ఆది 30

30
1రాహేలు తనకు పిల్లలు కలగడం లేదు అని గ్రహించి, తన అక్క మీద అసూయ పడింది. కాబట్టి యాకోబుతో, “నాకు పిల్లలను ఇవ్వు లేదా నేను చస్తాను!” అని అన్నది.
2యాకోబు ఆమెపై కోప్పడి, “నేనేమైన నీకు పిల్లలు పుట్టకుండా ఆపిన దేవుని స్థానంలో ఉన్నానా?” అని అన్నాడు.
3అప్పుడు ఆమె, “ఇదిగో, నా దాసి బిల్హా. ఈమెతో వెళ్లు, తద్వార ఆమె నా కోసం పిల్లలను కంటుంది, ఆమె ద్వార నేను కూడా కుటుంబం కట్టుకుంటాను” అని చెప్పింది.
4కాబట్టి తన దాసి బిల్హాను అతనికి భార్యగా ఇచ్చింది. యాకోబు ఆమెతో పడుకున్నాడు. 5బిల్హా గర్భవతియై అతనికి కుమారుని కన్నది. 6అప్పుడు రాహేలు, “దేవుడు నాకు శిక్షావిముక్తి చేశారు; నా మొర విని నాకు కుమారుని ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి దాను#30:6 దాను ఇక్కడ అర్థం ఆయన తీర్పు తీర్చారు అని పేరు పెట్టింది.
7రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది. 8అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి#30:8 నఫ్తాలి అంటే నా పోరాటం అని పేరు పెట్టింది.
9లేయా పిల్లలు కనడం ఆగిపోయింది అని గ్రహించినప్పుడు, తన దాసి జిల్పాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. 10లేయా దాసి జిల్పా యాకోబుకు కుమారున్ని కన్నది. 11అప్పుడు లేయా, “ఎంత భాగ్యం!”#30:11 లేదా “ఒక దళం వస్తుంది!” అని అన్నది. కాబట్టి అతనికి గాదు#30:11 గాదు బహుశ అర్థం మంచి భాగ్యం లేదా దళము. అని పేరు పెట్టింది.
12లేయా దాసి జిల్పా యాకోబుకు మరో కుమారున్ని కన్నది. 13అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు#30:13 ఆషేరు అంటే సంతోషం అని పేరు పెట్టింది.
14గోధుమ కోతకాలంలో రూబేను పొలాలకు వెళ్లాడు, అక్కడ ఉన్న పుత్రదాత వృక్షం పండ్లు కొన్ని తెచ్చి, తల్లి లేయాకు ఇచ్చాడు. రాహేలు లేయాతో, “నీ కుమారుడు తెచ్చిన పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇవ్వు” అని అడిగింది.
15అయితే లేయా ఆమెతో, “నా భర్తను నీవు తీసుకున్నావు, అది చాలదా? ఇప్పుడు నా కుమారుడు తెచ్చిన పండ్లు కూడా కావాలా?” అని అన్నది.
రాహేలు, “సరే, నీ కుమారుడు తెచ్చిన పండ్ల కోసం ఈ రోజు నీతో అతడు పడుకోవచ్చు” అని అన్నది.
16సాయంత్రం యాకోబు పొలం నుండి వచ్చినప్పుడు, లేయా అతన్ని కలవడానికి వెళ్లింది. “నీవు నాతో పడుకోవాలి, నీకోసం నా కుమారుని పండ్లను ఇచ్చాను” అని అతనితో అన్నది. కాబట్టి ఆ రాత్రి అతడు ఆమెతో పడుకున్నాడు.
17దేవుడు లేయా మనవి విన్నారు, ఆమె గర్భవతియై అయిదవ కుమారున్ని కన్నది. 18అప్పుడు లేయా, “నా భర్తకు నా దాసిని ఇచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చారు” అని అన్నది. కాబట్టి అతనికి ఇశ్శాఖారు#30:18 ఇశ్శాఖారు హెబ్రీ పదంలా ఉంది ప్రతిఫలం అని పేరు పెట్టింది.
19ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది. 20అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను#30:20 జెబూలూను బహుశ అర్థం ఘనత అని పేరు పెట్టింది.
21కొంతకాలం తర్వాత ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమెకు దీనా అని పేరు పెట్టింది.
22తర్వాత దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నారు; ఆయన ఆమె మనవి విన్నారు, ఆమెకు పిల్లలు పుట్టేలా చేశారు. 23ఆమె గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “దేవుడు నా నిందను తొలగించారు” అని అన్నది. 24ఆమె అతనికి యోసేపు#30:24 యోసేపు అంటే ఆయన మరలా ఇచ్చును గాక అని పేరు పెట్టి, “యెహోవా నాకు ఇంకొక కుమారుని కూడా ఇచ్చును గాక” అని అన్నది.
