచి ఇచ్చిన విశ్వాసం ప్రకారం మీ గురించి మీరు వివేకం కలిగి అంచనా వేసుకోండి. ఎలాగైతే మనకు ఉన్న ఒకే శరీరంలో అనేక అవయవాలు ఉన్నా అవన్నీ ఒకే పని ఎలా చేయవో, అలాగే మనం అనేకులమైనప్పటికీ క్రీస్తులో ఒక్క శరీరంగా ఉన్నాము, ప్రతి ఒక్కరు మిగిలిన వారందరికి సంబంధించినవారే. మనలో అందరికి అనుగ్రహించబడిన కృపను బట్టి మనం వేరు వేరు కృపావరాలు కలిగి ఉన్నాము. నీ కృపావరం ప్రవచనా వరమైతే నీ విశ్వాసానికి అనుగుణంగా ప్రవచించు. ఆ కృపావరం సేవచేయడమైతే సేవ చేయి. ఆ కృపావరం బోధించడమైతే బోధించు; ఒకవేళ అది ప్రోత్సహించడమైతే ప్రోత్సహించు; ఒకవేళ అది దానం చేయడమైతే ధారళంగా దానం చేయి; ఒకవేళ ఇతరులను నడిపించడమైతే శ్రద్ధగా నడిపించు, ఒకవేళ అది కనికరం చూపించడమైతే, సంతోషంగా చూపించండి.

షేర్ చేయి
రోమా 12 TSA