35
యాకోబు బేతేలుకు తిరిగి వెళ్లుట
1దేవుడు యాకోబుతో, “నీవు లేచి, బేతేలుకు వెళ్లి, అక్కడ స్థిరపడు, నీవు నీ సోదరుడైన ఏశావు నుండి పారిపోతున్నప్పుడు నీకు ప్రత్యక్షమైన దేవునికి అక్కడ బలిపీఠం కట్టు” అని అన్నారు.
2కాబట్టి యాకోబు తన ఇంటివారితో, తనతో ఉన్నవారందరితో అన్నాడు, “మీ దగ్గర ఉన్న ఇతర దేవతలను తీసివేయండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని శుభ్రమైన బట్టలు వేసుకోండి. 3తర్వాత నాతో బేతేలుకు రండి, అక్కడ నా శ్రమ దినాన నాకు జవాబిచ్చిన దేవునికి బలిపీఠం కడతాను.” 4కాబట్టి వారు తమ దగ్గర ఉన్న ఇతర దేవతలను, చెవి పోగులను యాకోబుకు ఇచ్చారు, యాకోబు వాటిని షెకెము ప్రాంతంలో ఒక సింధూర వృక్షం క్రింద పాతిపెట్టాడు. 5తర్వాత వారు బయలుదేరారు. వారి చుట్టూ ఉన్న పట్టణాలకు దేవుని భయం పట్టుకుంది, కాబట్టి వారిని ఎవ్వరూ వెంటాడలేదు.
6యాకోబు, అతనితో ఉన్న ప్రజలందరు కనాను దేశంలో ఉన్న లూజుకు (అంటే బేతేలుకు) వచ్చారు. 7అక్కడా అతడు బలిపీఠం కట్టి ఆ స్థలానికి ఎల్ బేతేలు#35:7 ఎల్ బేతేలు అంటే బేతేలు దేవుడు. అని పేరు పెట్టాడు. యాకోబు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు ఇక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యారు.
8ఆ తర్వాత రిబ్కా దాది, దెబోరా చనిపోయింది, బేతేలుకు దిగవ ఉన్న సింధూర వృక్షం క్రింద పాతిపెట్టబడింది. కాబట్టి ఆ వృక్షానికి అల్లోన్ బాకూత్#35:8 బాకూత్ అంటే ఏడ్చే సింధూరము. అని పేరు పెట్టారు.
9యాకోబు పద్దనరాము నుండి తిరిగి వచ్చాక, దేవుడు అతనికి మరలా ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు. 10దేవుడు అతనితో, “నీ పేరు యాకోబు, కానీ ఇక ఎన్నడు యాకోబుగా పిలువబడవు; నీ పేరు ఇశ్రాయేలు” అని అన్నారు. కాబట్టి ఆయన అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టారు.
11దేవుడు అతనితో అన్నారు, “నేను సర్వశక్తుడగు దేవుడను; నీవు ఫలించి, సంఖ్యాపరంగా అభివృద్ధి పొందు. ఒక జనం, జనాంగాల సమాజం నీ నుండి వస్తాయి, నీ వారసులలో నుండి రాజులు వస్తారు. 12అబ్రాహాముకు, ఇస్సాకుకు నేనిచ్చిన దేశాన్ని, నీకు కూడా ఇస్తాను. నీ తర్వాత నీ వారసులకు కూడా ఈ దేశాన్ని ఇస్తాను.” 13తర్వాత దేవుడు అతనితో మాట్లాడిన ఆ స్థలం నుండి ఆరోహణమయ్యారు.
14దేవుడు అతనితో మాట్లాడిన స్థలంలో, యాకోబు ఒక రాతి స్తంభాన్ని నిలబెట్టి, దాని మీద పానార్పణం కుమ్మరించాడు; నూనె కూడా దాని మీద పోశాడు. 15యాకోబు, దేవుడు తనతో మాట్లాడిన ఆ స్థలాన్ని బేతేలు#35:15 బేతేలు అంటే దేవుని మందిరం అని పేరు పెట్టాడు.
రాహేలు ఇస్సాకుల మరణాలు
16తర్వాత బేతేలు నుండి వారు బయలుదేరి వెళ్లారు. ఎఫ్రాతాకు కొద్ది దూరంలో ఉన్నప్పుడు రాహేలుకు కాన్పు నొప్పులు మొదలయ్యాయి. 17బిడ్డకు జన్మనివ్వడంలో చాల శ్రమపడింది. మంత్రసాని, “భయపడకమ్మా, నీవు ఇంకొక మగపిల్లవాన్ని కన్నావు” అని చెప్పింది. 18రాహేలు చనిపోతూ తన కుమారునికి బెన్-ఓని#35:18 బెన్-ఓని అంటే ఇబ్బంది పుత్రుడు అని పేరు పెట్టింది. కానీ అతని తండ్రి అతనికి బెన్యామీను#35:18 బెన్యామీను అంటే కుడిచేతి పుత్రుడు అని పేరు పెట్టాడు.
19కాబట్టి రాహేలు చనిపోయి, ఎఫ్రాతా (అనగా బేత్లెహేము) మార్గంలో పాతిపెట్టబడింది. 20యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని నిలబెట్టాడు, అది ఈ రోజు వరకు రాహేలు సమాధిని సూచిస్తుంది.
21ఇశ్రాయేలు మరలా ప్రయాణించి మిగ్దల్ ఏదెరు అవతల తన గుడారం వేసుకున్నాడు. 22ఇశ్రాయేలు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, రూబేను తన తండ్రి ఉంపుడుగత్తెయైన బిల్హాతో శయనించాడు, ఈ సంగతి ఇశ్రాయేలు విన్నాడు.
యాకోబు యొక్క పన్నెండుగురు కుమారులు:
23లేయా కుమారులు:
యాకోబు మొదటి కుమారుడు రూబేను,
షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను.
24రాహేలు కుమారులు:
యోసేపు, బెన్యామీను.
25రాహేలు దాసి బిల్హా కుమారులు:
దాను, నఫ్తాలి.
26లేయా దాసి జిల్పా కుమారులు:
గాదు, ఆషేరు.
వీరు పద్దనరాములో జన్మించిన యాకోబు కుమారులు.
27యాకోబు కిర్యత్-అర్బా (అంటే, హెబ్రోను) దగ్గర ఉన్న మమ్రేలో తన తండ్రి దగ్గరకు వచ్చాడు, అబ్రాహాము, ఇస్సాకు అక్కడే నివసించారు. 28ఇస్సాకు నూట ఎనభై సంవత్సరాలు బ్రతికాడు. 29అతడు తన తుది శ్వాస విడిచి, చనిపోయి మంచి వృద్ధాప్యంలో తన పూర్వికుల దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు, ఏశావు, యాకోబు అతన్ని పాతిపెట్టారు.