YouVersion Logo
Search Icon

2 దినవృత్తాంతములు 15

15
1ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను 2–ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును, 3నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలాదినములు ఇశ్రాయేలీయులకులేకుండ పోవును. 4తమ శ్రమయందువారు ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవా యొద్దకు మళ్లుకొని ఆయనను వెదకి నపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. 5ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్క పెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానములేకుండెను. 6దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడు చేసెను. 7కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.
8ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి 9యూదా వారినందరిని బెన్యామీనీయుల నందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైనజనులు అతని పక్షము చేరిరి. 10ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి 11తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱెలను యెహోవాకు బలులుగా అర్పించి 12పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమపితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణచేయుదుమనియు 13పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలేగాని ఇశ్రాయేలీయులదేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్షచేసికొనిరి. 14వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. 15ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవావారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములులేకుండ వారికి నెమ్మది కలుగజేసెను. 16మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను. 17ఆసా ఉన్నతస్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదుగాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. 18తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను. 19ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in