ఆది 49

49
యాకోబు తన కుమారులను దీవించుట
1యాకోబు తన కుమారులను పిలిపించి ఇలా అన్నాడు: “చుట్టూ కూడి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏమి జరగబోతుందో నేను మీకు చెప్తాను.
2“యాకోబు కుమారులారా, సమావేశమై వినండి
మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి.
3“రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు,
నా శక్తి నా బలం యొక్క మొదటి గుర్తు,
ఘనతలోను శక్తిలోను ఆధిక్యత గలవాడవు
4కానీ నీళ్లలా అస్థిరంగా ఉండే నీవు ఇకపై రాణించవు,
ఎందుకంటే నీవు నీ తండ్రి మంచం ఎక్కావు,
నా పడకను అపవిత్రం చేశావు.
5“షిమ్యోను లేవీ సోదరులు
వారి ఖడ్గాలు హింసాయుధాలు.
6వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక,
నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక,
ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు
సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు.
7వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది,
వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది!
వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను,
ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
8“యూదా, నీ సోదరులు నిన్ను ప్రశంసిస్తారు;
నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది;
నీ తండ్రి కుమారులు నీకు తలవంచుతారు
9యూదా, నీవు ఒక కొదమసింహం;
నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు.
అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని,
ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు?
10రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు,
అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు,
అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు,
దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.
11అతడు ద్రాక్షచెట్టుకు తన గాడిదను,
మంచి ద్రాక్షచెట్టుకు గాడిద పిల్లను కడతాడు;
అతడు ద్రాక్షరసంలో తన బట్టలను,
ద్రాక్షరసంలో తన వస్త్రాలను ఉతుకుతాడు.
12అతని కళ్లు ద్రాక్షరసం కంటే ఎర్రగా,
అతని పళ్లు పాలకంటే తెల్లగా ఉంటాయి.
13“జెబూలూను సముద్రతీరాన నివసిస్తాడు
ఓడలకు రేవు అవుతాడు;
అతని సరిహద్దు సీదోను వరకు వ్యాపిస్తుంది.
14“ఇశ్శాఖారు రెండు గొర్రెల దొడ్ల మధ్య
పడుకుని ఉన్న బలమైన గాడిద వంటివాడు.
15అతడు తన విశ్రాంతి స్థలం ఎంత మంచిదో,
అతని నేల ఎంత ఆహ్లాదకరమో చూసినప్పుడు,
అతడు భుజం వంచి శ్రమించి,
వెట్టిచాకిరికి సమర్పించుకుంటాడు.
16“దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంలా
తన ప్రజలకు న్యాయం చేస్తాడు.
17దాను దారిన ఉండే పాములా,
మార్గంలో ఉండే విషసర్పంలా,
గుర్రాల మడిమెలు కాటు వేస్తాడు.
అప్పుడు స్వారీ చేస్తున్నవాడు వెనుకకు పడతాడు.
18“యెహోవా! మీ రక్షణ కోసం వేచియున్నాను.
19“గాదు దోపిడి మూక ద్వారా దాడి చేయబడతాడు,
కానీ అతడు వారి మడిమెలను కొడతాడు.
20“ఆషేరుకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది;
రాజులకు తగిన భోజనం అతడు సమకూరుస్తాడు.
21“నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి
అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు.#49:21 లేదా స్వేచ్ఛ అతడు మధురమైన మాటలు పలుకుతాడు
22“యోసేపు ఫలించే కొమ్మ,
నీటిబుగ్గ దగ్గర ఫలించే కొమ్మ
దాని తీగెలు గోడ మీదికి ఎక్కి ప్రాకుతాయి.
23అసూయతో విలుకాండ్రు అతనిపై దాడి చేశారు;
అతనిపై బాణాలు విసిరారు.
24కానీ అతని విల్లు స్థిరంగా నిలిచింది,
అతని చేతులు బలంగా ఉన్నాయి,
ఎందుకంటే యాకోబు యొక్క బలవంతుని హస్తాన్ని బట్టి,
కాపరి, ఇశ్రాయేలు యొక్క బండను బట్టి,
25నీకు సహాయం చేసే నీ తండ్రి యొక్క దేవున్ని బట్టి,
పైనున్న ఆకాశాల దీవెనలతో,
క్రింది అగాధజలాల దీవెనలతో,
స్తనాల దీవెనలతో గర్భం యొక్క దీవెనలతో,
నిన్ను ఆశీర్వదించే సర్వశక్తిమంతున్ని బట్టి బలపరచబడ్డాయి.
26నీ తండ్రి ఆశీర్వాదాలు
పురాతన పర్వత ఆశీర్వాదాల కంటే,
ప్రాచీన కొండల యొక్క కోరదగిన వాటికంటే గొప్పవి.
ఇవన్నీ యోసేపు తలమీద,
తన సోదరులలో అధికారిగా ఉన్న వాడిపై ఉండాలి.
27“బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు;
ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు,
సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”
28ఇవన్నీ ఇశ్రాయేలు యొక్క పన్నెండు గోత్రాలు. వారి తండ్రి ఎవరి దీవెన ప్రకారం వారిని దీవిస్తూ వారికి చెప్పింది అదే.
యాకోబు మరణం
29-30తర్వాత అతడు వారికి ఈ సూచనలు ఇచ్చాడు: “నేను నా జనుల దగ్గరకు చేరబోతున్నాను. మీరు నన్ను నా పూర్వికుల దగ్గర, హిత్తీయుడైన ఎఫ్రోను గుహలో, కనానులో మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో, అంటే అబ్రాహాము సమాధి స్థలంగా హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర పొలంతో పాటు కొన్న గుహలో పాతిపెట్టండి. 31అక్కడే అబ్రాహాము అతని భార్య శారా సమాధి చేయబడ్డారు, అక్కడే ఇస్సాకు అతని భార్య రిబ్కా సమాధి చేయబడ్డారు, అక్కడే నేను లేయాను సమాధి చేశాను. 32ఆ పొలం, అందులోని గుహ హిత్తీయుల దగ్గర కొనబడ్డాయి.”
33యాకోబు తన కుమారులకు సూచనలు ఇచ్చిన తర్వాత, మంచంపై తన కాళ్లు ముడుచుకుని తుది శ్వాస విడిచాడు, తన ప్రజల దగ్గరకు చేర్చబడ్డాడు.

ที่ได้เลือกล่าสุด:

ఆది 49: OTSA

เน้นข้อความ

แบ่งปัน

คัดลอก

None

ต้องการเน้นข้อความที่บันทึกไว้ตลอดทั้งอุปกรณ์ของคุณหรือไม่? ลงทะเบียน หรือลงชื่อเข้าใช้