ఆది 37

37
యోసేపు కలలు
1యాకోబు తన తండ్రి ప్రవాసమున్న కనాను దేశంలో నివసించాడు.
2యాకోబు వంశావళి వివరాలు ఇవి.
యోసేపు పదిహేడు సంవత్సరాల యువకుడు, తన అన్నలతో, తన తండ్రి భార్యలైన బిల్హా జిల్పాల కుమారులతో కలిసి మందలను మేపుతూ ఉండేవాడు. వారు చేసే చెడు పనుల గురించి తండ్రికి చెప్పేవాడు.
3ఇశ్రాయేలు తన ఇతర కుమారుల కంటే యోసేపును ఎక్కువ ప్రేమించాడు, ఎందుకంటే అతడు తన వృద్ధాప్యంలో పుట్టినవాడు; అతని కోసం ఒక ప్రత్యేకమైన బాగా అలంకరించబడిన#37:3 హెబ్రీ భాషలో ఈ పదానికి ఖచ్చితమైన అర్థం తెలియదు; 23, 32 వచనాల్లో కూడ అంగీని కుట్టించాడు. 4తమ తండ్రి అతన్ని తమకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చూసి వారు యోసేపును ద్వేషించారు, అతని క్షేమసమాచారం కూడా అడగలేదు.
5ఒక రోజు యోసేపుకు ఒక కల వచ్చింది, అది తన అన్నలకు చెప్పినప్పుడు వారతన్ని మరీ ఎక్కువగా ద్వేషించారు. 6అతడు వారితో, “నాకు వచ్చిన కలను వినండి: 7మనం పొలంలో వరి పనలు కడుతున్నాము, అప్పుడు అకస్మాత్తుగా నా పన లేచి నిలబడింది, నా పన చుట్టూ మీ పనలు చేరి సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు.
8అతని అన్నలు అతనితో, “నీవు మమ్మల్ని ఏలాలి అనుకుంటున్నావా? నిజంగా మమ్మల్ని ఏలుతావా?” అని అన్నారు. అతని కలను బట్టి వారు అతన్ని ఇంకా ద్వేషించారు.
9అతనికి మరో కల వచ్చింది, “వినండి. నాకు ఇంకొక కల వచ్చింది, ఈసారి సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి” అని తన అన్నలకు చెప్పాడు.
10తన తండ్రికి తన అన్నలకు ఈ కలను గురించి చెప్పినప్పుడు, తన తండ్రి అతని గద్దిస్తూ, “నీకు వచ్చిన ఈ కల ఏంటి? నీ తల్లి, నేను, నీ అన్నలు నీ ఎదుట నిజంగా సాష్టాంగపడాలా?” అని అన్నాడు. 11యోసేపు అన్నలు అతనిపై అసూయపడ్డారు కానీ అతని తండ్రి ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకున్నాడు.
యోసేపు తన సోదరుల ద్వారా అమ్మివేయబడుట
12యోసేపు అన్నలు తమ తండ్రి మందలను మేపడానికి షెకెముకు వెళ్లారు. 13ఒక రోజు ఇశ్రాయేలు యోసేపుతో, “నీ అన్నలు షెకెము దగ్గర మందలను మేపుతున్నారని నీకు తెలుసు కదా. రా, నేను నిన్ను వారి దగ్గరకు పంపుతాను” అని అన్నాడు.
“సరే, మంచిది” అని అతడు జవాబిచ్చాడు.
14కాబట్టి యాకోబు, “వెళ్లు, నీ అన్నలు, అలాగే మందల యోగక్షేమాలు తెలుసుకుని, వచ్చి నాకు చెప్పు” అని యోసేపుతో అన్నాడు. తర్వాత అతడు హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు.
యోసేపు షెకెముకు చేరుకున్నప్పుడు, 15అతడు పొలాల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం ఒక మనుష్యుడు చూసి, “నీవు ఏం వెదకుతున్నావు?” అని అడిగాడు.
16యోసేపు జవాబిస్తూ, “నేను మా అన్నల కోసం వెదకుతున్నాను. వారు తమ మందలను ఎక్కడ మేపుతున్నారో మీరు చెప్పగలరా?” అని అడిగాడు.
17“వారు ఇక్కడినుండి వెళ్లిపోయారు. ‘మనం దోతానుకు వెళ్దాం’ అని వారు అనుకోవడం నేను విన్నాను” అని ఆ వ్యక్తి అన్నాడు.