యాకోబు మందలు అధికమగుట
25రాహేలు యోసేపుకు జన్మనిచ్చిన తర్వాత, యాకోబు లాబానుతో, “నేను నా స్వదేశానికి వెళ్తాను, నన్ను పంపించు. 26నా భార్యలను, పిల్లలను నాతో పంపించు. వారి కోసమే నేను నీకు సేవ చేశాను, ఇక నేను వెళ్తాను. నేను ఎంతగా నీకోసం పని చేశానో నీకు తెలుసు” అని అన్నాడు.
27అయితే లాబాను, “నీకు నాపై దయ ఉంటే, దయచేసి ఉండు. నిన్ను బట్టి యెహోవా నన్ను దీవించారని నేను భవిష్యవాణి ద్వార తెలుసుకున్నాను. 28నీకెంత జీతం కావాలో అడుగు, ఇస్తాను” అని అన్నాడు.
29యాకోబు అతనితో, “నీకోసం ఎంత పని చేశానో, నా ఆధీనంలో నీ మంద ఎంత ఎదిగిందో నీకు తెలుసు. 30నేను రాకముందు నీకున్న కొంచెం ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినది, నేను ఏ చోట ఉన్నా యెహోవా నిన్ను దీవించారు. అయితే, నా సొంత ఇంటివారి కోసం నేను ఎప్పుడు సంపాదించుకోవాలి?” అని అన్నాడు.
31లాబాను, “నీకు ఏమివ్వాలి?” అని అడిగాడు.
అందుకు యాకోబు, “నాకు ఈ ఒక్కటి చేస్తే చాలు వేరే ఏమి అక్కర్లేదు. నేను నీ మందను కాపాడుతూ మేపుతాను: 32ఈ రోజు నేను నీ మందలన్నిటి మధ్య గుండా వెళ్లి పొడలు, మచ్చలు ఉన్న ప్రతి గొర్రెను, గొర్రెపిల్లలలో నల్లవాటిని, మేకలలో మచ్చలు, పొడలు గలవాటిని వేరు చేస్తాను. వాటిని నాకు జీతంగా ఇవ్వు. 33నీవు నాకు జీతంగా ఇచ్చిన వాటిని పరిశీలించడానికి వచ్చినప్పుడు నేను యథార్థంగా ఉన్నట్లు నీవు చూస్తావు. మచ్చలు, పొడలు లేని మేకలు లేదా నల్ల గొర్రెపిల్లలు నా దగ్గర ఉంటే, అవి నేను దొంగిలించాను అని గ్రహించ వచ్చు” అని అన్నాడు.
34లాబాను, “సరే, నీ మాట ప్రకారమే కానివ్వు” అని అన్నాడు. 35ఆ రోజే లాబాను చారలు, మచ్చలు ఉన్న మేకపోతులన్నిటిని పొడలు, మచ్చలు ఉన్న ఆడ మేకలను (తెల్ల మచ్చలు ఉన్నవాటిని), గొర్రెపిల్లలలో నల్లవాటిని వేరుచేసి వాటిని తన కుమారులకు అప్పగించాడు. 36అప్పుడు అతడు, తనకు యాకోబుకు మధ్య మూడు రోజుల ప్రయాణమంత దూరం పెట్టాడు. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపడం కొనసాగించాడు.
37అయితే యాకోబు చినారు, బాదం, సాలు అనే చెట్ల కొమ్మలను తీసుకుని ఆ కొమ్మల్లో తెల్లచారలు కనబడేలా అక్కడక్కడ వాటి తొక్కలను ఒలిచాడు. 38తర్వాత అతడు మందలు నీళ్లు త్రాగడానికి వచ్చినప్పుడు అవి చూలు కట్టాలని ఒలిచిన కొమ్మలను వాటి ఎదురుగా ఉండేలా నీళ్లగాళ్లలో పెట్టాడు. మందలు వేడి మీద ఉన్నప్పుడు నీళ్లు త్రాగడానికి వచ్చాయి. 39అక్కడ అవి ఆ కొమ్మల ముందు చూలు కట్టి చారలు, మచ్చలు, పొడలు ఉన్న పిల్లలను ఈనాయి. 40యాకోబు మందలో చిన్నవాటిని వేరు చేశాడు, కానీ మిగితా వాటిని లాబాను మందలోని చారలు ఉన్నవాటి వైపు, నల్లనివాటివైపు వాటి ముఖాలు త్రిప్పి ఉంచాడు. ఇలా తన కోసం వేరే మందను చేసుకున్నాడు, వాటిని లాబాను మందలతో కలపలేదు. 41మందలలో బలమైన ఆడవి వేడి మీద ఉన్నప్పుడు, అవి కొమ్మల దగ్గర చూలు కట్టేలా యాకోబు ఆ కొమ్మలను వాటికి ఎదురుగా నీటి తొట్టిలో పెట్టేవాడు. 42ఒకవేళ పశువులు బలహీనంగా ఉంటే, వాటిని అక్కడ పెట్టేవాడు కాదు. కాబట్టి బలహీనమైనవి లాబానుకు వెళ్లాయి, బలమైనవి యాకోబుకు వచ్చాయి. 43ఈ విధంగా యాకోబు ఎంతో అభివృద్ధి చెందాడు, గొప్ప మందలను, దాసదాసీలను, ఒంటెలను, గాడిదలను సొంతం చేసుకున్నాడు.

ที่ได้เลือกล่าสุด:

ఆది 30: OTSA

เน้นข้อความ

แบ่งปัน

คัดลอก

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้