YouVersion Logo
Search Icon

సామెతలు 1

1
1దావీదు కుమారుడును ఇశ్రాయేలురాజునైన
సొలొమోను సామెతలు.
2జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును
వివేక సల్లాపములను గ్రహించుటకును
3నీతిన్యాయ యథార్థతల ననుసరించుటయందు
బుద్ధికుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును
4జ్ఞానములేనివారికి బుద్ధి కలిగించుటకును
యౌవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు.
5జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును
వివేకముగలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును.
6వీటిచేత సామెతలను భావసూచక విషయములను
జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు.
7యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలి
వికి మూలము
మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు.
8నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము
నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము.
9అవి నీ తలకు సొగసైన మాలికయు
నీ కంఠమునకు హారములునై యుండును
10నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా
ఒప్పకుము.
11–మాతోకూడ రమ్ము మనము ప్రాణముతీయుటకై
పొంచియుందము
నిర్దోషియైన యొకని పట్టుకొనుటకు దాగియుందము
12పాతాళము మనుష్యులను మ్రింగివేయునట్లు వారిని
జీవముతోనే మ్రింగివేయుదము
సమాధిలోనికి దిగువారు మ్రింగబడునట్లువారు పూర్ణ
బలముతోనుండగా మనము వారిని మ్రింగివేయు
దము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము.
13–పలువిధములైన మంచి సొత్తులు మనకు దొరుకును
మన యిండ్లను దోపుడుసొమ్ముతో నింపుకొందము
14నీవు మాతో పాలివాడవై యుండుము
మనకందరికిని సంచి ఒక్కటే యుండును అని వారు
నీతో చెప్పుదురు.
15నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము వారి
త్రోవలయందు నడువకుండ నీ పాదము వెనుకకు
తీసికొనుము.
16కీడుచేయుటకై వారి పాదములు పరుగులెత్తును
నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు.
17పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థము.
18వారు స్వనాశనమునకే పొంచియుందురు
తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు.
19ఆశాపాతకులందరి గతి అట్టిదే
దానిని స్వీకరించువారి ప్రాణము అది తీయును.
20జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది
సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది
21గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది
పురద్వారములలోను పట్టణములోను
జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది
22–ఎట్లనగా, జ్ఞానములేనివారలారా,
మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు?
అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు
ఆనందింతురు?
బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించు
కొందురు?
23నా గద్దింపు విని తిరుగుడి
ఆలకించుడి నా ఆత్మను మీమీద కుమ్మరించుదును
నా ఉపదేశమును మీకు తెలిపెదను.
24నేను పిలువగా మీరు వినకపోతిరి.
నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
25నేను చెప్పిన బోధ యేమియు మీరు వినక త్రోసివేసితిరి
నేను గద్దింపగా లోబడకపోతిరి.
26కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను
నవ్వెదను
మీకు భయము వచ్చునప్పుడు నేను అపహాస్యము
చేసెదను
27భయము మీమీదికి తుపానువలె వచ్చునప్పుడు
సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు
మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించునప్పుడు నేను
అపహాస్యము చేసెదను.
28అప్పుడు వారు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టెదరుగాని
నేను ప్రత్యుత్తరమియ్యకుందును
నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును.
29జ్ఞానము వారికి అసహ్యమాయెను
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వారి
కిష్టము లేకపోయెను.
30నా ఆలోచన విననొల్లకపోయిరి
నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి.
31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభవించెదరు
తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు
32జ్ఞానములేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు.
బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు.
33నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా
నివసించును
వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగానుండును.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in