కాబట్టి యోసేపు తన అన్నలను వెదుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు. 18అయితే వారు అతన్ని దూరం నుండి చూడగానే, అతడు వారిని చేరకముందే, వారు అతన్ని చంపడానికి కుట్రపన్నారు.
19“కలలు కనేవాడు వస్తున్నాడు!” అని వారు ఒకరితో ఒకరు అనుకున్నారు. 20“రండి, వాన్ని చంపి ఈ బావులలో ఒక దాంట్లో పడవేద్దాం, క్రూరమృగం చంపేసిందని చెప్పుదాము. అప్పుడు వీని కలలు ఏమైపోతాయో చూద్దాం” అని అనుకున్నారు.
21రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు. 22రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు.
23కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరకు రాగానే, అతడు వేసుకున్న రంగుల అంగీని చింపేశారు. 24అతన్ని తీసుకెళ్లి బావిలో పడద్రోసారు. ఆ బావి ఖాళీగా ఉంది; అందులో నీళ్లు లేవు.
25వారు భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు, కళ్ళెత్తి చూశారు, గిలాదు నుండి ఇష్మాయేలీయుల వర్తక బాటసారుల గుంపు ఒకటి రావడం కనిపించింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం మోస్తూ ఉన్నాయి, వారు వాటిని ఈజిప్టుకు తీసుకెళ్తున్నారు.
26యూదా తన అన్నలతో, “మన తమ్మున్ని చంపి, అతని రక్తం దాచిపెట్టడం ద్వారా మనకు ఉపయోగం ఏంటి? 27రండి, వీడిని మనం ఏమి హాని చేయకుండా, ఇష్మాయేలీయులకు అమ్మివేద్దాం; ఎంతైనా మన తమ్ముడు మన సొంత శరీరం కదా” అని అన్నాడు. అతని అన్నలు అందుకు ఒప్పుకున్నారు.
28కాబట్టి మిద్యాను వర్తకులు అటు వచ్చినప్పుడు, యోసేపును తన అన్నలు బావిలో నుండి బయటకు లాగి ఇరవై షెకెళ్ళ#37:28 అంటే 230 గ్రాములు వెండికి ఆ ఇష్మాయేలీయులకు అమ్మివేశారు, వారు అతన్ని ఈజిప్టుకు తీసుకెళ్లారు.
29రూబేను ఆ బావి దగ్గరకు తిరిగివచ్చి, అక్కడ యోసేపు లేడని చూసి, తన బట్టలు చింపుకున్నాడు. 30అతడు తన తమ్ముళ్ల దగ్గరకు తిరిగివెళ్లి, “ఆ బాలుడు అక్కడ లేడు! నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలి?” అని అన్నాడు.
31అప్పుడు వారు యోసేపు అంగీని తీసుకుని, ఒక మేకను చంపి దాని రక్తంలో ముంచారు. 32వారు ఆ రంగుల అంగీని తమ తండ్రి దగ్గరకు తీసుకెళ్లి, “మాకు ఇది దొరికింది. ఇది నీ కుమారుని చొక్కాయో కాదో చూడండి” అని అన్నారు.
33అతడు దానిని గుర్తుపట్టి, “ఈ చొక్కా నా కుమారునిదే! ఒక క్రూరమృగం అతన్ని మ్రింగివేసింది. ఖచ్చితంగా యోసేపును ముక్కలు చేసి ఉంటుంది” అని అన్నాడు.
34అప్పుడు యాకోబు తన బట్టలు చింపుకుని, గోనెపట్ట కట్టుకుని చాలా రోజులు తన కుమారుని కోసం ఏడ్చాడు. 35అతని కుమారులు, కుమార్తెలు అందరు అతని ఓదార్చడానికి ప్రయత్నించారు, కానీ అతడు ఓదార్పు పొందలేదు. అతడు వారితో, “లేదు, నేను సమాధిలో నా కుమారుని కలిసే వరకు నేను దుఃఖిస్తాను” అని అన్నాడు. అలా అతడు తన కుమారుని కోసం ఏడ్చాడు.
36ఇంతలో మిద్యానీయులు యోసేపును, ఈజిప్టులో ఫరో అధికారులలో ఒకడు, రాజ సంరక్షక సేనాధిపతియైన పోతీఫరుకు అమ్మివేశారు.

Okuqokiwe okwamanje:

ఆది 37: TSA

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume