మత్తయి సువార్త 14

14
బాప్తిస్మమిచ్చే యోహాను తల వధించబడుట
1ఆ సమయంలో చతుర్థాధిపతియైన హేరోదు యేసును గురించి విని, 2తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చే యోహాను; చనిపోయి మళ్ళీ బ్రతికాడు. అందుకే ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని అన్నాడు.
3హేరోదు రాజు తన సొంత సోదరుడైన ఫిలిప్పు భార్య హేరోదియ కోసం యోహానును బంధించి చెరసాలలో వేయించాడు. 4ఎందుకంటే అంతకుముందు యోహాను హేరోదుతో: “నీవు ఆమెను ఉంచుకోవడం న్యాయం కాదు” అని చెప్పాడు. 5కాబట్టి హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేకపోయాడు.
6అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది. 7కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు. 8ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. 9రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులను బట్టి తాను చేసిన ప్రమాణం కోసం ఆమె కోరినట్లు చేయమని ఆదేశించాడు. 10అలా తన రక్షకభటులను పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. 11వారు బాప్తిస్మమిచ్చే యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చినప్పుడు ఆమె తీసుకెళ్లి తన తల్లికి ఇచ్చింది. 12యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేశారు.
యేసు అయిదు వేలమందికి ఆహారం పెట్టుట
13యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడినుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. ఆ సంగతి విని పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు. 14యేసు పడవ దిగి గొప్ప జనసమూహం రావడం చూసి వారి మీద కనికరపడి వారిలో రోగాలతో ఉన్నవారిని స్వస్థపరిచారు.
15సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కాబట్టి జనసమూహాలను పంపివేయండి, వారే చుట్టుప్రక్కల గ్రామాలకు వెళ్లి భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
16యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు.
17వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర అయిదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.
18ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు. 19వారిని పచ్చగడ్డి మీద కూర్చోపెట్టమని చెప్పి ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకుని ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు. 20వారందరు తృప్తిగా తిన్నారు. తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 21తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
నీటి మీద నడిచిన యేసు
22వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. 23ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24అప్పటికే ఆ పడవ ఒడ్డుకు దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి.
25రాత్రి నాల్గవ జామున#14:25 అంటే, ఉదయం మూడు గంటలకు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వెళ్లారు. 26ఆయన నీళ్ల మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకుంటూ భయంతో కేకలు వేశారు.
27వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.
28పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ల మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు.
29అందుకు యేసు, “రా!” అన్నారు.
పేతురు పడవ దిగి నీళ్ల మీద యేసువైపు నడిచాడు. 30కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేశాడు.
31వెంటనే యేసు తన చేయి చాపి పేతురును పట్టుకుని, “అల్ప విశ్వాసీ, నీవెందుకు అనుమానించావు?” అన్నారు.
32వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణగిపోయింది. 33అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
34వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు. 35అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కాబట్టి ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. 36నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు ఆయనను బ్రతిమాలారు. ముట్టిన వారందరు స్వస్థత పొందారు.

Позначайте

Поділитись

Копіювати

None

Хочете, щоб ваші позначення зберігалися на всіх ваших пристроях? Зареєструйтеся або увійдіть