ఆది 42
42
యోసేపు సోదరులు ఈజిప్టుకు వెళ్తారు
1యాకోబు ఈజిప్టులో ధాన్యం ఉందని తెలుసుకుని, తన కుమారులతో, “ఎందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉన్నారు? 2ఈజిప్టులో ధాన్యం ఉందని నేను విన్నాను. అక్కడికి వెళ్లి మన కోసం కొంత ధాన్యం కొనుక్కురండి, అప్పుడు మనం చావకుండ బ్రతుకుతాం” అని అన్నాడు.
3అప్పుడు యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వెళ్లారు. 4అయితే యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును పంపలేదు ఎందుకంటే అతనికి ఏదైన హాని కలుగుతుందని భయపడ్డాడు. 5కాబట్టి ఇశ్రాయేలు కుమారులు కూడా ధాన్యం కొనుగోలు చేయడానికి వచ్చారు ఎందుకంటే, కనాను దేశంలో కూడా కరువు వచ్చింది.
6అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారిగా ఉంటూ, ఆ దేశ ప్రజలందరికి ధాన్యం అమ్మేవాడు. యోసేపు అన్నలు వచ్చి అతనికి సాష్టాంగపడి నమస్కారం చేశారు. 7యోసేపు వారిని చూసిన వెంటనే, వారిని గుర్తుపట్టాడు కాని తెలియనట్లుగా నటిస్తూ వారితో కఠినంగా మాట్లాడాడు. “మీరెక్కడ నుండి వచ్చారు?” అని అతడు అడిగాడు.
వారు, “కనాను దేశం నుండి ఆహారం కొనడానికి వచ్చాం” అని జవాబిచ్చారు.
8యోసేపు తన అన్నలను గుర్తుపట్టాడు కాని వారతన్ని గుర్తు పట్టలేదు. 9వారి గురించి తాను కన్న కలలు యోసేపు జ్ఞాపకం చేసుకుని, “మీరు వేగులవారు. మా దేశానికి చెందిన భద్రత రహస్యాలు తెలుసుకోడానికి వచ్చారు” అని వారితో అన్నాడు.
10వారు, “లేదు ప్రభువా, మీ దాసులమైన మేము ఆహారం కొనడానికి వచ్చాము. 11మేమంతా ఒక్క మనుష్యుని కుమారులము. నీ దాసులమైన మేము యథార్థవంతులం, వేగులవారం కాము” అని అన్నారు.
12“లేదు! మా దేశ భద్రత రహస్యాలు తెలుసుకోవడానికి వచ్చారు” అని యోసేపు వారితో అన్నాడు.
13అందుకు వారు, “నీ దాసులమైన మేము పన్నెండుమంది అన్నదమ్ములం, ఒక్క మనుష్యుని కుమారులం, కనాను దేశంలో నివసిస్తాము. మాలో చిన్నవాడు మా తండ్రి దగ్గరే ఉన్నాడు, ఇంకొకడు చనిపోయాడు” అన్నారు.
14అప్పుడు యోసేపు వారితో, “నేను మీతో చెప్పిందే నిజం: మీరు వేగులవారే! 15ఫరో జీవం తోడు, మీ తమ్ముడు ఇక్కడకు వస్తేనే తప్ప మీరు ఈ స్థలం విడిచి వెళ్లడానికి వీల్లేదు. 16మీ తమ్మున్ని తీసుకురావడానికి మీలో ఒకర్ని పంపి మిగిలినవారు జైల్లో ఉండాలి, అప్పుడు మీ మాటల్లో సత్యం ఉందో లేదో తెలుస్తుంది. ఒకవేళ లేకపోతే ఫరో జీవం తోడు, మీరు వేగులవారే!” అని అన్నాడు. 17అతడు వారిని మూడు రోజుల వరకు జైల్లో ఉంచాడు.
18మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని: 19మీరు నిజంగా యథార్థవంతులైతే, మీ సోదరులలో ఒకరిని ఇక్కడ చెరసాలలో ఉండనివ్వండి, మిగితా వారు ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ధాన్యం తీసుకెళ్లండి. 20అయితే మీ చిన్న తమ్మున్ని నా దగ్గరకు తీసుకురావాలి, అప్పుడు మీ మాటలు స్థిరపరచబడతాయి, మీరు చావరు” అని అన్నాడు. వారు అలానే చేశారు.
21అప్పుడు వారు ఒకరితో ఒకరు, “మన తమ్మున్ని బట్టి మనం ఇలా శిక్షించబడుతున్నాము. తనను చంపవద్దని అతడు మనలను ఎంత వేడుకున్నా మనం వినలేదు అప్పుడు అతడు ఎంత బాధపడ్డాడో చూశాం; మనం చేసిన ఆ దోషం వల్లే ఇప్పుడు మనకు ఈ దుస్థితి వచ్చింది” అని మాట్లాడుకున్నారు.
