ఆదికాండము 2
2
ఏడవ రోజు-విశ్రాంతి
1కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. 2దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు. 3ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు.
మొదటి మనిషి, ఏదెను తోట
4ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది. 5భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.
6భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. 7అప్పుడు యెహోవా దేవుడు నేలనుండి మట్టి తీసుకొని మనిషిని చేశాడు. మనిషి నాసికా రంధ్రాలలో జీవ వాయువును దేవుడు ఊదగా మనిషి సజీవుడు అయ్యాడు. 8అప్పుడు తూర్పున ఏదెను అను చోట ఒక తోటను యెహోవా వేశాడు. యెహోవా దేవుడు తాను చేసిన మనిషిని ఆ తోటలో ఉంచాడు. 9అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేశాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.
10ఏదెనులో నుండి ఒక నది ప్రవహిస్తూ ఆ తోటకు నీటిని ఇస్తుంది. ఆ నది పాయలై నాలుగు చిన్న నదులయింది. 11మొదటి నది పేరు పీషోను. ఇది హవీలా దేశం అంతటా ప్రవహించే నది. 12(ఆ దేశంలో బంగారం ఉంది, ఆ బంగారం చాలా మంచిది. ఆ దేశంలో బోళం, గోమేధికము కూడా ఉన్నాయి). 13రెండవ నది పేరు గీహోను. ఆ నది కూషు దేశమంతటా ప్రవహిస్తుంది. 14మూడో నది పేరు హిద్దెకెలు. ఆ నది అష్షూరు తూర్పు దిక్కున ప్రవహిస్తుంది. నాలుగో నది యూఫ్రటీసు.
15మనిషిని ఏదెను తోటలో యెహోవా దేవుడు ఉంచాడు. మొక్కలు నాటి తోటనుగూర్చి శ్రద్ధ తీసుకోవడం మనిషి పని. 16యెహోవా దేవుడు మనిషికి ఈ ఆజ్ఞ యిచ్చాడు: “ఈ తోటలోని ఏ చెట్టు ఫలమునైనా నీవు తినవచ్చు. 17అయితే మంచి, చెడ్డల తెలివిని ఇచ్చే చెట్టు ఫలమును నీవు తినకూడదు. ఆ చెట్టు పండు నీవు తిన్న రోజున తప్పక చస్తావు.”
మొదటి స్త్రీ
18అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.
19పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేశాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు. 20సాధు జంతువులన్నింటికీ, ఆకాశ పక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని, పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు. 21అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్లు చేశాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని ప్రక్క ఎముకలలో ఒకదాన్ని తీశాడు. ప్రక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేశాడు. 22స్త్రీని చేసేందుకు, అతని ప్రక్క ఎముకను యెహోవా దేవుడు ఉపయోగించాడు. అప్పుడు ఆ స్త్రీని ఆ పురుషుని దగ్గరకు యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు. 23అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు:
“ఇప్పుడు, ఇది నావంటి మనిషే.
ఆమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది.
ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది.
ఆమె నరునిలోనుండి తీయబడింది
గనుక ఆమెను నారి అంటాను.”
24ఇందువల్ల పురుషుడు తన తండ్రిని, తల్లిని విడిచి, తన భార్యను హత్తుకొంటాడు. వాళ్లిద్దరు ఏకమవుతారు.
25ఆ తోటలో ఆ పురుషుడు, అతని భార్యా నగ్నంగా ఉన్నారు. కాని వారికి సిగ్గు తెలియదు.
Đang chọn:
ఆదికాండము 2: TERV
Tô màu
Chia sẻ
Sao chép
Bạn muốn lưu những tô màu trên tất cả các thiết bị của mình? Đăng ký hoặc đăng nhập
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International