YouVersion Logo
Search Icon

ఆదికాండము 48

48
1ఈ సంగతులైన తరువాత–ఇదిగో నీ తండ్రి కాయిలాగా ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడతడు మనష్షే ఎఫ్రాయిములు అను తన యిద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోగా, 2ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతట ఇశ్రాయేలు బలము తెచ్చుకొని తన మంచముమీద కూర్చుండెను. 3యోసేపును చూచి–కనాను దేశమందలి లూజులో సర్వశక్తిగల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి 4–ఇదిగో నీకు సంతానాభి వృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీవు జనముల సమూహ మగునట్లు చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్యస్వాస్థ్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. 5ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తుదేశములో నీకు పుట్టిన నీ యిద్దరు కుమారులు నా బిడ్డలే; రూబేను పిమ్యోనులవలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలైయుందురు. 6వారి తరువాత నీవు కనిన సంతానము నీదే; వారు తమ సహోదరుల స్వాస్థ్యమునుబట్టి వారి పేళ్ల చొప్పున పిలువబడుదురు. 7పద్దనరామునుండి నేను వచ్చుచున్నప్పుడు, ఎఫ్రాతాకు ఇంక కొంత దూరమున నుండగా మార్గమున రాహేలు కనాను దేశములో నా యెదుట మృతి పొందెను. అక్కడ బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున నేను ఆమెను పాతిపెట్టితినని యోసేపుతో చెప్పెను. 8ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా 9యోసేపు–వీరు నా కుమారులు, వీరిని ఈ దేశమందు దేవుడు నా కనుగ్ర హించెనని తన తండ్రితో చెప్పెను. అందుకతడు–నేను వారిని దీవించుటకు నా దగ్గరకు వారిని తీసికొనిరమ్మనెను. 10ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యమువలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేక పోయెను. యోసేపు వారిని అతనిదగ్గరకు తీసికొనివచ్చినప్పుడు అతడు వారిని ముద్దుపెట్టుకొని కౌగిలించుకొనెను. 11ఇశ్రాయేలు యోసే పుతో–నీ ముఖము చూచెదనని నేను అనుకొనలేదుగాని నీ సంతానమును దేవుడు నాకు కనుపరచియున్నాడనగా 12యోసేపు అతని మోకాళ్లమధ్యనుండి వారిని తీసికొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. 13తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమచేతితట్టున తన కుడిచేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడిచేతితట్టున తన యెడమ చేత మనష్షేను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసికొనివచ్చెను. 14మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తలమీద తన కుడిచేతిని మనష్షే తలమీద తన యెడమచేతిని ఉంచెను. 15అతడు యోసేపును దీవించి–నా పితరులైన అబ్రాహాము ఇస్సాకులు ఎవనియెదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటివరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, 16అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందువారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను. 17యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండి యెత్తి 18–నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను. 19అయినను అతని తండ్రి ఒప్పక–అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగునుగాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను. 20ఆ దినమందు అతడు వారిని దీవించి–ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవిం చెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. 21మరియు ఇశ్రాయేలు–ఇదిగో నేను చనిపోవుచున్నాను, అయినను దేవుడు మీకు తోడైయుండి మీపితరుల దేశమునకు మిమ్మును మరల తీసికొని పోవును. 22నేను నీ సహోదరులకంటె నీకు ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోను నా వింటితోను అమోరీయుల చేతిలోనుండి తీసికొంటినని యోసేపుతో చెప్పెను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ఆదికాండము 48