22రూబేను జవాబిస్తూ, “ఈ చిన్నవాని పట్ల పాపం చేయవద్దని నేను చెప్పలేదా? అయినా మీరు వినిపించుకోలేదు! ఇప్పుడు తన రక్తం కోసం మనం లెక్క అప్పగించాలి” అన్నాడు. 23యోసేపు దగ్గర భాషను తర్జుమా చేసేవాడు ఉన్నాడని అతడు వారి మాటలు అర్థం చేసుకోగలడని వారు గ్రహించలేదు.
24యోసేపు వారి దగ్గర నుండి వెళ్లి ఏడ్చి తిరిగివచ్చి వారితో మళ్ళీ మాట్లాడాడు. వారిలో నుండి షిమ్యోనును పట్టుకుని వారి కళ్లముందే బంధించాడు.
25యోసేపు వారి సంచుల్లో ధాన్యం నింపి, ఎవరి బస్తాలో వారి వెండిని తిరిగి పెట్టి, ప్రయాణంలో వారికి అవసరమైన భోజనపదార్థాలు ఇవ్వుమని ఆదేశించాడు. 26వారు తమ ధాన్యాన్ని తమ గాడిదల మీద పెట్టుకుని వెళ్లిపోయారు.
27రాత్రి గడపడానికి ఒక స్థలంలో ఆగినప్పుడు, వారిలో ఒకడు గాడిదకు మేతపెడదామని సంచి విప్పాడు, గోనెసంచి విప్పగానే అందులో తన వెండి ఉండడం చూశాడు. 28“నా వెండి నాకు తిరిగి ఇవ్వబడింది, నా గోనెసంచిలోనే అది ఉంది” అని సోదరులకు చెప్పాడు.
వారి హృదయాలు కలవరపడ్డాయి. వారు వణకుతూ, ఒకరి వైపు ఒకరు తిరిగి, “దేవుడు మనకిలా చేశారేంటి?” అని చెప్పుకున్నారు.
29వారు కనాను దేశంలో తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చినప్పుడు, తమకు జరిగిందంతా అతనికి చెప్పారు. వారు అన్నారు, 30“ఆ దేశాధిపతి మాతో కఠినంగా మాట్లాడాడు, మేము ఆ దేశానికి వేగుచూడటానికి వచ్చామని అనుకున్నాడు. 31అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. 32మేము పన్నెండుమంది సోదరులం, ఒక తండ్రి కుమారులము. ఒకడు చనిపోయాడు, కనిష్ఠుడు కనానులో తండ్రి దగ్గర ఉన్నాడు’ అని చెప్పాము.
33“ఆ దేశాధిపతి మాతో, ‘ఇలా మీరు యథార్థవంతులని నాకు తెలుస్తుంది: మీ సోదరులలో ఒకరిని ఇక్కడ నా దగ్గర వదిలేసి, ఆకలితో ఉన్న మీ ఇంటివారికి ఆహారం తీసుకెళ్లండి. 34కాని మీ తమ్మున్ని నా దగ్గరకు తీసుకురండి, తద్వారా మీరు యథార్థవంతులని తెలుసుకుంటాను. అప్పుడు మీ సోదరుని తిరిగి ఇచ్చేస్తాను, ఈ దేశంలో మీరు వ్యాపారం#42:34 లేదా స్వేచ్ఛగా తిరగవచ్చు చేసుకోవచ్చు’ అన్నాడు.”
35వారు తమ గోనెసంచులను ఖాళీ చేస్తుండగా, ఎవరి గోనెసంచిలో వారి వెండి మూట ఉంది. వారు, వారి తండ్రి, వారి డబ్బు మూటలు చూసి భయపడిపోయారు. 36వారి తండ్రి యాకోబు వారితో, “మీరు నన్ను పిల్లలు కోల్పోయేలా చేశారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనును కూడా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ప్రతిదీ నాకు వ్యతిరేకంగా ఉంది!” అని అన్నాడు.
37అప్పుడు రూబేను తన తండ్రితో, “నేను బెన్యామీనును తిరిగి నీ దగ్గరకు తీసుకురాకపోతే, నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చు. అతన్ని నాకు అప్పగించు, నేను తిరిగి అతన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను” అన్నాడు.
38అయితే యాకోబు, “నా కుమారుడు నీతో అక్కడికి రాడు; అతని అన్న చనిపోయాడు, మిగిలింది ఒక్కడే. మీరు వెళ్లే ప్రయాణంలో ఏదైన హాని జరిగితే, మీరు నెరిసిన వెంట్రుకలతో ఉన్న నన్ను దుఃఖంలో సమాధికి తీసుకెళ్తారు” అని అన్నాడు.
ที่ได้เลือกล่าสุด:
ఆది 42: OTSA
เน้นข้อความ
แบ่งปัน
คัดลอก
ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้
Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం™
ప్రచురణ హక్కులు © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.
Biblica® Open Telugu Contemporary Version™
Copyright © 1976, 1990, 2022, 2024 by Biblica, Inc.